Budget session | మరికాసేపట్లో పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే.. ఈ ఆర్థిక సర్వేలో ఏముంటుంంది..?

Budget session | 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి (Finacial Minister) నిర్మలాసీతారామన్ (Niramala Sitaraman) రేపు (మంగళవారం) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక్కరోజు ముందు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే (Economic Survey 2024) ను ప్రవేశపెడుతారు.

  • By: Thyagi |    business |    Published on : Jul 22, 2024 11:20 AM IST
Budget session | మరికాసేపట్లో పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే.. ఈ ఆర్థిక సర్వేలో ఏముంటుంంది..?

Budget session : కేంద్రంలో ఎన్‌డీఏ కూటమి (NDA alliance) వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. బీజేపీ దాని మిత్రపక్షాలన్నీ కలిసి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి (Finacial Minister) నిర్మలాసీతారామన్ (Niramala Sitaraman) రేపు (మంగళవారం) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక్కరోజు ముందు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే (Economic Survey 2024) ను ప్రవేశపెడుతారు.

అంటే ఇవాళ (సోమవారం) ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టునున్నారు. ఆర్థిక సర్వేను 2024 జూలై 22న మధ్యాహ్నం ఒంటిగంటకు లోక్‌సభలో ప్రవేశపెడతారు. ఈ వార్షిక పత్రాన్ని మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభకు సమర్పించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సర్వే 2024 గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేది స్వల్ప, మధ్యకాలిక అవకాశాల గురించి తెలుపుతూ గత సంవత్సరంలో ఆర్థిక స్థితిని సమీక్షించడానికి ప్రధానంగా ప్రభుత్వం సమర్పించే వార్షిక పత్రం.

జాతీయ బడ్జెట్‌కు సంబంధించిన ప్రత్యేకతలను పరిశోధించే ముందు భారత ఆర్థిక వ్యవస్థపై పార్లమెంటు పరిశీలన కోసం సమర్పించిన ఒక వివరణాత్మక నివేదిక కార్డుగా ఆర్థక సర్వేను భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సర్వే వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు వంటి వివిధ రంగాల విశ్లేషణతో సహా గత ఆర్థిక సంవత్సరంలో దేశానికి సంబంధించిన ఆర్థిక పనితీరు వివరాలను తెలుపుతుంది. అలాగే జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, ఉపాధి, ఆర్థికలోటు వంటి ఆర్థిక పరిమితులకు సంబంధించిన గణాంక డేటాను అందిస్తుంది.

అదేవిధంగా ఆర్థిక సవాళ్లను పరిష్కరించడంతోపాటు వృద్ధిని ప్రోత్సహించడానికి విధాన చర్యలను సూచిస్తుంది. ఈ సిఫార్సులను తరచుగా కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో పరిగణిస్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాల సమీక్ష కూడా ఉంటుంది. సీఈఏ మొత్తం మార్గదర్శకత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ) ద్వారా ఆర్థిక సర్వేను రూపొందిస్తారు. ఈ రిపోర్ట్‌కు సంబంధించిన తుది మార్పులను ఆర్థిక కార్యదర్శి ద్వారా సమీక్ష చేసి ఆర్థిక మంత్రి ఆమోదిస్తారు.

ఆర్థిక సర్వేను మూడు భాగాలుగా విభజిస్తారు. మొదటి భాగం దేశ ఆర్థిక స్థితిపై ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ కీలక ఆర్థిక సమస్యలపై సీఈఏ దృక్పథాన్ని అందిస్తుంది. రెండో భాగం ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు సంబంధించిన డేటా, గణాంకాలను వాటి సంబంధిత విభాగాలు, మంత్రిత్వ శాఖల ద్వారా వివరిస్తుంది. మూడో భాగం జాతీయ ఆదాయం, ఉత్పత్తి, ఉపాధి, ద్రవ్యోల్బణం, వాణిజ్యం, ఎగుమతి-దిగుమతి వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థకు అన్ని అంశాలను అందజేస్తుంది. ఇవేగాక ఇతర స్థూల ఆర్థిక గణాంకాలతోపాటు ఈ సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు.