వామ‌ప‌క్షాల కంచుకోట‌గా జేఎన్‌యూ.. ఘోర ఓట‌మిపాలైన ఏబీవీపీ

జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ స్టూడెంట్స్ యూనియ‌న్ (JNUSU) ఎన్నిక‌ల్లో యూనైటెడ్ లెఫ్ట్ ప్యానెల్(వామ‌ప‌క్షాలు) విజ‌యం సాధించింది. దీంతో దాదాపు మూడు ద‌శాబ్దాల త‌ర్వాత జేఎన్‌యూఎస్‌యూ అధ్య‌క్ష ప‌ద‌వి ద‌ళిత విద్యార్థికి వ‌రించింది.

వామ‌ప‌క్షాల కంచుకోట‌గా జేఎన్‌యూ.. ఘోర ఓట‌మిపాలైన ఏబీవీపీ

న్యూఢిల్లీ : జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ స్టూడెంట్స్ యూనియ‌న్ (JNUSU) ఎన్నిక‌ల్లో యూనైటెడ్ లెఫ్ట్ ప్యానెల్(వామ‌ప‌క్షాలు) విజ‌యం సాధించింది. దీంతో దాదాపు మూడు ద‌శాబ్దాల త‌ర్వాత జేఎన్‌యూఎస్‌యూ అధ్య‌క్ష ప‌ద‌వి ద‌ళిత విద్యార్థికి వ‌రించింది.

ఈ ఎన్నిక‌ల్లో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘం ఏబీవీపీ ఘోర ఓట‌మి చ‌విచూసింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియ‌న్ ఎన్నిక‌ల్లో ఏబీవీపీ ఓడిపోవ‌డం కాస్త ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మే.

నాలుగేండ్ల‌ విరామం తర్వాత జరిగిన స్టూడెంట్స్ యూనియ‌న్ ఎన్నికల్లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేష‌న్ (AISA) నుంచి ద‌ళిత విద్యార్థి ధ‌నుంజ‌య్ భారీ విజ‌యం సాధించారు. ఏబీవీపీ త‌ర‌పున పోటీ చేసిన ఉమేష్ సీ అజ్మీరా ఓడిపోయారు. ధ‌నుంజ‌య్‌కు 2,598 ఓట్లు పోల‌వ్వ‌గా, ఉమేష్‌కు 1,676 ఓట్లు పోల‌య్యాయి.

ఎస్ఎఫ్ఐకి చెందిన అవిజిత్ ఘోష్‌ వైస్ ప్రెసిడెంట్ ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. ఏబీవీపీ అభ్య‌ర్థి దీపికా శ‌ర్మ‌పై అవిజిత్ 927 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఘోష్‌కు 2,409 ఓట్లు రాగా, దీపికాకు 1,482 ఓట్లు పోల‌య్యాయి. బిర్యా అంబేద్క‌ర్ ఫూలే స్టూడెంట్స్ అసోసియేష‌న్ అభ్య‌ర్థి ప్రియాన్సి ఆర్య జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా గెలిచారు. ఏబీవీపీ అభ్య‌ర్థి అరుణ్ ఆనంద్‌పై 926 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. జాయింట్ సెక్ర‌ట‌రీగా వామ‌ప‌క్షాల అభ్య‌ర్థి మ‌హ్మ‌ద్ సాజిద్ గెలుపొందారు. సాజిద్ చేతిలో ఏబీవీపీ అభ్యర్థి గోవింద్ డాంగీ 508 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొత్తానికి జేఎన్‌యూలో వామ‌ప‌క్షాల‌కు సంబంధించిన ప్యానెల్ విజ‌యం సాధించ‌డంతో.. ఇప్పుడు జేఎన్‌యూ వామ‌ప‌క్ష కంచుకోట‌గా మారింది. శుక్రవారం నిర్వ‌హించిన ఈ ఎన్నికల్లో గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 73 శాతం ఓటింగ్ నమోదైంది.