Kaleshwaram Commission: బిగ్ షాక్..కేసీఆర్, హరీష్, ఈటలకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు

Kaleshwaram Commission: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోని అవతవకలపై విచారణ కొనసాగిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు టి.హరీష్ రావు, ఈటల రాజేందర్ లకు బిగ్ షాక్ ఇచ్చింది. విచారణకు హాజరుకావాలంటూ వారికి నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరయ్యేందుకు వారికి 15రోజుల గడువు ఇచ్చింది. జూన్ 5 వ తేదీన కేసీఆర్, 6న హరీష్ రావు, 9న ఈటల రాజేందర్ విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీస్ లలో స్పష్టం చేసింది. దీంతో వారు విచారణకు హాజరవుతారా లేక కోర్టును ఆశ్రయిస్తారా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై వారిని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించనుంది. గతంలో విద్యుత్తు కమిషన్ నుంచి నోటీసులు అందుకున్న కేసీఆర్ విద్యుత్తు కమిషన్ ముందు హాజరు కాకుండా గడువు కోరారు. అంతలోపునే విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోర్టుకు వెళ్లారు.ఆ తర్వాతా లేఖ ద్వారా కేసీఆర్ కమిషన్ కు తన వివరణ పంపించారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ కు కూడా లేఖ ఇస్తరా.. లేక కేసీఆర్ వ్యక్తిగతంగా హాజరవుతారా ? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
కాళేశ్వరం కమిషన్ పొడిగించిన విచారణ గడువు ఈ నెలాఖరుతో ముగిసిపోనున్న నేపథ్యంలో కమిషన్ ఇప్పటికే సిద్ధం చేసుకున్న 400పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందించనుందని అంతా భావించారు. డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావు, ఈటలను విచారించకుండానే..అటు ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ కమిషన్ల నివేదికల ఆధారంగా పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తారన్న వార్తలు వెలువడ్డాయి. అయితే ప్రభుత్వం అనూహ్యంగా కాళేశ్వరం కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ దఫా విచారణలో కాళేశ్వం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా ఉన్న అప్పటీ సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ లను విచారణకు పిలుస్తారా లేదా అన్న సందేహాలు రేకెత్తాయి. అయితే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వారిని విచారణకు పిలుస్తు నోటీస్ లు జారీ చేయడం సంచలనంగా మారింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువున10సార్లు పొడిగించారు. 14నెలల నుంచి కొనసాగుతున్న విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు ఇంజనీర్లను, అధికారులను, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులను కూడా ప్రశ్నించింది. 200 మంది అధికారులను, 25 మంది మాజీ ఐఏఎస్ లతోపాటు ప్రస్తుత ఐఏఎస్ లను కమిషన్ విచారించింది. విచారణ సందర్భంగా అధికారులు, ఇంజనీర్లు పలుమార్లు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల పేర్లను ప్రస్తావించారు.
డీపీఆర్ మేరకు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణాలు జరుగలేదని ఇప్పటికే కమిషన్ నిర్ధారణకు వచ్చింది. బ్యారేజీలో నీరు నిల్వ చేయాలని కేసీఆర్ ఆదేశించారని ఈఎన్సీలు, ఇంజనీర్లు కమిషన్ ముందు వెల్లడించారు. బ్యారేజీ నిర్మాణంలో కేసీఆర్, హరీష్ రావులు చెప్పిన మౌఖిక ఆదేశాలను సైతం కమిషన్ కు వివరించారు. అఫిడవిట్ లలోనూ పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్ నుంచి కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులపై బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. కేసీఆర్ ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉండగా..హరీష్ రావు తన నియోజకవర్గం సిద్దిపేట పర్యటనలో ఉన్నారు. వారిద్ధరు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై ఎలా స్పందిస్తారన్నదానిపై పార్టీ వర్గాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి.