DBS: నాలుగు సంస్థలకు డీబీఎస్ ఫౌండేషన్ గ్రాంట్ మంజూరు

డీబీఎస్ ఫౌండేషన్ తన వార్షిక గ్రాంట్ ప్రోగ్రాం కింద 22 బిజినెసెస్ ఫర్ ఇంపాక్ట్ (బీఎఫ్ఐ) సంస్థలను ఎంపిక చేసింది. వీటిలో భారత్ నుంచి నాలుగు సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలకు మొత్తం 4.5 మిలియన్ సింగపూర్ డాలర్ల నిధులను అందజేస్తున్నారు. 1,500 మందికి పైగా దరఖాస్తు చేసిన వారిలో నుంచి ఎంపికైన ఈ సంస్థలు తమ వ్యాపారాలను విస్తరించి, అవసరమైన సముదాయాలకు సహాయం అందించే లక్ష్యంతో పని చేస్తాయి. రాబోవు రెండేళ్లలో ఈ 22 సంస్థల ద్వారా 8,00,000 మందికి సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారత్ నుంచి ఎంపికైన నాలుగు సంస్థలు 7,00,000 సింగపూర్ డాలర్ల గ్రాంట్‌తో పాటు నిపుణుల మార్గదర్శనం, డీబీఎస్ బ్యాంక్ నెట్‌వర్కింగ్ సౌలభ్యాన్ని పొందనున్నాయి. ఈ నిధులు ప్రాథమిక విద్య, పోషణ, ఆరోగ్య సంరక్షణ వంటి ముఖ్య అవసరాలను తీర్చడంతో పాటు నైపుణ్యాలు, ఉద్యోగ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. వృద్ధాప్య సమాజాల అవసరాలను తీర్చే సంస్థల దీర్ఘకాలిక వృద్ధికి తోడ్పడటం డీబీఎస్ ఫౌండేషన్ లక్ష్యం. ఈ ఉద్దేశంతో 2024లో ఇంపాక్ట్ బియాండ్ అవార్డును ప్రారంభించారు. సామాజిక ప్రభావం చూపే సంస్థలకు నిధులు, మార్గదర్శనం, నెట్‌వర్కింగ్ అవకాశాలను అందించడం ఈ గ్రాంట్ ప్రోగ్రాం ఉద్దేశం. 2015 నుంచి డీబీఎస్ ఫౌండేషన్ 160 బీఎఫ్ఐ సంస్థలకు 21.5 మిలియన్ సింగపూర్ డాలర్లకు పైగా నిధులను అందించింది. ఈ సంస్థలు తర్వాత తమంతట తాము 10 రెట్లు అధిక నిధులను సేకరించాయి.
“సమాజంలోని సంక్లిష్ట సమస్యలను పరిష్కరించే సంస్థలకు మా గ్రాంట్ ప్రోగ్రాం తోడ్పడుతుంది. ఈ ఏడాది భారత్ నుంచి నాలుగు సంస్థలు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. అట్టడుగు వర్గాల జీవనోద్ధరణకు అవి కృషి చేస్తున్నాయి. వాటి అభివృద్ధికి మార్గదర్శనం, వనరులు అందించడం ద్వారా భవిష్యత్తును మెరుగుపరచాలని మేము కోరుకుంటున్నాము,” అని డీబీఎస్ బ్యాంక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజ్మత్ హబీబుల్లా తెలిపారు.
భారత్ నుంచి ఎంపికైన సంస్థలు:
1. హసీరు దాలా ఇన్నోవేషన్స్: వ్యర్థాల సేకరణదారులను గ్రీన్ కాలర్ నిపుణులుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతుంది. బెంగళూరులో ప్లాస్టిక్ వ్యర్థాల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి, కొత్త మార్కెట్లకు విస్తరించడానికి ఈ గ్రాంట్ ఉపయోగపడుతుంది.
2. ఎటిపికల్ అడ్వాంటేజ్: దివ్యాంగులకు గౌరవప్రద ఆదాయ మార్గాలను కల్పిస్తున్న భారత్‌లోని పెద్ద లైవ్‌లీహుడ్ ప్లాట్‌ఫామ్. నైపుణ్య శిక్షణ కేంద్రాలు, సమ్మిళిత శిక్షణ సామగ్రి అభివృద్ధికి ఈ నిధులను వినియోగిస్తుంది.
3.న్యూరోసైనాప్టిక్ కమ్యూనికేషన్స్: టెలీమెడిసిన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఆరోగ్య సేవలను అందిస్తుంది. 2027 నాటికి 10 కోట్ల మందికి నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండు కొత్త మెడికల్ కేంద్రాల ఏర్పాటుకు ఈ గ్రాంట్ సహాయపడుతుంది.
4.లాస్ట్ మైల్ కేర్: కార్మికులు, వారి కుటుంబాలకు పని ప్రదేశాల్లో చౌకైన ఆరోగ్య సేవలను అందిస్తుంది. ఒడిషాలో భారీ ఫిజిటల్ హెల్త్‌కేర్ యూనిట్ ఏర్పాటుకు ఈ నిధులను ఉపయోగిస్తుంది.
డీబీఎస్ ఫౌండేషన్ బీఎఫ్ఐ సంస్థలకు మద్దతుగా నిలిచి, బలహీన వర్గాలకు సహాయం అందించే కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రైవేట్, ప్రభుత్వ రంగాలతో కలిసి పని చేస్తోంది. గత ఏడాది నవంబర్‌లో 88 మిలియన్ సింగపూర్ డాలర్లతో 15 కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది. రాబోవు దశాబ్దంలో జీవనోపాధి కల్పన కోసం 1 బిలియన్ సింగపూర్ డాలర్లు, 1.5 మిలియన్ గంటల స్వచ్ఛంద సేవలను అందించాలని 2023లో ప్రకటించింది.