స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆ సెంటిమెంట్‌ను తిరగరాస్తారా..? 30 రోజులు వేచి చూడాల్సిందే..?

శాసనసభ స్పీకర్లుగా పని చేసిన ఎమ్మెల్యేలు.. మళ్లీ తిరిగి అసెంబ్లీలో అడుగు పెట్టడం లేదా..? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి మొదలుకుంటే.. తెలంగాణ గత అసెంబ్లీ వరకు ఆ సెంటిమెంట్ పునరావృతం అయిందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. స్పీకర్లుగా పని చేసిన వారు మళ్లీ ఎన్నికల్లో పోటీ పడితే ఓడిపోతారన్న సెంటిమెంట్ బలంగా ఉంది. దీంతో స్పీకర్ పదవి చేపట్టేందుకు ఏ ఎమ్మెల్యే కూడా సాహసం చేయరు. కానీ ఆ సెంటిమెంట్‌ను తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పట్టించుకోలేదు. స్పీకర్‌గా పని చేసి, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. నాటి స్పీకర్ కావాలి ప్రతిభా భారతి నుంచి మొన్నటి కోడెల శివప్రసాద్ రావు, మధుసూదనాచారి దాకా అందరూ ఓటమి పాలయ్యారు. మరి ఈ సెంటిమెంట్‌ను ప్రస్తుత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తిరగరాస్తారా..? అన్న అంశంపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఫలితం కోసం మరో 30 రోజులు వేచి చూడక తప్పదు.
గతాన్ని పరిశీలిస్తే..
1999 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకర్లుగా పని చేసిన వారు ఎవరూ కూడా విజయం సాధించలేదు. 1999లో టీడీపీ గవర్నమెంట్‌లో కావలి ప్రతిభా భారతి స్పీకర్‌గా పని చేసి, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2004 -09 వరకు స్పీకర్‌గా పనిచేసిన కేతిరెడ్డి సురేశ్ రెడ్డి పరాజయం పాలయ్యారు. 2009-10 వరకు స్పీకర్‌గా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోయారు. 2011-14 వరకు స్పీకర్‌గా సేవలందించిన నాదెండ్ల మనోహర్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు.
రాష్ట్ర విభజన తర్వాత పరిశీలిస్తే..
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ శాసనసభ తొలి స్పీకర్‌గా సత్తెనపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కోడెల శివప్రసాద్ రావు బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇటు తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని భూపాలపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన మధుసూదనాచారి తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో అదే నియోజవకర్గం నుంచి మధుసూదనాచారి ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమాణారెడ్డి గెలిచారు. మధుసూదనాచారి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
ప్రస్తుత స్పీకర్ పోచారం విజయం సాధించేనా..?
2018 ముందస్తు ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ.. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని స్పీకర్‌గా ఎంపిక చేసింది. ఇప్పుడు మళ్లీ ఆయన బాన్సువాడ నుంచి బరిలో ఉన్నారు. ఇప్పుడు పోచారం ఆ సెంటిమెంట్‌ను అధిగమించి, అందర్నీ ఆశ్చర్యపరుస్తారా..? లేక ఓడిపోయి.. ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తారా? అనేది డిసెంబర్ 3న తేలనుంది. ఇక బాన్సువాడ నియోజకవర్గం నుంచి 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం 2004 మినహా 1999, 2009, 2011 ఉపఎన్నికతోపాటు 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు.