Journey of PDSU । ఎగిసిన కెరటానికెదురుగా ఎన్నెన్నో సవాళ్లు..

ఈ ఐదు దశాబ్దాల పీడీఎస్‌యూ విప్లవ విద్యార్థి ఉద్యమం సాధారణ విద్యార్థులపై, ప్రజలపై ఎంత సానుకూల ప్రభావం చూపెట్టిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ పయనంలో జరిగిన చీలికలు, నెలకొన్న విభేదాలు అంతకంటే ఎక్కువ ప్రభావాన్ని కనబరిచిందని గుర్తించాలని విన్నపం. ఈ క్రమంలో ఏ శిబిరమైన త్యాగాల వారసత్వం కొనసాగింది అనేది వాస్తవం. ఇప్పటికైనా ఈ వేరువేరు శిబిరాలు ఐక్యం కావాలని కోరిక బలంగా ఉంది.

Journey of PDSU । ఎగిసిన కెరటానికెదురుగా ఎన్నెన్నో సవాళ్లు..
  • ఐదు దశాబ్దాల పీడీఎస్‌యూ ఉద్యమ పయనంలో అనేక ఒడిదుడుకులు
  • 50 వసంతాల సందర్భంగా చర్చ అవసరం

Journey of PDSU । పీడీఎస్‌యూ ఈ నాలుగక్షరాలు… విప్లవ విద్యార్థి ఉద్యమ చోదక శక్తిగా నిలిచి, గెలిచింది. విద్యార్థి సంఘమైనా విప్లవోద్యమానికి ఊతకర్రగా మారి, ఉద్యమ ప్రవాహాంగా తీర్చిదిద్దుకుంది. ప్రగతిశీలతకు ప్రతీకగా. పరిణామానికి ప్రతిబింబంగా. త్యాగాల దారిలో ఆగిపోని బాటసారిగా మారి పోరుదారిలోఎదురేగింది. ఐదు దశాబ్దాల అలుపెరుగని పోరాటంలో అనేకానేక ఎత్తుపల్లాలూ.. ఎదురీతల మధ్య  కారిన కన్నీళ్ళను ఒత్తుకున్నది. ఒరిగిన అమరులను గుండెల నిండుగా ఎత్తుకున్నది. ఎగిరేసిన జెండా కోసం  కష్టాలూ..  నష్టాలు ఎదుర్కొన్నది. విభేదాలు, విభిన్నాభిప్రాయాలతో చీలికల మధ్య విలువైన… మంచీ, చెడూ అనుభవాలను సాధించుకున్నది. ఆశ..నిరాశలతో అప్పుడప్పుడు అలిసిపోయినా… అనుకోని మజిలీ నడుమ అనుభవాల గనితో వినువీధికెగిసింది. ఎరుపెక్కిన బిగిపిడికిలిని సమున్నతంగా ఎగిరేస్తూ… ఎత్తిపట్టిన ఆశయాల కోసం ఒరిగిన వీరులు చూపిన దారిలో పొలికేక వేస్తోంది. పోరుకు సై అంటుంది. ఆటుపోట్ల మధ్య అలల్లా ముందుకేగుతూ కలలను సాకారం చేసేందుకు అవిశ్రాంతంగా నడుస్తోంది. ఎంచుకున్న లక్ష్యసాధనకు ఐదు దశాబ్దాలుగా అలుపెరుగకుండా పయనిస్తోంది. పరిసరాలంతటా ప్రగతిశీల పరిమాళాలు వెదజల్లుతూ విప్లవ భావాల తోట విరబూస్తోంది.

 

జీనా హైతో మర్‌నా సీఖో!

కడలి అంతరంగమంత

కన్నీటి పక్షపాతంలో

కలల సౌధం నిండిన కర్తవ్యోన్ముఖత!

అలల్లా ఎగిసిపడే గలగల

జలపాత ఒరవడితో మది నిండా మమతానురాగం!

 

నిండైన విగ్రహంలో మెండైన

నిగ్రహంతో

ఆత్మవిశ్వాస ఆలోచనల్లో

ఆవేశ సెగలు!

ఆత్మరక్షణలో అంతులేని ధగధగ!

ఆ…అభినివేశంలో

ఆకాశమంతెత్తున

ఎగిసిపడే అత్యున్నత లక్ష్యం!

 

మతోన్మాద గుండెల్లో భగభగ

మండే అగ్నిగుండం!

 

సుడిగాలిలా చుట్టుముట్టి

మది తలుపులు తెరిచి

మనల్ని

ముప్పరిగొనే ముచ్చటైన జడివాన!

 

పారే సెలయేరులా

పరిసరాలన్నీ పరవశమెత్తి

అరుణారుణ తొలిపొద్దు వర్ణమై

పురివిప్పిన ఆకుపచ్చని ఆశల్లో

నెమలి నాట్య పరివర్తనం!

 

జీనా హైతో మర్‌నా సీఖో!

కదమ్‌ కదమ్‌ పర్ లడ్‌నా సీఖో’!

నిప్పుల

నినాదమై నింగికెగిసిన చంద్రవంక!

 

***

చరిత్ర గమనాన్ని పరిశీలిస్తే మనకు అనేక విషయాలు అర్థమవుతాయి. విప్లవ ఉద్యమాలు, ప్రగతిశీల ఉద్యమాలు ప్రారంభమైన తొలినాళ్ళ నుంచి అనేక అడ్డంకులు ఎదుర్కొన్నాయి.

ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ తొలినాళ్లలోనే హిందూ మతోన్మాద శక్తుల నుంచి ప్రధానమైన అడ్డంకి ఏర్పడిన విషయం మనం ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రధానంగా ఆరెస్సెస్‌, ఏబీవీపీ తదితర మతోన్మాద, మనువాద సంస్థల నుంచి అవరోధాలు ఏర్పడితే దానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాని  అనుబంధ  విద్యార్థి సంఘాల సహకారం తోడైందని మనకు స్పష్టంగా తేలుతోంది.

ఎందుకంటే గత అనుభవాలను  విశ్లేషించినప్పుడు హిందూ మతోన్మాద శక్తుల ప్రణాళికలో దాగిన కుట్రలు మనకు సులభంగా అర్థమవుతాయి.

అప్పటి వరకు ఇంటా బయట ఆడింది ఆట , పాడింది పాటగా సాగిన మతోన్మాద, ప్యూడల్ శక్తులకు 70 దశకంలో అడ్డంకులు, అవరోధాలు ఏర్పడ్డాయి. అది కూడా విద్యాలయాల్లో ఎదురుకావడంతో తట్టుకోలేకపోయారు.

ఇక మిగిలిన సమాజంలో అణగారిన వర్గాలు,కులాల పై భూస్వామ్య శక్తుల ఆధిపత్యం, అణచివేత, దోపిడీ యధేచ్చగా కొనసాగిన కాలం. రాజకీయ రంగం పూర్తిగా వారి కనుసన్నల్లోనే నడిచింది.

ఈ పరిస్థితికి  భిన్నమైన వాతావరణం విద్యాసంస్థల్లో ఒక్కసారిగా ఎదురుకావడంతో హిందూ మతోన్మాద శక్తులు తట్టుకోలేక పోయాయి. అప్పుడప్పుడే కిందికులాలు, వర్గాల నుంచి పిల్లలకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తున్నాయి. వారు ఆత్మగౌరవం కోసం ప్రశ్నించడం ప్రారంభమైంది.

ఈ పరిస్థితికి తోడు దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ప్రజా, రైతాంగ ఉద్యమాల ప్రభావం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సాగిన విప్లవోద్యమాల తీవ్రత ఉంది. పర్యవసానంగా విద్యార్థుల్లో ఆలోచన ప్రారంభమైంది.

ఉస్మానియా వర్సిటీలో ఈ ఎదురు తిరగడం జార్జ్ లాంటి విద్యార్థుల చొరవతో ప్రారంభమైంది. ఈ ప్రశ్నించే స్వభావాన్ని, ప్రగతిశీల శక్తులను చూసి తట్టుకోలేక పోయారు. తమ ఆధిపత్యానికి, అహంకారానికి గండిపడడాన్ని భరించలేక పోయారు.

ఎందుకంటే విద్యార్థి శక్తి విస్ఫోటంగా మారుతుందని వారు గ్రహించారు. అందుకే ప్రగతిశీల భావాలు కల విద్యార్థి సమూహాలు ఎక్కడ ప్రారంభమైనా అక్కడ అత్యంత పాశవికంగా దాడులను ఎదుర్కొన్నాయి.

దీనికి 1970 దశకంలో జార్జి నేతృత్వంలో ఎదురైనా అనుభవాలు మన కళ్ల ముందు ఉన్నాయి. ‘జీనా హైతో మర్‌నా సీఖో… కదమ్‌ కదమ్‌ పర్ లడ్‌నా సీఖో’ అంటూ విద్యార్థిలోకంపై ఆయన చెరగని ముద్రవేశారు. మతోన్మాద గుండాల చేతుల్లో ప్రాణత్యాగం చేశారు.

జార్జి రెడ్డి హత్య కూడా ఈ కోణంలో పరిశీలించినప్పుడు మనకు హిందుత్వ శక్తుల ప్రతి ఘాతుక విధానాలు అర్థమవుతాయి. అందుకే పదునైన జ్ఞానంతో ముందుకు వచ్చే విద్యార్ధి లోకాన్ని అడ్డుకోవడం తొలి కర్తవ్యంగా భావిస్తుంటారు.

ఇదిలా ఉండగా హిందుత్వ శక్తుల విద్యార్థి ప్రతినిధులుగా ఉండే ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్‌లో సమాజ నిరోధక విద్యార్థులంతా భాగస్వామ్యం కావడాన్ని కూడా మనం గమనించవచ్చు. వీరికి గుండాలు, రాజ్యం సహకారం ప్రత్యక్షంగా, పరోక్షంగా లభిస్తోందని అర్థం చేసుకోవాలి.

అధికారంలో కాంగ్రెస్ ఉన్నా, విద్యార్థులుగా మాత్రం ప్యూడల్ శక్తులు మతోన్మాద సంస్థల్లో మాత్రమే పోలరైజేషన్ అయిన అనుభవం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. క్యాంపస్‌లో అప్పటికి వారిదే ఆధిపత్యం కొనసాగుతున్నకాలం.

అందుకే జార్జ్ లాంటి ప్రశ్నించే వ్యక్తిని భౌతికంగా నిర్మూలించేందుకు ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. తమ ఆధిపత్యాన్ని పరిరక్షణకు ఎంతకైనా తెగబడుతారనేది చరిత్ర నేర్పుతోన్న పాఠం.

ఇదిలావుండగా

సాధారణ సమాజంలో అనేక వర్గాలు, కులాలు, జాతులు, తెగలు తదితర సమూహాలు ఉన్నప్పటికీ, ఇవన్నీ కూడా జనరల్ హిందూ మత ప్రభావం నీడలోనే ఇప్పటికీ మనుగడ సాగిస్తున్నాయి. కేవలం ప్రభావంలో తరతమ తేడాలున్నాయి. అంటే పైకి గంభీరంగా మనమేది చెప్పినప్పటికీ సమాజంలోని మెజారిటీ భాగం హిందూ మత ప్రభావంలో ఉందనే సత్యాన్ని గ్రహించాల్సి ఉంది.

హిందూ మతానికీ సంబంధంలేని తెగలు, జాతులు, ముఖ్యంగా గిరిజనులు సైతం దీని గొడుగు కిందకు చేరి తమకున్న ప్రత్యేకతను, అస్థిత్వాలను కోల్పోతున్నారు. ఒక విధంగా సంప్రదాయ పరంగా, సాంస్కృతిక పరంగా సాగుతున్న ఆధిపత్యం అణిచివేతకు తల ఒగ్గి తమ జీవనం సాగిస్తున్నాయి. అణిగిమణిగి జీవిస్తున్నారు.

అప్పుడప్పుడు అరుదుగా కొన్ని  సందర్భాలలో ప్రతిఘటన ఎదుర్కొంటున్నప్పటికీ పెద్దగా సంప్రదాయ హిందూ సంస్కృతి పై ఎదురు దాడి చేస్తున్న సంఘటనలు చాలా అరుదుగా ఉంటున్నాయి. ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రతిపాదించి అమలుచేయడంలో అందరి వైఫల్యం కొనసాగుతున్నది. ఇది మతోన్మాద శక్తులకు వరంగా మారింది. మరింత రెచ్చిపోతున్నారు.

ఇటీవల దేశవ్యాప్తంగా పెరిగిన మతోన్మాద శక్తుల ప్రభావం తర్వాత రాజకీయ పోలరైజేషన్‌లు మనకు చెబుతున్న నిజం. నిన్నమొన్నటి దాకా  లౌకికవాదులుగా,  చెప్పుకున్న వ్యక్తులు, పార్టీల నిజస్వరూపం బహిర్గతమైతోంది.

అందుకే హిందుత్వ శక్తుల ముందస్తు వ్యూహాలను ఆలోచనలను పసిగట్టకుండా వాటిని అడ్డుకునే ప్రణాళికలు రూపొందించి అమలు చేయకుండా ఎన్ని మాటలు చెప్పిన ఆచరణలో ప్రయోజనం ఉండదు. తాజా పరిణామాలు ప్రగతిశీల శక్తులకు, అభివృద్ధి కాముకులకు శరాఘాతం లాంటిది. విశాల ప్రజారాశులు, పీడితుల ఐక్యత దీనికి ప్రత్యామ్నాయం.

ఇదే జార్జ్ హత్య మనకు నేర్పుతోన్న గుణపాఠం. ప్రస్తుత దృక్పథానికి మహోన్నత వ్యక్తి అంబేద్కర్ ఆలోచనలను కూడా జోడించి జోడెడ్ల మాదిరి ముందుకు సాగినప్పుడే సానుకూల ఫలితాలు వస్తాయి. విశాల ఐక్యతకు పునాది అవసరం. హిందుత్వపు ప్రధాన పునాదిగా నిలుస్తున్న వర్ణ వ్యవస్థ దానికి ఆయువుపట్టుగా ఉన్న కులం పైన అంబేద్కర్ విశేష అధ్యయనం కొనసాగించడమే కాకుండా కుల నిర్మూలన న అవసరమైన చర్యలు చూపెట్టిన నేపథ్యంలో ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఉపయోగించుకోవాల్సిన చారిత్రక అవసరం అనివార్యమైంది. ఈ దిశగా విప్లవ శక్తులు విజ్ఞతతో కృషి చేయాలనే అభిప్రాయం ఇప్పటికే ఉంది. యాదృచ్ఛికమైనా అంబేద్కర్ జయంతి రోజున జార్జ్‌ హత్యగావించబడడం గమనార్హం.

 

**

జైభీమ్

అలకని ఆకలి విత్తనం

ఎదిగి ఎట్టికి ఎదురీది

ఎడారిని పరిహసించిన

గరిక మొలక

గుడ్డి ఎడ్డితనంపై

ఎదురు తిరిగిన గడ్డిపూవు

అష్ట దిగ్బంధం నడుమ

కష్టించిన మట్టి పుష్పం

జ్ఞాన పరిమళాలు వికసించి

వెలివాడల

ఇనుప గోడలు బద్దలు కొట్టి

నాలుగు బాటలు కూడిన

ఈ నేల నడిబజార్లో

నిలబడి

దేశానికి చూపుడు వేలై నిలిచింది

నిన్నూ నిలేస్తూ….!

– ఐక్యత అత్యంత అవసరకాలం

 

ఈ ఐదు దశాబ్దాల పీడీఎస్‌యూ విప్లవ విద్యార్థి ఉద్యమం సాధారణ విద్యార్థులపై,  ప్రజలపై ఎంత సానుకూల ప్రభావం చూపెట్టిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ పయనంలో జరిగిన చీలికలు, నెలకొన్న విభేదాలు అంతకంటే ఎక్కువ ప్రభావాన్ని కనబరిచిందని గుర్తించాలని విన్నపం. ఈ క్రమంలో ఏ శిబిరమైన త్యాగాల వారసత్వం కొనసాగింది అనేది వాస్తవం. ఇప్పటికైనా ఈ వేరువేరు శిబిరాలు ఐక్యం కావాలని కోరిక బలంగా ఉంది. కనీసం పీడీఎస్‌యూ లాంటి ప్రజాసంఘాల మేరకైనా కలిసి ఒకే సంఘంగా పని చేయాలని లేదా ఐక్య కార్యాచరణను నిరంతరం కొనసాగించేందుకు బాటలు వేయాలనే ఆకాంక్ష సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ఈ దిశగా ముఖ్యంగా నాయకత్వస్థాయి మిత్రులు ముందడుగు వేయాలని, కార్యకర్త నుంచి సానుభూతిపరుని వరకు ఈ ప్రయత్నం విజయవంతం కోసం ఒత్తిడి తేవాలని విప్లవ అభిమానులలో గట్టి అభిప్రాయం ఉంది. ఇలాంటి 50 వసంతాల లాంటి సందర్భాలు వేదికగా మారాలని కోరుకుంటున్నారు.  ఇంకోవైపు ఈ గడ్డుకాలంలో కలిసి ముందుకు సాగితే ఎడారిలో ఒయాసిస్సులా కాసింత ఊరటనిస్తోంది.

***

ఐదు దశాబ్దాల

అమరత్వంలో రమణీయం!

ఒలికిన నెత్తుటి ధారలో

ఒరిగిన శిఖరాలు!

 

కాలిన కడుపుల కన్నీటి

చిచ్చులో

మిగిలిందేమిటీ? మిత్రమా!

 

మధ్యంతరమంతా

చీలికల పేలికలతో ఎత్తిన

ఆధిపత్యంలో

బిత్తర చూపుల తత్తరపాటు!

 

అత్తెసరు మార్పులతో

అందరూ

అదే బాటలో ఇదేమాట!

ఆఖరి తీర్పులో

గెలుపెవరిదీ? ఓటమెవరిదీ?

 

✍️  రవి సంగోజు