Adani Airport Investment | లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులతో మరో 11 ఎయిర్ పోర్టులపై అదానీ కన్ను! తిరుపతి కూడా!

ఇప్పటికే నవీముంబై సహా ఏడు ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తున్న అదానీ గ్రూప్‌.. త్వరలో కేంద్రం ప్రైవేటీకరించనున్న 11 ఎయిర్‌పోర్టులపై కన్నేసింది. వీటిని దక్కించుకునే ప్రయత్నాల్లో ఉంది.

  • By: TAAZ |    business |    Published on : Dec 21, 2025 7:38 PM IST
Adani Airport Investment | లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులతో మరో 11 ఎయిర్ పోర్టులపై అదానీ కన్ను! తిరుపతి కూడా!

Adani Airport Investment | వచ్చే ఐదు సంవత్సరాలలో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు ఎయిర్ పోర్టులపై వెచ్చించాలని అదానీ గ్రూపు నిర్ణయించింది. ప్రస్తుతం నవీ ముంబైతో పాటు ఏడు ఎయిర్ పోర్టులలో అదానీ గ్రూపు కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. ఈ ఏడాది ప్రారంభంలో దేశవ్యాప్తంగా 11 ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరించనున్నట్టు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో వారాణసీతోపాటు అమృత్‌సర్‌, తిరుపతి వంటి నగరాలు కూడా ఉన్నాయి. వారాణసీ, తిరుపతి.. ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన నగరాలు కాగా అమృత్‌సర్‌లో స్వర్ణ దేవాలయం ప్రపంచ ప్రసిద్ధి పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది.

దేశంలో ఆదాయం అంతగా లేని ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడో విడతలో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి పలు నగరాలను ఎంపిక చేసింది. వారాణసీ, ఖుషీ నగర్, గయ, భువనేశ్వర్, అమృత్‌సర్‌, హుబ్లీ, కాంగ్రా, రాయ్‌పూర్‌, తిరుచారపల్లి, ఔరంగాబాద్‌తోపాటు తిరుపతి కూడా ఉంది. దేశంలో ప్రయాణిస్తున్న డొమెస్టిక్ ప్యాసెంజర్లలో 10 శాతం, అంతర్జాతీయ ప్రయాణీకుల రాకపోకల్లో 4 శాతం మాత్రమే ఈ ఎయిర్ పోర్టులలో ఉన్నది. ప్రైవేటీకరణ ద్వారా రూ.47వేల కోట్ల పెట్టుబడి సమకూరుతుందని అంచనా. ఆదాయం పెంపొందించడంతో పాటు ప్రయాణీకుల కోసం మౌలిక సదుపాయాలను పెంచాలని నిర్ణయించారు.

అదానీ గ్రూపు 2019లో విమానాశ్రయ వ్యాపారంలోకి ప్రవేశించి, రెండేళ్ల తరువాత నవీ ముంబై ఏయిర్ పోర్టును జీవీకే గ్రూపు నుంచి టేకోవర్ చేసింది. అహ్మదాబాద్, లక్నో, గౌహతీ, తిరువనంతపురం, జైపూర్, మంగళూరు ఎయిర్ పోర్టులను కూడా అదానీ గ్రూప్‌ నిర్వహిస్తున్నది. నవీ ముంబై ఎయిర్ పోర్టులో 74 శాతం వాటాలు ఉండగా, డిసెంబర్ 25వ తేదీ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. వార్షికంగా 20 మిలియన్ల ప్రయాణీకులు ప్రయాణించేందుకు వీలుగా రూ.19,650 కోట్లతో నిర్మాణం చేశారు. 90 మిలియన్ల ప్రయాణీకుల అవసరాలు తీర్చే విధంగా దీన్ని భవిష్యత్తులో తీర్చిదిద్దనున్నారు. అదానీ గ్రూపు తో పాటు జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ కూడా మూడో విడత ప్రైవేటీకరణలో పోటీపడనున్నది. మొదటి విడత ప్రైవేటీకరణలో ఢిల్లీ ఎయిర్ పోర్టును జీఎంఆర్ దక్కించుకున్న విషయం తెలిసిందే.

Read Also |

Gopanpally Land Scam | గోపనపల్లి బంగారు బాతు.. భూసేకరణా? భూకుంభకోణమా?
Salman Khan | సల్మాన్ ఖాన్‌తో అరంగేట్రం.. అదృష్టం కలిసిరాని హీరోయిన్లు వీరేనా?
Tollywood Stars | మ‌రి కొద్ది రోజుల‌లో ముగియ‌నున్న 2025 .. ఈ ఏడాది తల్లిదండ్రులైన టాలీవుడ్ స్టార్స్ వీరే..