Vladimir Putin | రష్యా అధ్యక్ష పీఠంపై మళ్లీ పుతినే.. ఎన్నికల్లో ఘన విజయం

  • Publish Date - March 18, 2024 / 03:00 AM IST

Vladimir Putin : రష్యా అధ్యక్ష పీఠం మళ్లీ పుతిన్‌కే దక్కింది. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి ఘన విజయం సాధించారు. ప్రాథమిక ఫలితాల ప్రకారం పుతిన్‌కు రికార్డు స్థాయిలో 88 శాతం ఓట్లు లభించాయి. మార్చి 15న మొదలైన అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ మూడు రోజులపాటు కొనసాగింది. మార్చి 17న అంటే ఆదివారం పోలింగ్‌ ముగిసింది. ఫలితాల్లో పుతిన్‌నే విజయం వరించింది. ప్రతిపక్ష నేత నావల్నీ అనుమానాస్పద మృతితో పుతిన్‌కు ఎదురే లేకుండా పోయింది.

ఈ ఎన్నికల్లో పుతిన్‌ సహా నలుగురు అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. ఆఖరికి పుతిన్‌ గెలుపొందారు. 1999 నుంచి రష్యా అధ్యక్షుడిగా ఉన్న పుతిన్‌ తాజా విజయంతో మరో ఆరేళ్లపాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. కాగా, చివరిరోజు పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని, పుతిన్‌ విధానాలను వ్యతిరేకిస్తున్నవారు పోలింగ్‌ కేంద్రాలకు రావాలని నావల్నీ మద్దతుదారులు ఇచ్చిన పిలుపుతోనే చివరిరోజు ఓటర్లు భారీగా తరలివచ్చినట్లు అక్కడి రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

జనం భారీగా తరలిరావడంతో చివరి రోజు పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఘర్షణలు జరిగాయి. కొన్నిచోట్ల బ్యాలెట్‌ పెట్టెల్లో ఇంకు పోశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు అరెస్టయ్యారు. బలమైన ప్రత్యర్థులు, పుతిన్‌ను గట్టిగా విమర్శించే వారెవరూ లేకుండానే ఎన్నికలు కొనసాగాయి. పలు యూరప్‌ దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న రష్యా దౌత్య కార్యాలయాల్లో పెద్దఎత్తున రష్యా ఓ‍టర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు ఎన్నికల వేళ ఉక్రెయిన్‌ నుంచి రష్యాపైకి డ్రోన్లు దూసుకొచ్చాయి. ఎన్నికలను అడ్డుకునేందుకు ఉక్రెయిన్‌ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపణలు చేసింది. 

Latest News