Massive Copper Deposit | 8.4 లక్షల కోట్ల విలువైన 2 కోట్ల టన్నుల రాగి నిక్షేపాలు.. ఎక్కడంటే..
Massive Copper Deposit | అపార ఖనిజ నిక్షేపాలు అన్నీ అనుకోకుండానే బయటపడుతుంటాయి. ఇలాగే ఒక అనూహ్యమైన ప్రాంతంలో భారీ స్థాయిలో ఉన్న రాగి నిక్షేపాలను తాజగా కనుగొన్నారు. ఇది ప్రపంచ మార్కెట్‌ను గణనీయంగా మార్చివేయగలదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్తు రంగంలో, సప్లయి చైన్‌లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందనీ చెబుతున్నారు.

Massive Copper Deposit | రాగి! భారతీయుల్లో అత్యంత పవిత్రమైన లోహాల్లో ఒకటి. పూజా సామగ్రి మొదలు.. వంటింటి వరకూ అనేక రాగి పాత్రలు మన దేశంలోని ఇళ్లలో కనిపిస్తూ ఉంటాయి. ఈ రాగితో అనేక ఉపయోగాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా విద్యుత్తు రంగంలో రాగిని భారీ స్థాయిలో వినియోగిస్తుంటారు. ఇది విద్యుత్తు వాహకంగా పనిచేస్తుంది. వైరింగళ్, మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లలో రాగిని విరివిగా ఉపయోగిస్తారు. రాగి ఉష్ణాన్ని వేగంగా పంపగలుగుతుంది. అందువల్ల వెంటిలేటర్లు, హీట్ ఎక్స్చేంజర్లు, కూలింగ్ పరికరాలు వంటి వాటిలో కూడా వినియోగిస్తారు. ఇక యంత్రాలకు సంబంధించి గేర్లు, బేరింగ్స్, ఫిటింగ్స్ వంటివాటికీ రాగిని వాడుతారు. ఇక గృహాలంకరణలో రాగిని రకరకాలుగా ఉపయోగిస్తుండటం మనం చూస్తున్నదే. శిల్పకళలో దీని నాణ్యత కారణంగా రాగితో చెక్కిన శిల్పాలు నునుపుగా తయారవుతాయి. ఇంతటి కీలకమైన రాగి.. ఒక ప్రాంతంలో కోట్ల టన్నుల్లో లభించింది. ఇక్కడి రాగి నిక్షేపాల విలువ 8 లక్షల కోట్ల రూపాయల పైమాటేనంటే మీరే ఊహించుకోవచ్చు.
చైనాలోని టెబెటన్ పీఠభూమిలో ఈ భారీ రాగి నిక్షేపాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రెండు కోట్ల టన్నులపైనే ఉన్న ఈ నిక్షేపాల నుంచి భవిష్యత్తులో 15 కోట్ల టన్నుల వరకూ వెలికి తీయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ తాజా ఆవిష్కరణ క్వింగ్‌హాయి క్విజాంగ్ ప్రాంతాన్ని ప్రపంచ రాగి నిక్షేపాల ప్రాంతంగా అత్యున్నత స్థానంలో నిలుపనున్నది. ఈ ప్రాంతానికి భూభౌగోళిక, ఆర్థిక విషయాల్లో ప్రాచుర్యం లభించనున్నది.
క్వింగ్‌హాయి క్విజాంగ్ ప్రాంతం ఒకప్పుడు మారుమూల ప్రదేశంగా, వెళ్లటానికి వీలులేని ప్రాంతంగా పేరుపడింది. కానీ.. తాజా ఆవిష్కరణతో ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్ దృష్టిలో పడింది. గత కొన్ని సంవత్సరాలుగా రాగి నిక్షేపాలు ఉన్న ప్రాంతాలుగా చైనాలోని యూలాంగ్, డ్యూలాంగ్, జ్యూలాంగ్, జియామా, సియాంగ్‌కున్-ఝున్యో.. రాగి నిక్షేపాలు అపారంగా ఉన్నవిగా ఫేమస్ అయ్యాయి. తద్వారా ప్రపంచంలోనే అత్యధిక రాగి నిక్షేపాలు ఉన్న గనులుగా ఆవిర్భవించాయి. వీటిలో ఒక్క ప్రధాన గనిలోనే 2 కోట్ల టన్నుల హై క్వాలిటీ ముడి రాగి ఉన్నట్టు గ్లోబల్ టైమ్స్ పేర్కొన్నది. సమీప గనులన్నింటిలో కలిపి 15 కోట్ల టన్నుల రాగి నిక్షేపాలు ఉంటాయని అంచనా. తన 14వ పంచవర్ష ప్రణాళిక (2021-2025)లో భాగంగా ఖనిజ వనరులను భద్రపరచుకోవడానికి చైనా చేస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రయత్నాల నేపథ్యంలో ఈ ఆవిష్కరణ చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. గ్లోబల్ కాపర్ మార్కెట్‌లో చైనా ఆధిపత్యాన్ని ఇది మరింత బలోపేతం చేయనున్నది.
గ్రీన్ ఎనర్జీలో కూడా కాపర్ కీలక పాత్ర పోషిస్తున్నది. పునరుత్పాదక ఇంధన సాంకేతిక పరిజ్ఞానాలైన సౌర విద్యుత్తు ప్యానల్స్, పవన విద్యుత్తు టర్బైన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో దీని ఉపయోగాలు ఎక్కవగా ఉన్నాయి. ఒక ఎలక్ట్రిక్ వాహనంలో సంప్రదాయ కంబూషన్ ఇంజిన్‌లో వాడేదానికి నాలుగింతల రాగిని ఒక్క ఎలక్ట్రిక్ వాహనంలో వాడుతారు. రాబోయే రోజుల్లో అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే రానున్న నేపథ్యం కూడా ఈ నిక్షేపాల ఆవిష్కరణకు కీలకం కానున్నది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ రాగి కొరతను ఎదుర్కొంటున్నది. రాగికి డిమాండ్ గణనీయంగా పెరిగిన పరిస్థితుల్లో ఇంతటి భారీ స్థాయిలో నిక్షేపాలు బయటపడటం ఆశావహ భవిష్యత్తుకు బాటలు వేస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో రాగి ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో చైనా వద్ద భారీ స్థాయిలో నిక్షేపాలు ఉండటం ఆ దేశానికి కలిసొచ్చే అంశమని చెబుతున్నారు. ఆస్ట్రేలియా, చిలీ, కజక్‌స్తాన్ వంటి దేశాల్లో కూడా రాగి నిక్షేపాలు ఉన్నాయి.
అయితే.. భౌగోళికంగా అనే సవాళ్లను విసిరే ప్రాంతంలో ఈ నిక్షేపాలు ఉండటం గమనార్హం. అత్యంత ఎత్తయిన ప్రాంతంలో ఉండటం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ నిక్షేపాలను వెలికి తీయడం పెను సవాళ్లతో కూడుకున్నది. దీనికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి.. వాటిని వెలికి తీయాల్సి ఉంటుంది. ఇప్పటికే అందుకు అవసరమైన ఏర్పాట్లలో చైనా ఉన్నట్టు తెలుస్తున్నది. కఠిన వాతావరణ పరిస్థితుల్లో సైతం స్వతంత్రగా పనిచేయగల డ్రోన్స్, ప్రత్యేకంగా డ్రిల్లింగ్‌కు ఉద్దేశించిన రోబోలను తయారు చేస్తున్నది.
ఇవికూడా చదవండి..
ఆపరేషన్ కగార్: రక్తమోడుతున్న అడవుల్లో ఆదివాసీల అల్లకల్లోల జీవనం
అక్రమ సంబంధం పెట్టుకుందని.. భార్య, ఆమె ప్రియుడిని నరికేసిన భర్త – అనంతరం పోలీసులకు లొంగుబాటు
Bull Rides Activa | అన్ బిలివబుల్.. యాక్టివాపై దూసుకెళ్లిన ఎద్దు.. వీడియో
One Rupee Marriage | వధువే వరకట్నం.. ఒక్క రూపాయితో పెళ్లి చేసుకున్న యువ న్యాయవాది