బౌలింగ్‌తో అదరగొట్టిన విరాట్, రోహిత్..వరుసగా 9 మ్యాచ్‌లలో గెలిచి సత్తా చాటిన ఇండియన్ టీం

వన్డే వరల్డ్ కప్ 2023లో లీగులు ముగిసాయి. నవంబర్ 14, 15 తేదీలలో సెమీస్ జరగనుండగా, ఫైనల్ నవంబర్ 17న జరగనుంది. తొలి సెమీస్ ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరగనుండగా, రెండో సెమీస్ సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. అయితే ఈ సారి కప్ ఎవరు కొడతారా అనే ఆసక్తి అందరిలో ఉంది. ఇదిలా ఉంటే ఈ టోర్నోలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. లీగుల్లో 9 మ్యాచ్ లు ఆడిన భారత్ వరుసగా 9 మ్యాచ్‌లు గెలిచింది. నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 పరుగులు చేసింది.శ్రేయస్ అయ్యర్(94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 128 నాటౌట్), కేఎల్ రాహుల్(64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 102) శతకాలతో అదరగొట్టగా.. రోహిత్ శర్మ(54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61), శుభ్‌మన్ గిల్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51), విరాట్ కోహ్లీ(56 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్ బ్యాట్స్‌మెన్స్ కి బౌలర్స్ చుక్కలు చూపించారు.ఈ క్రమంలోనే ఆ జట్టు 47.5 ఓవర్లలో 250 పరుగులకు కుప్పకూలింది. తెలుగు తేజం తేజ నిడమనూరు(39 బంతుల్లో ఫోర్, 6 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీ రాణించగా.. సైబ్రాండ్(80 బంతుల్లో 4 ఫోర్లతో 45), కోలిన్ అకెర్‌మన్(32 బంతుల్లో 6 ఫోర్లతో 35) కొంత మేరకు భారత బౌలర్స్‌ని అడ్డుకున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా తరుఫున మొత్తం 9 మంది బౌలింగ్ చేయడం విశేషం. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మినహా మిగతా అందరూ బౌలింగ్ చేసి అలరించారు. విరాట్ కోహ్లీ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 13 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా.. రోహిత్ శర్మ ఐదు బాల్స్ వేసి 7 పరుగులు ఇచ్చి ఓ వికెట్ సాధించాడు.
భారత ప్రధాన బౌలర్లందర్నీ అలవోకగా ఆడేస్తున్న తేజ నిడమనూరిని ఔట్ చేసేందుకు ఏకంగా రోహిత్ శర్మ రంగంలోకి దిగాడు. తాను వేసిన 48 ఓవర్‌లో ఐదో బంతికి తేజ ఔటయి పెవీలియన్ బాట పట్టాడు. రోహిత్‌కి రిటర్న్ క్యాచ్ ఇచ్చి తేజ వెనుదిరిగాడు.ఇక కోహ్లీ తన రెండో ఓవర్‌లో నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్‌ని అవుట్ చేయగా, అప్పుడు తాను అనుష్కని చూసి ఇచ్చిన రియాక్షన్ కెమెరాలలో రికార్డ్ అయింది. వైట్ బాల్ క్రికెట్ (వన్డే+ టీ20) వరల్డ్ కప్ టోర్నీలో 50+ పరుగులు చేసి, వికెట్ తీయడం విరాట్ కోహ్లీకి ఇది మూడోసారిగా చెప్పాలి.