Instagram Reels | స్కూల్లోనే టీచర్ల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. లైక్ చేయాలని విద్యార్థులకు బెదిరింపులు

Instagram Reels | విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు.. సరదాలకు అలవాటు పడ్డారు. పాఠాలు బోధించడం పక్కనపెట్టి.. తరగతి గదులకే పరిమితమై, సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. అంతేకాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసి సెలబ్రెటీలు అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ రీల్స్‌ను లైక్ చేయాలని, తమ ఖాతాలను సబ్‌స్క్రైబ్ చేయాలని విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నారు. ఈ దారుణాలు ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహ జిల్లాలో వెలుగు చూశాయి.
అమ్రోహ జిల్లాలోని ఓ ప్రైమరీ పాఠశాలలో టీచర్లు అంతా మహిళలే ఉన్నారు. అంబికా గోయల్, పూనమ్ సింగ్, నీతూ కశ్యప్ అనే ముగ్గురు మహిళా టీచర్లు.. స్కూల్లోనే ఇన్ స్టా రీల్స్ చేస్తున్నారు. తరగతులకు హాజరు కాకుండా, ఆ పనిలో బిజీగా ఉంటున్నారు. ఇక రీల్స్ చేసిన అనంతరం ఆ వీడియోలను లైక్ చేయాలని విద్యార్థులను బలవంతం చేస్తున్నారు. తమ అకౌంట్స్‌ను సబ్‌స్క్రైబ్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.
టీచర్ల వేధింపులు తట్టుకోలేని విద్యార్థులు.. వారి ఇన్ స్టా రీల్స్ గురించి తమ పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గంగేశ్వరి ఆర్తి గుప్తాకు ఫిర్యాదు చేశారు. టీచర్ల ఇన్ స్టా రీల్స్‌పై దర్యాప్తు చేస్తున్నామని, విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక తమకు వంట చేసి పెట్టాలని, టీ రెడీ చేయాలని, పాత్రలు కడగాలని తమను టీచర్లు వేధిస్తున్నారని కొంతమంది విద్యార్థులు పేర్కొన్నారు. ఇన్ స్టా రీల్స్ లైక్ చేయకపోతే కొడుతామని టీచర్లు బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.