అంత‌ర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన మిస్టరీ స్పిన్నర్.. షాక్‌లో క్రికెట్ ప్రియులు

అంత‌ర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన మిస్టరీ స్పిన్నర్.. షాక్‌లో క్రికెట్ ప్రియులు

ఇటీవ‌లి కాలంలో చాలా మంది క్రికెట‌ర్స్ రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తూ అంద‌రికి షాక్ ఇస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌, మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని తెలియ‌జేసిన సునీల్ న‌రైన్.. నాలుగేళ్ల క్రితం వెస్టిండీస్ త‌ర‌పున ఆడారు. వెస్టిండీస్ తరపున చివ‌రిగా 2019లో ఆడ‌గా, 2021 టీ20 వరల్డ్ కప్ కోసం జట్టులోకి రావాల్సి ఉన్నా.. ఫిట్‌నెస్ నిరూపించుకోకపోవడంతో ఎంపిక కాలేదు. అయితే కొద్ది రోజులుగా అవ‌కాశాలు రాని నేప‌థ్యంలో సునీల్ న‌రైన్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయమని చెప్పిన 35 ఏళ్ల నరైన్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పాడు. అయితే దేశ‌వాళీ వ‌న్డే లీగ్‌ల‌కి గుడ్ బై చెప్పిన న‌రైన్ టీ20 లీగ్‌ల‌లో మాత్రం కొన‌సాగుతాన‌ని వెల్ల‌డించాడు.

సునీల్ న‌రైన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో విండీస్ తరఫున 65 వన్డే, 51 టీ20, 6 టెస్టు మ్యాచ్‌‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్ లలో కలిపి మొత్తం 165 వికెట్లు పడగొట్టాడు. 2011లో వెస్టిండీస్ తరఫున‌ వన్డేల్లో అరంగేట్రం చేసిన నరైన్.. అన్నీ ఫార్మాట్లలోనూ మ్యాచ్‌లు ఆడాడు. ఇక 2012 టీ20 ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్‌ జట్టులో నరైన్‌ సభ్యుడిగా ఉన్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం వెస్డిండీస్ దేశవాళీ లీగ్ అయిన సూపర్ 50 కప్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఆడుతున్నాడు. ఈ సీజన్ ముగిసిన తర్వాత వన్డే ఫార్మాట్‌ నుంచి పూర్తిగా తప్పుకోనున్నట్టు తెలియ‌జేశాడు.

ఇక ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున 2012లో డెబ్యూ చేసిన సునీల్ న‌రైన్ ఆ సీజ‌న్‌లో జ‌ట్టు క‌ప్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.ఇక జట్టు ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రపంచవ్యాప్తంగా జరిగే దాదాపు అన్ని క్రికెట్ లీగుల్లోనూ నరైన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఇన్‌స్టా వేదిక‌గా రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తూ సునీల్ న‌రైన్.. నిజానికి నేను బహిరంగంగా మాట్లాడటం చాలా తక్కువ. ఈ విష‌యం మీ అందరికీ తెలుసు. నేను వెస్టిండీస్ తరఫున చివరిసారిగా ఆడి నాలుగేళ్లు కావస్తోంది. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నా. వెస్టిండీస్ జట్టుకు ఆడాలనే నా కలను సాకారం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వెస్టిండీస్, కోచింగ్ స్టాఫ్, ఫ్యాన్స్ అందరికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అని సునీల్ న‌రైన్ త‌న పోస్ట్‌లో రాసుకొచ్చాడు.