కోహ్లీ సూప‌ర్బ్ సెంచ‌రీ.. జ‌డ్డూ నుండి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాక్కున్నందుకు విరాట్ క్ష‌మాప‌ణ‌

కోహ్లీ సూప‌ర్బ్ సెంచ‌రీ.. జ‌డ్డూ నుండి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాక్కున్నందుకు విరాట్ క్ష‌మాప‌ణ‌

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భార‌త్ హ‌వా కొన‌సాగుతుంది. ఆస్ట్రేలియాతో భార‌త విజ‌య ప్ర‌స్థానం మొద‌లు కాగా, అది కొన‌సాగుతూనే ఉంది. తాజాగా బంగ్లాదేశ్‌పై విజ‌యం సాధించి టీమిండియా వరుసగా నాలుగో విజయాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. పూణే వేదికగా జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అజేయ సెంచరీ సాధించ‌డంతో భార‌త్ 257 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది . టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది బంగ్లా జ‌ట్టు. ఓపెనర్లు తన్జిద్ హసన్(43 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51), లిటన్ దాస్(82 బంతుల్లో 7 ఫోర్లతో 66) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మహ్మదుల్లా(36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46), ముష్ఫికర్ రహీమ్(46 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 38) మెరుపులు మెరిపించ‌డంతో బంగ్లా మంచి స్కోర్ అయితే చేసింది.

ఇక 257 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త జ‌ట్టు ధీటుగానే ఆడింది.రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ కలిసి బంగ్లా బౌల‌ర్స్‌కి చెమ‌ట‌లు ప‌ట్టించారు. మొదటి ఓవర్ నుంచి బౌండరీల మోత మోగించిన రోహిత్ శర్మ 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి భారీ షాట్‌కి ప్ర‌య‌త్నించిన స‌మ‌యంలో ఔట‌య్యాడు. ఇక అర్ధ‌సెంచ‌రీ చేశాక గిల్ కూడా ఔట‌య్యాడు. ఈ క్ర‌మంలో 132 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది . ఇక 25 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ కూడా త్వ‌ర‌గానే పెవీలియ‌న్ చేరాడు. అయితే ఆ త‌ర్వాత కోహ్లీ అద్భుత‌మైన బ్యాటింగ్ చేసి భార‌త్ ఖాతాలో మ‌రో విజ‌యం చేరేలా చేశాడు.

భారత్ విజయానికి 15 పరుగులు కావాల్సిన సమయంలో విరాట్ స్ట్రైకింగ్ తీసుకొని బౌండ‌రీలు బాది మ‌రో సెంచరీ చేశాడు. నసుమ్ వేసిన 42 ఓవర్‌లో విరాట్ కోహ్లీ సిక్స్ బాది సెంచరీతో పాటు టీమిండియా విజయ లాంఛనాన్ని పూర్తి చేయ‌డంతో ఒక్క‌సారిగా గ్రౌండ్‌లో ప‌టాసుల మోత మోగింది. అయితే అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న కోహ్లీ.. తన సెంచరీ ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేస్తూ… ‘జడ్డూ నుంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను లాక్కున్నందుకు క్షమించండి అని న‌వ్వుతూ అన్నాడు. ప్రపంచకప్‌లో హాఫ్ సెంచరీలు చేస్తున్న నేను సెంచరీల్లా కన్వర్ట్ చేయలేకపోతున్నాను. కాని ఈ సెంచరీతో భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేయ‌డం సంతోషంగా ఉంద‌ని విరాట్ కోహ్లీ తెలియ‌జేశాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి వాతావరణం ఉండ‌డం, అంద‌రి మ‌ధ్య మంచి అండ‌ర్‌స్టాండింగ్ ఉండ‌డంతో దాని ఫ‌లితం మైదానంలో క‌నిపిస్తుంద‌ని కూడా తెలియ‌జేశాడు.