Rameshwaram Cafe Blast | బెంగళూరు రామేశ్వరం కేఫ్‌ బ్లాస్ట్‌.. వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన కేంద్రమంత్రి శోభా

Rameshwaram Cafe Blast | బెంగళూరు రామేశ్వరం కేఫ్‌ బ్లాస్ట్‌.. వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన కేంద్రమంత్రి శోభా

Rameshwaram Cafe Blast | బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసులో వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే క్షమాపణలు చెప్పారు. ఆమె పేలుడులో పాల్గొన్న నిందితుడు తమిళనాడు వాసి అని ఆరోపించారు. బాంబు పేలుళ్ల నిందితులు తమిళనాడులోని కృష్ణగిరి అడవుల్లో శిక్షణ పొందారని బీజేపీ నేత ఆరోపించారు. అయితే, కేంద్రమంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కేంద్రమంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ‘నా వ్యాఖ్యలతో ఎవరినీ నొప్పించేలా చేయలేదని తమిళ సోదరులు, సోదరీమణులకు స్పష్టం చేయాలనుకుంటున్నాను. నా వ్యాఖ్యలతో కొందరు బాధపడ్డారు. దీనికి నేను క్షమాపణలు కోరుతున్నాను.నా వ్యాఖ్యలు కేవలం బ్లాస్ట్‌కు సంబంధించినవి మాత్రమే. హృదయపూర్వకంగా నేను క్షమాపణలు కోరుతున్నాను.

గత వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. అయితే, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ హిందువులు, బీజేపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునేందుకు రాడికల్‌ ఎలిమెంట్స్‌ను ప్రోత్సహిస్తున్నారని కేంద్రమంత్రి ఆరోపించారు. బుజ్జగింపు రాజకీయాలు హిందువులు, బీజేపీ కార్యకర్తలపై దాడి చేసేందుకు ఛాందసవాద ఎలిమెంట్స్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. స్టాలిన్‌ వల్లే ఐఎస్‌లాంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తులు బాంబు పేలుళ్లకు పాల్పడుతున్నారని కేంద్రమంత్రి ట్వీట్‌ చేశారు. అయితే, కేంద్రమంత్రి వ్యాఖ్యలపై స్టాలిన్‌ మండిపడ్డారు.కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను త్రీవంగా ఖండిస్తున్నానని స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు. ఇలాంటి వాదనలు కేవలం ఎన్‌ఐఏ, రామేశ్వరం కేఫ్‌ పేలుడుకు దగ్గరగా ఉన్నవారు మాత్రమే చేయవచ్చని.. ఇలాంటి వ్యాఖ్యలు చేసేందుకు కేంద్రమంత్రికి అర్హత లేదన్నారు.

కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ విభజన వైఖరిని తమిళులు, కన్నడిగులు తిరస్కరిస్తారన్నారు. శాంతి, సామరస్యం, దేశ సమైక్యతకు విఘాతం కలిగిస్తున్న మంత్రి శోభపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా.. రామేశ్వరం కేఫ్‌ బ్లాస్‌ కేసులో ప్రధాన నిందితుడిని కలిసిన వ్యక్తిన ఎన్‌ఐఏ మార్చి 13న కస్టడీలోకి తీసుకున్నది. పేలుడుకు సంబంధించిన పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న సమయంలో ప్రధాన నిందితుడికి సంబంధించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ తెలిపింది. కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు చెందిన సయ్యద్ షబ్బీర్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది.