రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా బ్రిజ్‌భూషణ్‌ మద్దతుదారు

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ కొత్త అధ్యక్షుడిగా మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ మద్దతుదారు సంజయ్‌ సింగ్‌ ఎన్నికయ్యారు.

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా బ్రిజ్‌భూషణ్‌ మద్దతుదారు

న్యూఢిల్లీ: రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా నూతన అధ్యక్షుడిగా సంజయ్‌సింగ్‌ ఎన్నికయ్యారు. ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు, మహిళా రెజ్లర్లపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో అప్పటి ప్రెసిడెంట్‌ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే.. కొత్తగా ఎన్నికైన సంజయ్‌ సింగ్‌ బ్రిజ్‌ భూషణ్‌ మద్దతుదారుగా చెబుతున్నారు. పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఫెడరేషన్‌ ఎన్నికలు డిసెంబర్‌ 21న నిర్వహించారు.


వాస్తవానికి ఈ ఎన్నిక ఆగస్ట్‌లోనే జరగాల్సి ఉన్నది. వాయిదాల నేపథ్యంలో మొత్తం కమిటీని యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెండ్‌ చేసింది. కొత్త కమిటీ ఎన్నికైన నేపథ్యంలో డబ్ల్యూఎఫ్‌ఐపై ఉన్న సస్పెన్షన్‌ను యూడబ్ల్యూడబ్ల్యూ ఎత్తివేస్తుందని సమాచారం. రెజ్లింగ్‌ కోసం జాతీయ స్థాయిలో శిబిరాలు నిర్వహిస్తామని కొత్త ప్రెసిడెంట్‌ సంజయ్‌సింగ్‌ చెప్పారు. ‘రాజకీయాలు చేసుకోవాలనుకునే రెజ్లర్లు రాజకీయాలు చేసుకోవచ్చు.. రెజ్లింగ్‌ చేసుకోవాలనుకునేవారు రెజ్లింగ్‌ చేసుకోవచ్చు’ అని ఆయన అన్నారు.


సంజయ్‌ వ్యాఖ్యలు బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగిన రెజ్లర్లను ఉద్దేశించి చేసినవేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడెనిమిది నెలలుగా ఇబ్బంది పడిన వేల మంది రెజ్లర్లకు ఇది విజయమని ఆయన అభివర్ణించారు. సంజయ్‌ ప్యానెల్‌కు మాజీ ప్రెసిడెంట్‌ బ్రిజ్‌భూషణ్‌ మద్దతు పలికారు. కామన్‌ వెల్త్ స్వర్ణ పతక విజేత అనితా షెరాన్‌ ప్యానెల్‌ను సంజయ్‌ ప్యానెల్‌ ఓడించింది. బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన దేశ అగ్రశ్రేణి రెజ్లర్లు షెరాన్‌ ప్యానెల్‌కు మద్దతు పలికారు.