KTR | పిప్పరమెంట్లు కొన్న మంత్రి కేటీఆర్.. వృద్ధుడు ఫిదా

KTR | జీవితంలో ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ సామెతను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఒంటబట్టించుకున్నారు. ఎందుకంటే రాజకీయ జీవితంలో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ.. కొన్ని సందర్భాల్లో ఓపికగా వ్యవహరిస్తూ, అందర్నీ ఆప్యాయంగా పలుకరిస్తుంటారు. తన ప్రయాణంలో తనకు తారసపడే పేదలను, అభాగ్యులను కేటీఆర్ అక్కున చేర్చుకుంటారు. ఆ విధంగానే పిప్పరమెంట్లు, చాక్లెట్లు అమ్ముకునే ఓ వృద్ధుడిని కేటీఆర్ ఆప్యాయంగా పలుకరించారు. అంతేకాదు అతని వద్ద పిప్పరమెంట్లు కొని, తన గొప్పమనసును చాటుకున్నారు కేటీఆర్. దీంతో ఆ వృద్ధుడు, అక్కడున్న న్యాయవాదులు ఫిదా అయిపోయారు.
అసలేం జరిగిందంటే..?
ఇందిరా పార్కు, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు, జలవిహార్.. ఈ ప్రాంతాల్లో ఎక్కడా సమావేశాలు జరిగినా.. పిప్పరమెంట్లు, చాక్లెట్లు అమ్మే వృద్ధుడు సత్యనారాయణ వాలిపోతాడు. శనివారం జలవిహార్‌లో జరిగిన తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనానికి కేటీఆర్ హాజరయ్యారు. వేదికపై ఆసీనులైన కేటీఆర్‌ను చూసిన సత్యనారాయణ.. పిప్పరమెంట్లు తీసుకోవాలని వినయంగా సైగ చేశాడు. మంత్రి నవ్వుతూ వేదిక కింద ఉన్న సత్యనారాయణ వద్దకు వచ్చారు. పిప్పరమెంట్లు తీసుకొని బాగున్నారా.. అని ఆ వృద్ధుడిని కేటీఆర్ ఆప్యాయంగా పలుకరించారు. సత్యనారాయణ నవ్వుతూ నేను తెలుసా సారూ.. అని అడగ్గా, ఇంతకుముందూ ఇలానే చూసినట్లు గుర్తుందని కేటీఆర్ బదులిచ్చారు.
ఇక మంత్రి కేటీఆర్ సూచనతో సత్యనారాయణ వివరాలను గన్‌మెన్ సేకరించారు. తాను ఒంటరిగా ఉంటున్నానని, ఉండడానికి గూడు లేదని, పాతబస్తీలో ఉంటున్నట్లు వృద్ధుడు తెలిపాడు. వయసు మీద పడటంతో ఎక్కువగా తిరగకలేక పోతున్నానని, చిన్న దుకాణం పెట్టుకునేందుకు సాయం చేయాలని కోరాడు సత్యనారాయణ.