BYD EVs | హైదరాబాద్‌లో ఈవీ తయారీ యూనిట్‌.. ఇక తక్కువ ధరకే ఆ బ్రాండ్‌ కార్లు

దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. 2032 నాటికి ఆరు లక్షల వాహనాలను తయారుచేసే సామర్థ్యం కలిగి ఉంటుందని సమాచారం. బ్యాటరీ తయారీ యూనిట్‌ 20 జీడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో ఉంటుంది.

BYD EVs | హైదరాబాద్‌లో ఈవీ తయారీ యూనిట్‌.. ఇక తక్కువ ధరకే ఆ బ్రాండ్‌ కార్లు

BYD EVs | భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు జోరందుకుంటున్నాయి. భారతీయ మార్కెట్‌లో తమ వంతు వాటా పొందేందుకు ప్రపంచంలోని అతిపెద్ద ఈవీ తయారీదారులు సైతం ఆసక్తిగా చూస్తున్నారు. భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా ఏర్పాట్లు చేసుకుంటుంటే చైనాకు చెందిన ఈవీ కార్ల తయారీ సంస్థ బీవైడీ ఇప్పటికే దేశంలో కాలుమోపింది.

భారత మార్కెట్‌లో తన పునాదులను దృఢంగా తయారుచేసేందుకు బీవైడీ ప్రణాళికలు రచిస్తున్నది. ఇందుకోసం హైదరాబాద్‌లో భారీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పనున్నదని సమాచారం. ది ఫిలాక్స్ కథనం ప్రకారం బీవైడీ కంపెనీ దీనికోసం పది బిలియన్ డాలర్లు.. అంటే సుమారు 85వేల కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధమైంది.

ఒక్కసారి ఈ తయారీ యూనిట్ ఏర్పాటైందంటే తన బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలను ఇక్కడే ఉత్పత్తి చేయనున్నది. తెలంగాణలో ఈ యూనిట్ ఏర్పాటుకు అనువైన స్థలాల కోసం బీవైడీ చూస్తున్నదని, అయితే.. హైదరాబాద్ సమీపంలోనే నెలకొల్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. 2032 నాటికి ఆరు లక్షల వాహనాలను తయారుచేసే సామర్థ్యం కలిగి ఉంటుందని సమాచారం.

బ్యాటరీ తయారీ యూనిట్‌ 20 జీడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. ఇక్కడ తయారు చేయడం ద్వారా కార్లను తక్కువ ధరకే అందించేందుకు, మార్కెట్‌లో బలంగా పాతుకుపోయేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. బీవైడీ కంపెనీ రాకతో ఈవీల తయారీ కంపెనీలకు హైదరాబాద్ కీలక హబ్‌గా మారనున్నది. ఈవీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీని తయారు చేసింది. దీనిలో అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. అన్ని రకాల ఈవీలకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి పూర్తి మినహాయింపు ఇస్తున్నది. ఈ ప్రోత్సాహకాలు 2026 డిసెంబర్ 31 వరకూ కొనసాగనున్నాయి.