Gas Pain – Heart Attack | గ్యాస్ నొప్పి.. గుండె నొప్పి.. తేడా గుర్తించండి ఇలా..!
Gas Pain - Heart Attack | చాలా మందికి గ్యాస్ నొప్పికి( Gas Pain ), గుండె నొప్పికి( Heart Attack ) తేడా తెలియదు. కొన్ని సందర్భాల్లో గ్యాస్ నొప్పిని గుండె నొప్పిగా భావించి ఆందోళన చెందుతుంటారు. అదే మాదిరిగా గుండె నొప్పిని కూడా గ్యాస్ నొప్పిగా భావించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఈ నేపథ్యంలో గ్యాస్ నొప్పి, గుండె నొప్పి మధ్య తేడాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
Gas Pain – Heart Attack | జీవనశైలిలో మార్పుల కారణంగా అప్పుడప్పుడు ఛాతీలో నొప్పి సంభవించడం లేదా మంట వంటి సమస్యతో బాధపడి ఉంటాం. ఈ సందర్భంలో అది గ్యాస్ నొప్పా( Gas Pain ).. గుండె నొప్పా( Heart Attack ) అని తేల్చుకోలేకపోతాం. ఈ క్రమంలో తీవ్ర భయాందోళనకు గురవుతాం. అయితే గ్యాస్ నొప్పి, గుండె నొప్పి మధ్య చాలానే తేడాలున్నాయని, వాటిని పసిగడితే ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు( Health Experts ) చెబుతున్నారు. గ్యాస్ నొప్పి గుండె నొప్పి కంటే భిన్నంగా ఉంటుంది. మరి ఆ తేడాలేంటో చూద్దాం.
గ్యాస్ నొప్పిని గుర్తించండి ఇలా..!
గ్యాస్ నొప్పి.. అదేనండి ఎసిడిటీ సమస్య. ఈ సమస్యతో బాధపడే వారు కొన్ని సందర్భాల్లో నరకం అనుభవిస్తారు. గ్యాస్ అనేది పొట్టకు సంబంధించిన సమస్య. పొత్తి కడుపుపై భాగంలో లేదా ఛాతీ దిగువ భాగంలో గ్యాస్ నొప్పి సంభవిస్తుంది. కడుపులో తీవ్రమైన ఉబ్బరం ఉంటుంది. మంట పుడుతుంది. పొత్తి కడుపు భాగమంతా సూదులు గుచ్చినట్లు అనిపిస్తుంది. తేన్పులు, మల విసర్జన ద్వారా గ్యాస్ సమస్య నుంచి విముక్తి పొందొచ్చు.
పూర్తి భిన్నంగా గుండెపోటు..!
గ్యాస్ నొప్పికి భిన్నంగా గుండెపోటు ఉంటుంది. గుండె నొప్పి సంభవిస్తే ఛాతీ మధ్యలో భారంగా అనిపిస్తుంది. ఏదో గుండెను నొక్కినట్లుగా అనిపిస్తుంది. ఈ నొప్పి సాధారణంగా ఎడమ చేయి, దవడ, మెడ లేదా వీపు వైపు వ్యాపిస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, శరీర స్థితిని మార్చడం లేదా తేన్పులు వచ్చినప్పుడు ఇందులో ఉపశమనం ఉండదు.
గ్యాస్ నొప్పి, గుండె నొప్పి మధ్య ముఖ్యమైన తేడా ఇదే..!
గ్యాస్ నొప్పి కొన్ని నిమిషాల నుంచి 1 నుంచి 2 గంటల వరకు ఉంటుంది. గ్యాస్ తేన్పు లేదా మలవిసర్జనతో ఉపశమనం లభిస్తుంది. ఈ నొప్పి అప్పుడప్పుడు వస్తుంది. గుండెపోటు నొప్పి సాధారణంగా 15 నుంచి 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉంటుంది. శరీరానికి విశ్రాంతినిచ్చినా ఎటువంటి మార్పు ఉండదు. నొప్పి నిరంతరం ఉంటుంది. పెరుగుతుంది. ఇది ప్రమాదానికి సంకేతం కావచ్చు.
ఇక గ్యాస్ సమస్యలో కడుపు ఉబ్బరం, గడబిడ, తేన్పులు, కొద్దిగా అసౌకర్యం కలుగుతుంది. సాధారణంగా చెమటలు పట్టవు, మైకం కూడా రాదు. గుండెపోటులో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి, అవి చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మైకం, వికారం, బలహీనత, కొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోవడం వంటివి ఉంటాయి. మహిళలకు పొత్తికడుపు నొప్పి, అసాధారణ అలసట, తలనొప్పి వంటి విభిన్న లక్షణాలు కూడా ఉండవచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram