Kidney Stones | కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారా..? ఈ ఆహార ప‌దార్థాల‌కు దూరంగా ఉండాల్సిందే..!

Kidney Stones | కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారా..? ఈ ఆహార ప‌దార్థాల‌కు దూరంగా ఉండాల్సిందే..!

Kidney Stones | మాన‌వ శ‌రీరంలోని ప్ర‌తి అవ‌య‌వాన్ని జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి. అప్పుడే ప‌దికాలాల పాటు హాయిగా బ‌తికే అవకాశం ఉంటుంది. ర‌క్తంలోని వ్య‌ర్థాల‌ను, ఇత‌ర చెడు ప‌దార్థాల‌ను ఫిల్ట‌ర్ చేయ‌డంలో మూత్ర‌పిండాలు కీల‌క‌పాత్ర పోషిస్తాయి. మూత్ర‌పిండాలు స‌రిగా ప‌ని చేయ‌క‌పోతే వ్య‌ర్థాలు పేరుకుపోయి, మ‌నిషి అనారోగ్యానికి గురై చ‌నిపోయే ప్ర‌మాదం ఉంది. అందుకే మూత్ర‌పిండాల‌ను చాలా జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ కొంద‌రు నిర్ల‌క్ష్యం వ‌హించ‌డంతో మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డుతాయి. త‌ద్వారా తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు. కాబ‌ట్టి మూత్ర‌పిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. జీవ‌న‌శైలిలో మార్పులు చేసుకోవాలి. స‌రైన ఆహారం తీసుకుంటే కిడ్నీ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టొచ్చ‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

  • ఉప్పు మితంగా తీసుకోవాలి. అధికంగా ఉప్పు తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు పెరుగుతుంది. కిడ్నీల‌ను ఒత్తిడికి గురి చేస్తుంది. స్నాక్స్, క్యాన్డ్ సూప్, ఫాస్ట్ ఫుడ్‌తో స‌హా అధిక సోడియం క‌లిగిన ఆహార ప‌దార్థాల‌కు దూరంగా ఉంటే మంచిది.
  • శీత‌ల పానీయాల‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. ఈ పానీయాల్లో అధిక మొత్తంలో ఫాస్పేట్ ఉంటుంది. ఇవి కిడ్నీల్లో రాళ్లు ఏర్ప‌డేలా చేస్తాయి. అది మాత్రమే కాదు వీటిలో అధిక స్థాయిలో ఫ్రక్టోజ్ ఉండటం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళని మరింత పెంచుతుంది. అందుకే ఈ ఆహారాలు మూత్రపిండాలను మ‌రింత దెబ్బ‌తీస్తాయి.
  • పాల ఉత్పత్తుల్లో భాస్వరం అధికంగా ఉంటుంది. ఈ భాస్వ‌రం కిడ్నీ వ్యాధి ఉన్నవారికి ప్ర‌మాద‌క‌రం. కాబ‌ట్టి బాదం పాలు వంటి తక్కువ ఫాస్పరస్ ఉండే డైరీ ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలి.
  • చాలా మంది రుచి కోసం త‌రుచుగా ప‌చ్చ‌ళ్లు తింటారు. చాలా కాలం నిల్వ ఉండే ప‌చ్చ‌ళ్ల‌ల్లో సోడియం కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబ‌ట్టి కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు ప‌చ్చ‌ళ్ల‌కు దూరంగా ఉంటే మంచిది.
  • ప్రాసెస్ చేసిన మాంసానికి దూరంగా ఉండాలి. రెడ్ మీట్, సాసేజ్, బేకన్ వంటి మాంసాల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో వ్యర్థ పదార్థాల పెరుగుదలకి దారి తీస్తాయి. మూత్రపిండాల‌ సమస్యలతో బాధపడుతున్న వారు చేప‌ల‌ను తిన‌డం మంచిది.
  • కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో బాధప‌డేవారు అర‌టి పండుకు దూరంగా ఉండాలి. పొటాషియం పుష్క‌లంగా ఉంటుంది కాబ‌ట్టి.. ఈ పండును నివారించ‌డం మంచిది. అర‌టికి బ‌దులుగా పైనాపిల్ తిన‌డం మంచిది. పైనాపిల్‌లో విట‌మిన్ ఏ, ఫైబ‌ర్, భాస్వ‌రం, సోడియం, పొటాషియం త‌క్కువ మోతాదులో ఉంటాయి. అవ‌స‌ర‌మైన ఖ‌నిజాల‌ను కూడా అందిస్తుంది.
  • బంగాళాదుంప‌కు దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే బంగాళాదుంప‌లో కూడా పొటాషియం అధికంగా ఉంటుంది. ఒక‌వేళ బంగాళాదుంప తీసుకోవాల‌నుకుంటే.. రాత్రిపూట నీటిలో నాన‌బెట్టి, ఉద‌యం తిన‌డం మంచిది. ఇలా చేయ‌డంతో పొటాషియం కంటెంట్ త‌గ్గిపోతుంది. వీలైనంత వ‌ర‌కు బంగాళాదుంప‌కు దూరంగా ఉంటేనే మంచిది.