• Telugu News
  • /Breaking

Bangalore Water Crisis | బెంగళూరులో నీటి కటకట..! హెచ్చరికలు జారీ చేసిన జలమండలి..!

Reported by: Vineela | Breaking | Mar 13, 2024, 11:34 am IST
Read Time: 6 mins
Bangalore Water Crisis | బెంగళూరులో నీటి కటకట..! హెచ్చరికలు జారీ చేసిన జలమండలి..!

Bangalore Water Crisis | గార్డెన్‌ సిటీ పేరొందిన బెంగళూరు నగరం నీటి కోసం అల్లాడుతున్నది. మండుటెండలకు ముందు నీటి ఎద్దడి తీవ్రమైంది. తాగునీటి ఎద్దడి యావత్‌ భారతదేశాన్నే ఆందోళనకు గురి చేస్తున్నది. నీటి సమస్య కారణంగా కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారింది. తాగేందుకు నీళ్లు అందుబాటులో లేక పాఠశాలలు మూతపడ్డాయి. నీటి సమస్య నేపథ్యంలో బెంగళూరు వాటర్‌ సప్లయ్‌, సీవరేజ్‌ బోర్డ్‌ (BWSSB) స్విమ్మింగ్ పూల్స్‌లో తాగునీటి వినియోగాన్ని నిషేధించింది. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే రూ.5వేల జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. కర్ణాటక వాటర్‌ సప్లయ్‌, సీవరేజ్‌ బోర్డ్‌ కార్ వాషింగ్, గార్డెనింగ్, బిల్డింగ్, వాటర్ ఫౌంటైన్‌లు, రోడ్ల నిర్మాణం, నిర్వహణ కోసం తాగునీటిని ఉపయోగించడాన్ని నిషేధిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బెంగళూరును కరువు వెంటాడుతున్నది. బెంగళూరులో నీటి ఎద్దడి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మాట్లాడుతూ గత మూడు నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రంలో ఇంతటి తీవ్రమైన కరువును ఎన్నడూ చూడలేదన్నారు. ఇంతకుముందు కూడా కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ, ఇంత పెద్ద సంఖ్యలో తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా మనం ఎప్పుడూ ప్రకటించలేదని చెప్పడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో డిప్యూటీ సీఎం వ్యాఖ్యలే చెబుతున్నాయి.

నీటి సంక్షోభం..

బెంగళూరు నగరం తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు జలమండలి నిరంతరం కృషి చేస్తోంది. అనధికార బోర్‌వెల్‌లు తవ్వే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ వాహనాలను శుభ్రం చేయడంతో సహా అనవసరమైన అవసరాల కోసం తాగునీటి వినియోగాన్ని నిషేధించిన తర్వాత ఆదేశాలు జారీ చేసింది. బోర్డు ఉత్తర్వుల్లో మార్చి 15 నుంచి ప్రజలు తమ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తులను సమర్పించాలని.. అనుమంతి పొందిన తర్వాత బోర్‌వెల్‌ తవ్వుకునేందుకు అనుమతి తీసుకోవాలని చెప్పింది. సంబంధిత అధికారుల ద్వారా స్థల పరిశీలన చేసిన అనంతరం అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

అవసరం ఎంత ? సరఫరా అయ్యేదెంత..

నగరంలో నిత్యం 2,600 నుంచి 2,800 మిలియన్‌ లీటర్స్‌ నీరు అవసరమవుతుంది. తాజాగా దాదాపుగా 1,300 ఎంఎల్‌డీ నీరు మాత్రమే సరఫరా అవుతున్నది. అవసరం ఉన్నదాంట్లో కేవలం సగం సైతం సరఫరా కాని పరిస్థితి నెలకొన్నది. మార్చి మొదటి, రెండోవార్లాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఏప్రిల్‌, మేలో ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయని వాపోతున్నారు. జలమండలి సరిపడా నీళ్లు సరఫరా చేయకపోవడంతో చాలామంది ప్రైవేటు ట్యాంకర్స్‌ను ఆశ్రయిస్తున్నది. డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో వారంతా ధరలను భారీగా పెంచేశారు.

నీటి బొట్టును కాపాడుకుంటూ..

నీటి కరువు నేపథ్యంలో జనం ప్రతి చుక్క నీటిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఎండాకాలం అయినా స్నానాలు చేయడం లేదు. నెలలో కేవలం ఐదుసార్లు మాత్రమే చేస్తున్నామని వాపోతున్నారు. వంట చేయడం, గిన్నెలు కడగడానికి నీరు అవసరం ఉండడంతో బయట నుంచే భోజనం ఆర్డర్‌ పెట్టుకుంటున్నట్లు వాపోతున్నారు. ముఖ్యంగా కమ్యూనిటీల్లో నివాసం ఉంటున్న పరిస్థితి దయనీంగా మారింది. రోజుకు నాలుగు నుంచి ఐదు ట్యాంకుల నీరు అవసరమవుతుండగా రెండు ట్యాంకులు మాత్రమే సరఫరా అవుతున్నాయి. మూడు నెలలుగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.