Mallikarjun Kharge| కొత్త పాత నేతలను కలుపుకుపోవాలి : ఖర్గే

Mallikarjun Kharge| కొత్త పాత నేతలను కలుపుకుపోవాలి : ఖర్గే

జాబితా ఇవ్వండి..వెంటనే భర్తీ చేస్తా
నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి
పీఏసీ, అడ్వయిజరీ కమిటీలో కీలక చర్చ

విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ లోని కొత్త పాత నేతలను కలుపుకుని ముందుకెళ్లాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సూచించారు. సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకరావాలని..నేతలంతా ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తో కోఆర్డీనేషన్ చేసుకోవాలని ఖర్గే తెలిపారు. ఏదైనా మీటింగ్ లోనే మాట్లాడాలే తప్పా..మీడియా ముందు మాట్లాడరాదని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ, అడ్వయిజరీ కమిటీలు..టీపీసీసీవిస్తృత కార్యవర్గ సమావేశంలో ఖర్గే మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కుల గణనపై ప్రభుత్వ పనితీరు అభినందనీయం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు అంతా సిద్దం కావాలని..ఈ ఉప ఎన్నికలలో గెలిచి తీరాలని.. చాలెంజ్ గా తీసుకొని జాగ్రత్తగా పని చేసుకోండని సూచించారు.

జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్దం

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికల సిద్ధంగానే ఉన్నామన్నారు. పార్టీ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి నా వద్ధ ఏమి పెండింగ్ లో లేవని..జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు జాబితా పంపిస్తే వెంటనే వాటిని భర్తీ చేస్తానని స్పష్టం చేశారు. గతంలో కూడా నేను ఇదే మాట చెప్పానని..మీరు జాబితా పంపడమే ఆలస్యమన్నారు. పార్టీ పదవితోనే అందరికీ గౌరవం, గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ పదవులను క్యాజువల్ గా తీసుకోవద్దని సూచించారు. రాజకీయాల్లో మీ ఎదుగుదలకు పార్టీ పదవులు ఉపయోగపడుతాయన్నారు. నేను పీసీసీగా ఉన్న సమయంలో 45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నామని తెలిపారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ, పార్టీ జిల్లా అధ్యక్షుల్లో చాలా మందికి మన ప్రభుత్వంలో పదవులు వరించాయని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయని..నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషను, జమిలీ ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయని తెలిపారు. నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలన్నారు. మీరు నాయకులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలన్నారు. గ్రామాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో పర్యటించి సమన్వయంతో పనిచేయాలన్నారు.

దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని..కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి జనగణనలో కుల గణన చేసేలా చేయడంలో మనం విజయం సాధించామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో మనం చాలా విజయాలు సాధించామన్నారు. మన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని..మనందరం కలిసికట్టుగా ఈరోజు నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుని కష్టపడి మళ్లీ రెండోసారి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావాలని తెలిపారు. రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్ దే అధికారం అని..సుదీర్ఘ కాలం ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన అరుదైన ఘనత మల్లికార్జున ఖర్గేదేనని గుర్తు చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు.

పీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఆయా సమావేశాల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సీ. వేణుగోపాల్ , ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాధన్, పీఏసీ, అడ్వయిజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.