Discoms Privatization | రైతుల మెడపై మోదీ ప్రైవేటు కత్తి! డిస్కంలకు బెయిల్ ఔట్ ఎర?

విద్యుత్తు సంస్థలకు సహాయం పేరుతో కేంద్ర ప్రభుత్వం భారీ కుట్రకు తెర తీసిందా? తెలంగాణ విద్యుత్తు సంస్థలను ప్రయివేటు సంస్థలుగా మారేలా ఒత్తిడి చేస్తున్నదా? విద్యుత్తు రంగ నిపుణులేమంటున్నారు?

Discoms Privatization | రైతుల మెడపై మోదీ ప్రైవేటు కత్తి! డిస్కంలకు బెయిల్ ఔట్ ఎర?

హైదరాబాద్, విధాత ప్రతినిధి:

Discoms Privatization | రాష్ట్రంలో రైతాంగానికి, నిరుపేదలకు అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకాలు భవిష్యత్తులో కనుమరుగు అయ్యే ప్రమాదం ముంచుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ అప్పుల్లో కూరుకుపోయిన విద్యుత్ పంపిణీ (డిస్కం) సంస్థలను దారిలోకి తెచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బెయిల్ ఔట్ ఎర వేస్తున్నదని విశ్వసనీయంగా తెలుస్తున్నది. ‘మీకున్న అప్పులను మేము తీర్చుతాము.. మేము చెప్పినట్లు మీరు వినాలి’ అంటూ షరతులు పెట్టనున్నదని అంటున్నరు. బెయిల్ ఔట్ కావాలంటే పంపిణీ సంస్థలను ప్రైవేటు పరం చేయాలి. ఒక వేళ ప్రభుత్వమే నిర్వహిస్తే ముంబైలోని స్టాక్ ఎక్చేంజీలో నమోదు కావాల్సి ఉంటుంది. బెయిల్ ఔట్ లబ్ధి కోసం ఈ రెండింటిలో ఏదో ఒక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకోవాల్సి ఉంటుంది. దీంతో పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం రైతుల మెడపై కత్తి పెట్టే చర్యలకు ఉపక్రమించనున్నట్లు స్పష్టమవుతున్నదని విద్యుత్తు రంగ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే రెండు లేదా మూడేళ్లలో ఉచిత విద్యుత్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడాల్సిన పరిస్థితి తప్పకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2017లోనే మోటర్లకు మీటర్లపై ఒప్పందం

వ్యవసాయ బావులు, బోరు బావుల వద్ద కరెంటు మోటర్లకు మీటర్లు బిగించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో ఒత్తిడి చేయగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వెనకా ముందు ఆలోచించింది. రైతులకు మద్దతుగా ఉంటామంటూ, మోటర్లకు మీటర్లను బిగించేది లేదంటూ అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. తాము రైతుల పక్షానే ఉంటామని, కేంద్ర ఆదేశాలకు లొంగేది లేదని ఆయన పలు వేదికలపై పునరుద్ఘాటించారు. దీనిపై బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. అందరూ కేసీఆర్ చేసిన ప్రకటన నిజమేనని అనుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మోటర్లకు మీటర్ల గుట్టు రట్టు అయ్యింది. గతేడాది జూలై నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మోటర్లకు మీటర్ల బిగింపు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తవాలు వెల్లడించారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం బేషరతుగా ఒప్పుకొన్నదని ఆయన తెలిపారు. 2017 లోనే కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నదని చెబుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మూలంగా విద్యుత్ సంస్థలు ప్రమాదంలో పడ్డాయని ఆయన సభకు వివరించారు. 2017లో చేసిన ఒప్పందాలను అమలు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగుతుందని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మోటర్లకు మీటర్లు పెట్టవద్దని తాము కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేశామని ఎదురు దాడికి దిగారు. హరీశ్ వ్యాఖ్యలకు రేవంత్ ఆధారాలతో సహా బదులిచ్చారు. 2017 జనవరి 4వ తేదీన కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని చదివి విన్పించారు. ఈ ఒప్పందాలపై అప్పటి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, రెండు విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం) సీఎండీలు సంతకాలు కూడా చేశారన్నారు. ఈ విషయంలో సభను తప్పుదోవ పట్టిస్తున్న హరీశ్‌కు ఒప్పంద పత్రాలు పంపిస్తున్నానని, ఆయన చెప్పిన అబద్దాలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను రేవంత్ రెడ్డి కోరారు.

అప్పుల ఊబిలో విద్యుత్ సంస్థలు

రాష్ట్రంలో రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ కేంద్రంగా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఎస్పీడీసీఎల్), రెండోది వరంగల్ కేంద్రంగా నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీ ఎన్పీడీసీఎల్). ఇవి కాకుండా తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీ జెన్కో), తెలంగాణ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ లిమిటెట్ (టీజీ ట్రాన్స్ కో) ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి అనగా 2014 లో నాలుగు సంస్థల అప్పులు రూ.22,423 కోట్లు కాగా, 2025 జూన్ నాటికి రూ.1,00,180 కోట్లకు పెరిగింది. ఈ అప్పులపై రాష్ట్రప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.9 వేల కోట్లు వడ్డీల రూపేణా చెల్లింపులు చేస్తున్నది. 2014 నుంచి 2023 మధ్య రూ.81వేల కోట్లు కాగా ఏడాదిన్నర వ్యవధిలో మరో రూ.20వేల కోట్లు పెరిగింది. ఇందులో రెండు డిస్కంల అప్పులే రూ.60 వేల కోట్ల వరకు ఉన్నాయి. ఈ లక్ష కోట్లలో విద్యుత్ కొనుగోలు కోసం తీసుకున్న రుణాలు రూ.31,785 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్‌ను ఇంటి యజమానులకు అమలు చేస్తున్నారు. ఫలితంగా విద్యుత్ పంపిణీ సంస్థలపై అదనపు భారం పెరిగింది. రాయితీ పద్దు కింద ప్రతి నెలా ప్రభుత్వం రూ.983 కోట్లను రెండు పంపిణీ సంస్థలకు బదలాయిస్తున్నది. అయినప్పటికీ ఈ మొత్తం సరిపోవడం లేదని, పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. ఈ గండం నుంచి బయటపడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొత్త విద్యుత్ పంపిణీ సంస్థను ఏర్పాటు చేయాలని ఇటీవలే విద్యుత్ శాఖను ఆదేశించారు. ఈ లక్ష కోట్ల అప్పులను కొత్త సంస్థకు బదలాయించి, నాలుగు సంస్థలను అప్పుల గండం నుంచి గట్టెక్కించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. మళ్ళీ కొత్తగా నాలుగు సంస్థల నుంచి అప్పులు తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.

ఇప్పుడు బెయిల్ ఔట్ కత్తి!

తెలంగాణలో బోరు బావులు, బావులకు సుమారు 29 లక్షల విద్యుత్ మోటర్లు పనిచేస్తున్నాయి. ఒక మోటర్ కింద సాగు కనీసం రెండు ఎకరాలు మొదలు గరిష్ఠంగా ఇరవై ఎకరాల వరకు ఉన్నాయి. తెలంగాణలో సాగునీటి కాలువలు లేకపోవడంతో రైతాంగం బోరు బావులు, బావుల ద్వారా వచ్చే నీటితో వ్యవసాయం చేసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చినప్పటికీ విద్యుత్‌ మోటార్ల కనెక్షన్ల డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. రైతులకు ఉచిత విద్యుత్ పథకంతో పాటు బీఆర్ఎస్ హయాంలో రజకులు, నాయీ బ్రాహ్మణులకు కూడా రాయితీలు అమలు చేశారు. ఈ రాయితీ మొత్తాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు విద్యుత్ సంస్థలకు బదలాయించకపోవడం మూలంగా అప్పులు పేరుకుపోయాయి. ఫలితంగా విద్యుత్ సంస్థలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకోక తప్పలేదు. ప్రభుత్వం నుంచి రాయితీ సొమ్ము రాకపోవడం, తీసుకున్న అప్పులతో విద్యుత్ సంస్థలు బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.80 వేల కోట్ల రుణభారంలో కూరుకుపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరో రూ.20 వేల కోట్ల భారం పెరగడంతో మొత్తం రూ.1 లక్ష కోట్లకు చేరుకుని గుదిబండగా మారాయి.

బెయిల్‌ ఔట్‌ పొందాలంటే..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రారంభించనున్న బెయిల్ ఔట్ పథకం కింద సాయం పొందాలంటే ఏదో ఒక షరతును అంగీకరించక తప్పదు. ఆ షరతును అంగీకరిస్తే విద్యుత్ సంస్థలను ప్రైవేటు కంపెనీల మాదిరి నడపాల్సి ఉంటుంది. లాభాపేక్ష తప్ప సేవ అనేది మరిచిపోవాల్సి ఉంటుందని విద్యుత్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. బెయిల్ ఔట్ వద్దనుకుంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అదనంగా రుణాలు తెచ్చుకునే అవకాశం ఉండదంటున్నారు. ఇబ్బడి ముబ్బడిగా తీసుకునేందుకు నిబంధనలు అంగీకరించవనే వాదన ఉంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులను తీర్చలేక నానా తంటాలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ ఔట్ విషయంలో ఏ అడుగు వేస్తుందో చూడాలి.