మృత్యువుతో పోరాడి చివరకు తలొగ్గిన విజయ్ కాంత్.. శోకసంద్రంలో అభిమానులు
తమిళ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్(71) ఇక లేరు. శ్వాస సంబంధిత సమస్య బారిన పడ్డ ఆయన చికిత్స పొందుతూ.. గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు.
చెన్నై : తమిళ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్(71) ఇక లేరు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన మంగళవారం చెన్నైలోని మియోట్ ఆస్పత్రిలో చేరారు. శ్వాస సంబంధిత సమస్య బారిన పడ్డ ఆయన చికిత్స పొందుతూ.. గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. విజయకాంత్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విజయకాంత్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో విజయకాంత్ అంత్యక్రియలు నిర్వహించాలని స్టాలిన్ ఆదేశించారు.
గత నెల 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో చెన్నైలోని మియోట్ దవాఖానలో చేరారు. చికిత్స అనంతరం కోలుకుని డిసెంబర్ 11న ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పుడే ఆయన మరణించారనే వార్తలు నెట్టింట షికారు చేశాయి. అయితే ఆ వదంతులను ఆయన సతీమణి ప్రేమలత కొట్టిపారేశారు. అయితే రెండు వారాలు గడువకముందే ఆయన కొవిడ్ బారినపడటం, మరోసారి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
కుటుంబ నేపథ్యం..
1952, ఆగస్టు 25న విజయకాంత్ తమిళనాడులోని మధురైలో జన్మించారు. విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి. కెప్టెన్ తల్లిదండ్రులు కేఎన్ అళగర్ స్వామి, అండాల్ అజగర్ స్వామి. విజయకాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు విజయ్ ప్రభాకర్, షణ్ముఖ పాండియన్.
సినీ ప్రస్థానం.. ఒకే ఏడాదిలో 18 సినిమాలు విడుదల..
విజయకాంత్ 27 ఏండ్ల వయసులో తెరంగ్రేటం చేసి 2015 వరకు నిర్విరామంగా నటించారు. ఇనిక్కుం ఇలామైతో నటుడిగా విజయకాంత్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. సుమారు 150కి పైగా చిత్రాల్లో నటించి, మెప్పించారు. అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. దాదాపు 20కి పైగా పోలీసు కథల్లోనే ఆయన నటించి మెప్పించారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్.. ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరతు ఇడి ముళక్కం, సత్తం ఒరు ఇరుత్తరై సినిమాలతో విజయాలు అందుకున్నారు. 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్‌గా పిలుస్తున్నారు. ఇక విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడంతో ఇక్కడి వారికీ ఆయన సుపరిచితులే. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదల కావడం విశేషం. విజయకాంత్ దర్శకత్వం వహించి, నటించిన చిత్రం విరుధగిరి. వల్లారసు, నరసింహ, సగప్తం చిత్రాలను నిర్మించారు. విజయకాంత్ నటించిన ఆఖరి చిత్రం సగప్తం(2015). తమిళ నటుడు విజయకాంత్ తన కెరీర్‌లో తమిళ చిత్రాలే తప్ప ఇతర భాషల్లో నటించలేదు.
కెప్టెన్ పేరు ఎలా వచ్చిందంటే..?
కెప్టెన్ ప్రభాకరన్ అనే చిత్రం విజయకాంత్‌కు 100వ సినిమా. ఈ సినిమా 1992లో విడుదల కాగా, బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కెప్టెన్ ప్రభాకరన్ విజయం తర్వాత ఆయనను కెప్టెన్‌గా అభిమానులు పిలుచుకుంటున్నారు.
కెప్టెన్ ప్రేమ వివాహం..
నల్లకళ్లజోడుతో ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే విజయకాంత్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అదేంటంటే ఆయనది ప్రేమ వివాహం. 1990, జనవరి 31న ప్రేమలతను ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో 1990లో ప్రేమలతను వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 31న తన 33వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు.
కెప్టెన్ రాజకీయ ప్రస్థానం.. 2011లో ప్రతిపక్ష హోదా..
తమిళ నటుడు విజయకాంత్ ఓ వైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మధురైలో 2005, సెప్టెంబర్ 14వ తేదీన దేశీయ మురుపొక్కు ద్రవిడ ఖజగం(డీఎండీకే) అనే పార్టీని స్థాపించారు. 2006లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే అన్ని స్థానాల్లో పోటీ చేసింది. కానీ విజయకాంత్ ఒక్కరే నాటి ఎన్నికల్లో గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2006 ఎన్నికల్లో విరుదచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మళ్లీ 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో రిషివండియం నుంచి గెలుపొందారు. 2011-16 మధ్య తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేశారు. 41 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. 29 స్థానాల్లో గెలుపొంది, ప్రతిపక్ష హోదాను పొందారు. నాటి ఎన్నికల్లో డీఎంకేను ఓడగొట్టేందుకు డీఎండీకే, అన్నాడీఎంకే కలిసి తీవ్రంగా శ్రమించాయి. 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డీఎండీకే, బీజేపీతో జతకట్టింది. ఆ సమయంలో డీఎండీకేకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేస్తూ స్పీకర్‌కు లేఖలు అందజేశారు. దాంతో డీఎండీకే ప్రతిపక్ష హోదాను కోల్పోయింది.
ఎన్నో అవార్డులు..
విజయకాంత్ నటనకు గానూ ఎన్నో అవార్డులు వరించాయి. 1994లో ‘తమిళనాడు స్టేట్ ఫిల్మ్ ఆనరరీ అవార్డు’ (ఎంజీఆర్ అవార్డు), 2001లో ‘కళైమామణి అవార్డు’ (తమిళనాడు ప్రభుత్వం) అందుకున్నారు. 2001లో ‘బెస్ట్ ఇండియన్ సిటిజెన్ అవార్డు’, 2009లో ‘టాప్ 10 లెజెండ్స్ ఆఫ్ తమిళ్ సినిమా అవార్డు’, 2011లో ‘ఆనరరీ డాక్టరేట్’ (ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చర్చ్ మేనేజ్‌మెంట్) వంటి అవార్డులు పొందారు. అదేవిధంగా 1986లో ‘అమ్మన్ కోయిల్ కిజకలే’ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్, సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డులు వరించాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram