టీమిండియా ఇద్ద‌రు స్టార్ ప్లేయ‌ర్స్‌కి బీసీసీఐ గ‌ట్టి షాక్.. ప్ర‌మాదంలో ఆ ఇద్ద‌రి క్రికెట‌ర్స్ కెరియ‌ర్

టీమిండియా ఇద్ద‌రు స్టార్ ప్లేయ‌ర్స్‌కి బీసీసీఐ గ‌ట్టి షాక్.. ప్ర‌మాదంలో ఆ ఇద్ద‌రి క్రికెట‌ర్స్ కెరియ‌ర్

త‌మ ఆదేశాల‌ని బేఖాత‌రు చేసార‌ని భావించిన భారత క్రికెట్ బోర్డు యంగ్ క్రికెట‌ర్స్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్​పై వేటు వేసింది. 2023-24 సీజన్​కు సీనియర్ క్రికెటర్ల యానువల్ కాంట్రాక్ట్స్​ను ప్రకటించిన బోర్డ్ ఇందులో నుండి అంద‌రు ఊహించిన‌ట్టే ఇషాన్ కిష‌న్, శ్రేయస్ అయ్య‌ర్‌ల‌ని తొల‌గించింది. సౌతాఫ్రికా టూర్ మ‌ధ్య‌లో నుండి వ‌చ్చిన వీరిద్ద‌రు ఐపీఎల్ కోసం హార్ధిక్ పాండ్యాతో క‌లిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేయ‌డంపై బీసీసీఐ క‌న్నెర్ర జేసింది. రంజీ ట్రోఫీలో జార్ఖండ్​కు ఆడాలని చెప్పినా వారు గాయాన్ని సాకుగా చూపించి ఎన్‌సీఏకి వెళ్లారు. దీంతో బీసీసీఐ మండిపడుతూ వారిద్ద‌రి కాంట్రాక్ట్ తొల‌గించింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో గతేడాది గ్రేడ్ బి కాంట్రాక్ట్ కలిగిన శ్రేయస్ అయ్యర్, గ్రేడ్ సీ కాంట్రాక్ట్ కలిగిన ఇషాన్ కిషన్‌కు ఈ సారి ఏ కాంట్రాక్ట్ దక్కక‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం.

సెంట్రల్ కాంట్రాక్ట్‌ల కోసం ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లను పరిగణలోకి తీసుకోలేదని బీసీసీఐ ప్ర‌క‌టించ‌గా, ఈ నిర్ణ‌యంపై కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే కాంట్రాక్ట్స్ కోల్పోయిన ఇషాన్, అయ్యర్​ తిరిగి టీమిండియాలోకి రావాలంటే చాలా క‌ష్ట‌ప‌డ‌క త‌ప్ప‌దు. వీరిద్ద‌రు ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్​తో పాటు డొమెస్టిక్ టోర్నమెంట్స్​లో పాల్గొనే అవ‌కాశం అయితే ఉంది. కాక‌పోతే తిరిగి భార‌త జ‌ట్టులోకి రావాలంటే ఐపీఎల్‌, రంజీ ట్రోఫీ, దేశ‌వాళీ టోర్నీలలో అద్భుత‌మై ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చాల్సిన అవ‌సరం చాలా ఉంది. ఇషాన్, అయ్యర్ క‌నుక డొమెస్టిక్​ లెవల్లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేస్తేనే వారిని భారత జట్టుకు సెల‌క్ట్ చేసే అవ‌కాశం ఉంది. గ‌తంలో బాగా పెర్ఫార్మ్ చేసి, టీమ్​లో సెటిలయ్యాక కాంట్రాక్ట్స్ దక్కించుకున్నవారి జాబితే చాలా పెద్ద‌గానే ఉంది.

మ‌రి ఇప్పుడు వారి కాంపిటీటివ్ స్పిరిట్ ఎలా ఉంటుంద‌ని ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. వీరికి టీమ్​లో చోటు రాకపోయినా ఓపిగ్గా ఉండాలి త‌ప్ప‌ బోర్డుతో పాటు టీమ్ మేనేజ్​మెంట్ గురించి ఎక్కడైనా వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం పూర్తిగా జ‌ట్టు ద్వారాలు మూసుకుపోవ‌డం ఖాయం. అయితే ఇషాన్ కిషన్‌ కాంట్రాక్ట్ తొలిగించడం వెనుక రోహిత్ శర్మ కుట్ర ఉందని కొంద‌రు ఆరోపించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఇషాన్ కిషన్ సన్నిహితంగా ఉండటాన్ని రోహిత్ శర్మ సహించలేకపోవ‌డం వ‌ల్ల‌నే ఇలా అత‌నికి తీర‌ని అన్యాయం చేశాడ‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. మ‌రి ఈ ఆరోప‌ణ‌ల‌పై రోహిత్ ఏమైన స్పందిస్తాడా అనేది చూడాలి.