బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

బిల్కిస్ బానోపై లైంగిక‌దాడి చేసి, ఆమె బిడ్డను, ఇతర కుటుంబ సభ్యులను హతమార్చిన కేసులో 11 మందిని విడుదల చేసిన గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీం రద్దు చేసింది

బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
  • 11 మంది ఖైదీల క్షమాభిక్ష రద్దు
  • గుజరాత్ ప్రభుత్వ చర్యను
  • త‌ప్పుప‌ట్టిన అత్యున్న‌త ధ‌ర్మాస‌నం
  • రెండు వారాల్లోగా లొంగిపోవాల‌ని ఆదేశం


విధాత : బిల్కిస్ బానోపై లైంగిక‌దాడి చేసి, ఆమె బిడ్డను, ఇతర కుటుంబ సభ్యులను హతమార్చిన కేసులో 11 మందిని విడుదల చేసిన గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు సోమ‌వారం గుజరాత్ ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుబట్టింది. ఆ వ్యక్తులను విడుదల చేసే హ‌క్కు గుజరాత్ ప్రభుత్వానికి లేదని పేర్కొన్న‌ది. గ్యాంగ్ రేప్, మర్డర్ కేసులో దోషులుగా ఉన్న 11 మందికి గుజరాత్ ప్రభుత్వం క్షమాబిక్ష పెట్టి ముందుగానే జైలు నుంచి విడుదల చేయడాన్ని బాధితురాలు బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.


ఈ పిటిష‌న్ల‌పై సుదీర్ఘ విచార‌ణ జ‌రిపిన జ‌స్టిస్ బీవీ నాగ‌ర‌త్న‌, జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్‌తో కూడిన ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం సోమ‌వారం తుది తీర్పు వెలువ‌రించింది. ఈ కేసు విచార‌ణ మ‌హారాష్ట్ర‌లో జ‌రిగినందున దోషుల‌కు శిక్ష‌ను ర‌ద్దుచేసి వారిని విడుద‌ల‌చేసే అధికారం గుజ‌రాత్ ప్ర‌భుత్వానికి లేద‌ని స్ప‌ష్టంచేసింది. ధ‌ర్మాస‌నం దోషులకు గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన క్షమాభిక్షను రద్దుచేసింది. దోషులను తిరిగి జైలుకు పంపాలని ఆదేశించింది. రెండు వారాల్లోగా జైలు అదికారుల ఎదుట 11 మంది లొంగిపోవాల‌ని ఆదేశించింది.


బిల్కిస్ బానో కేసు వివ‌రాలు ఇలా.


1, 2002 మార్చి 3న గోద్రా అనంతర అల్లర్ల సమయంలో గుజ‌రాత్ రాష్ట్రం అహ్మదాబాద్ సమీపంలోని రంధిక్‌పూర్ గ్రామంలో బిల్కిస్ బానో కుటుంబంపై ఒక గుంపు దాడి చేసింది.

2, బిల్కిస్ బానో వయస్సు అప్పుడు 21 సంవత్సరాలు. ఐదు నెలల గర్భిణి అయిన‌ ఆమెపై లైంగిక దాడిచేశారు. ఆమె కుమార్తెతోపాటు మ‌రో ఆరుగురు కుటుంబ‌స‌భ్యుల‌ను దుండ‌గులు చంపేశారు.

3,ఈ కేసు విచారణ తొలుత అహ్మదాబాద్‌లో ప్రారంభమైంది. సాక్షులకు హాని జరగవచ్చని, సీబీఐ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని బిల్కిస్ బానో ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఆగస్టు 2004లో కేసును ముంబైకి బదిలీ చేసింది.

4, బిల్కిస్‌పై అత్యాచారం చేసి, ఆమె కుటుంబ సభ్యులలో ఏడుగురిని హత్య చేసినందుకు 11 మందిని దోషులుగా నిర్ధారించిన‌ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. అదే సమయంలో పోలీసులు, వైద్యులతో సహా ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. తర్వాత ఈ నిర్ణయాన్ని బాంబే హైకోర్టు సమర్థించింది.

5, 2019లో సుప్రీంకోర్టు ఆమెకు ఇల్లు, ఉద్యోగంతోపాటు రూ. 50 లక్షలు పరిహారంగా ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

6,2022లో స్వాతంత్ర్య దినోత్సవం రోజున గుజరాత్ ప్రభుత్వం ఉపశమన విధానం ప్రకారం 11 మంది దోషుల‌ను విడుద‌ల చేసింది. ఇది రాజకీయంగా తీవ్ర‌ వివాదానికి దారితీసింది.

7,రాష్ట్ర ప్రభుత్వం 11 మంది దోషులను అకాలంగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బానో నవంబర్ 2022లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

8,బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు, అనేక ఇతర ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, రేపిస్టులను ముందస్తుగా విడుదల చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశాయి.

9,సుప్రీం కోర్టు 11 మంది దోషుల విడుదలను రద్దు చేస్తూ సోమ‌వారం తీర్పు చెప్పింది. గుజ‌రాత్‌ ప్రభుత్వానికి దోషుల‌ను విడుదల చేసే అధికారం లేద‌ని పేర్కొన్న‌ది.

10, దోషులు 11 మంది రెండు వారాల్లోగా తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు వెల్ల‌డించింది.