పాకిస్తాన్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ వైమానికి స్థావరంపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. మియాన్‌వాలీ ట్రైనింగ్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున దాడి చేసినట్లు పాక్ మిలటరీ నిర్ధారించింది. అయితే ఉగ్రవాదుల దాడులను పాక్ వైమానిక దళం తిప్పికొట్టింది. ముగ్గురు ఉగ్రవాదులను పాక్ ఆర్మీ మట్టుబెట్టింది. మరో ముగ్గురిని కార్నర్ చేసింది. ఈ దాడుల్లో మూడు విమానాలు, ఇంధనం ట్యాంకర్ ధ్వంసమైనట్లు పాక్ ఆర్మీ తెలిపింది.
ఈ దాడులు తమ పనేనని తెహ్రిక్ ఏ జిహాద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఫైటర్ జెట్లు ఉన్న స్థావరంలోకి ఐదు నుంచి ఆరుగురు ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున చొరబాటుకు యత్నించారని పాక్ ఎయిర్ ఫోర్స్ ధ్రువీకరించింది. దేశం నుంచి ఉగ్రవాదుల్ని రూపుమాపేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు పాక్ మిలిటరీ తెలిపింది.
శుక్రవారం కూడా పాకిస్థాన్‌లో ఉగ్రదాడి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో పోలీసుల వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు బాంబులతో దాడులకు పాల్పడ్డారు. ఐదుగురు మరణించారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. గతేడాది నవంబర్‌లో పాకిస్తాన్ ప్రభుత్వంతో తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం పూర్తయినప్పటి నుంచి దేశంలో మళ్లీ ఉగ్రవాదం ఊపందుకుంది.