ICICI Bank | కొత్తగా యూపీఐ స్కామ్‌..! ఖాతాదారులను హెచ్చరించిన ఐసీఐసీఐ బ్యాంక్‌..!

ICICI Bank | కొత్తగా యూపీఐ స్కామ్‌..! ఖాతాదారులను హెచ్చరించిన ఐసీఐసీఐ బ్యాంక్‌..!

ICICI Bank | ఇటీవల కాలంలో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎంత అప్రమత్తంగా ఉంటున్నా ఏదోరకంగా జనాలను బురిడీ కొట్టించిన అకౌంట్లను లూటీ చేస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్‌ చెల్లింపులు భారీగా పెరిగాయి. యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) చెల్లింపులు చేస్తున్నారు. పల్లె నుంచి రాజధాని నగరం వరకు డిజిటల్‌ చెల్లింపులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో సైబర్‌ నేరగాళ్లు కొత్తగా యూపీఐ స్కామ్‌కు తెరలేపారు. స్కామర్స్‌ యూపీఐ యాప్‌లు, సర్వీస్‌ ప్రొవైడర్స్‌ అనుకరించే నకిలీ వెబ్‌సైట్‌, ఈమెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌లను సృష్టిస్తున్నారు.

ఈ నకిలీ ప్లాట్‌ఫారాలతో హానికరమైన లింక్‌లను క్లిక్‌ చేసినా.. యూపీఐ పిన్‌లు, పాస్‌వర్డ్‌, ఓటీపీని నమోదు చేసి సమయంలో వాటి వివరాలు సేకరించి మోసాలకు పాల్పడతున్నారు. ఈ క్రమంలో కొత్త యూపీఐ స్కామ్‌ గురించి ఐసీఐసీఐ బ్యాంక్‌ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, ముఖ్యంగా వివిధ యూపీఐ యాప్‌లను ఉపయోగించే వారికి హెచ్చరికలు చేసింది. సైబర్ నేరగాళ్లు మాల్‌వేర్‌ సహాయంతో యూపీఐ యాప్‌ను లక్ష్యంగా చేసుకొని ఖాతాల నుంచి డబ్బులు లూటీ చేస్తున్నట్లుగా ఖాతాదారులకు పంపిన ఈ-మెయిల్‌లో పేర్కొంది. ఎస్‌ఎంఎస్‌ ఫార్వార్డింగ్‌ యాప్‌లను సృష్టించి.. కస్టమర్‌ బ్యాంక్‌కి లింక్‌ చేసిన మొబైల్‌ నంబర్‌కు రిజిస్ట్రేషన్‌ కోసం యూపీఐ డివైజ్‌ బైండింగ్‌ ఎస్‌ఎంఎస్‌ పంపుతుంది.

మోసగాళ్లు దురుద్దేశపూర్వంగా వాట్సాప్‌ ద్వారా ఏపీకే ఫైల్‌ లింక్‌లను పంపుతారని.. దాంతో మోసగాళ్లు యూపీఐ అప్లికేషన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభించి.. వారు పంపిన లింక్‌పై క్లిక్‌ చేయగానే బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుందని పేర్కొంది. ఈ సందర్భంగా ఖాతాదారులకు పలుసూచనలు చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమానాస్పద యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేయొద్దని తెలిపింది. మొబైల్‌లో ఆపరేటింగ్‌ సిస్టమ్‌, సెక్యూరిటీ ప్యాచ్‌లతో అప్‌డేట్‌ చేయాలని చెప్పింది. గూగుల్‌ పే, ఆపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి మాత్రమే యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని చెప్పింది. విశ్వసనీయ ప్రొవైడర్‌ నుంచి యాంటీవైరస్‌, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది. ఈ మెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్‌లను క్లిక్‌ చేయవద్దని.. తెలియని యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయడం మానాలని సూచించింది.