Tesla under threat | మస్క్‌కు నిద్రలేని రాత్రులు తెచ్చిపెట్టిన 5 చైనా బ్రాండ్ ఈవీ కంపెనీలు
ఒకప్పుడు ఈవీ రంగాన్ని ఏలిన ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ.. ఇప్పుడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నది. చైనా నుంచి ఉత్పత్తి అవుతున్న ఐదు కంపెనీల కార్లు.. ఆయనకు నిద్రలేకుండా చేస్తున్నాయి.

Tesla under threat | టెస్లా! ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ. ఒకప్పుడు ఈవీల తయారీలో ధృవతారగా నిలిచిన ఈ సంస్థ కొంతకాలంగా కష్టాలను ఎదుర్కొంటున్నది. ఈ రంగంలో తీవ్రమైన పోటీ, ఆర్థిక ఒత్తిళ్లు ఆ సంస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నప్పటికీ.. చైనా ఈవీ కంపెనీలు గణనీయ పురోగతిని సాధిస్తుండటంతో టెస్లా పతనం కనిపిస్తున్నది. ప్రత్యేకించి ఐదు చైనా కంపెనీలు.. మస్క్‌కు నిద్రలేని రాత్రులు తెచ్చిపెట్టాయనే అభిప్రాయాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
చైనాలో ఈవీ ఇండస్ట్రీ గత దశాబ్దకాలంగా ఎదురులేదన్నట్టు ఎదుగుతూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది. 2024 ముగిసే నాటికి చైనాకు చెందిన దాదాపు 137 ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్లు మార్కెట్‌లోకి వచ్చాయి. చైనా ప్రభుత్వం ఈవీ సంస్థలకు గట్టి మద్దతు, సబ్సిడీలు అందిస్తున్నది. పరిశోధన, అభివృద్ధికి గట్టి ఆర్థిక దన్నుగా నిలుస్తున్నది. ఆ కంపెనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలను సైతం కల్పిస్తున్నది. దీంతో ఈవీ మార్కెట్ అక్కడ దినదిన ప్రవర్ధమానమవుతున్నది.
గత కొన్నేళ్లుగా BYD, Xpeng, and Li Auto వంటి సంస్థలు ప్రధాన శక్తులుగా ఆవిర్భవించాయి. తొలుత ఈ కంపెనీలు తక్కువ ధరకే ఈవీలను అందించడం, బ్యాటరీ పరిజ్ఞానంలో సాంకేతిక ప్రగతి, ఏఐ, అటానమస్ డ్రైవింగ్‌పై దృష్టి కేంద్రీకరించాయి. ఇప్పుడు అల్ట్రా లగ్జరియస్ ఈవీల తయారీపై దృష్టిసారించాయి. ఫలితంగా ఈ రోజు అటు సాంకేతిక పరిజ్ఞానంలో, కొలమానాల్లో టెస్లాను సవాలు చేస్తున్నాయి. ధరల విషయంలో సైతం పోటీగా నిలుస్తున్నాయి. వెరసి చైనా ఈవీలు గ్లోబల్ ఈవీ మార్కెట్ రూపు రేఖలను మార్చేస్తున్నాయి.
మార్కెట్‌ను శాసించే స్థాయిలో ఎదుగుతున్న చైనా కంపెనీలు ఇవే
బీవైడీ
చైనాలోని టాప్ ఈవీ మేకర్స్‌లో బీవైడీ ఒకటి. గ్వాంగ్‌డాంగ్‌లోని షెన్‌జెన్‌లో ఈ కంపెనీ ఉన్నది. వాస్తవానికి ఇది 1994లో వాంగ్ చువాన్ఫు, మరో 20 మందితో బ్యాటరీల తయారీ కంపెనీగా ప్రారంభమైంది. ఈ రోజు అదే కంపెనీ.. ఇన్నోవేషన్, ఈస్థటిక్స్‌లో ఫ్యూచరిస్టిక్ ఈవీలను తయారు చేస్తున్నది. 2023లో టెస్లా తయారు చేసిన కార్లకంటే ఎక్కువ కార్లను మార్కెట్‌లోకి దించింది. ఈ కంపెనీకి చెందిన పలు మోడళ్లు టాప్ సెల్లింగ్ లిస్టులో చేరాయి.
నియో
షాంఘైకి చెందిన నియో.. 2014లో నెలకొల్పిన కంపెనీ. ప్రధానంగా బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లతో ప్రఖ్యాతి పొందింది. కానీ.. ఇప్పుడు సెమీ అటానమస్, అటానమస్ వాహనాల సాంకేతిక పరిజ్ఞానంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నది. ఓన్వో అనే సబ్ బ్రాండ్‌ను 2024లో తీసుకొచ్చారు. ఇది ప్రధానంగా సాధారణ ప్రజలను లక్ష్యం చేసుకున్నది. గత ఏడాది టెస్లా బెస్ట్ సెల్లింగ్ మోడల్ వై ను ఓన్వో ఎల్60 సవాలు చేసింది.
జీకర్
చైనాలోని మరో ప్రఖ్యాత ఈవీ కంపెనీ. 2021లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ నుంచి జకీర్ 001 మోడల్‌ను 2021 ఏప్రిల్‌లో మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. దాదాపు పోర్షే పనామెరా కారును తలపించేలా ఇది ఉంటుంది. టెస్లా వై మోడల్‌కు పోటీగా ఈ ఏడాది ఏప్రిల్‌లో తన లేటెస్ట్ 7గ మోడల్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త కారు కూడా ఎస్‌ఈఏ ప్లాట్‌ఫామ్ ఆధారితం.
లీ ఆటో
బీజింగ్‌కు చెందిన ఈ ఈవీ ఉత్పత్తిదారు.. రేంజ్ ఎక్సటెండర్ పెట్రోల్ ఇంజిన్లతో ఈవీలను తయారు చేయడం ద్వారా ప్రఖ్యాతి పొందింది. కంపెనీ ప్రధాన కార్యాలయం బీజింగ్‌లో ఉన్నా.. దాని కార్లన్నీ జియాంగ్సులోని ఛాంగ్‌ఝౌలో ఉత్పత్తి అవుతుంటాయి. లీ వన్ పేరిట ఈ కంపెనీ తీసుకొచ్చిన మొదటి కారు.. కుటుంబ అవసరాలకు తగినట్టుగా సీటింగ్, ఇతర సదుపాయాలతో ఉంటుంది.
జెపెంగ్ మోటర్స్
2019లో ప్రారంభమైన ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ.. కారులోపలి ఇన్ఫోటైన్‌మెంట్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌పై ఫోకస్ పెట్టి, తెలివైన ఈవీల తయారీ కంపెనీగా పేరు పొందింది. గ్లోబల్ ఏఐ మొబిలిటీ కంపెనీగా ఎదిగింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన జీ9, జీ6 కార్లు.. హైక్వాలిటీ ఇంటీరియర్స్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలతో హై పర్ఫార్మెన్స్ ఎస్‌యూవీలుగా ఆదరణ పొందాయి.
ఇవికూడా చదవండి..
Bhu Bharati | అందుబాటులోకి ‘భూ భారతి’ వెబ్‌సైట్.. భూముల రిజిస్ట్రేషన్‌కు మార్గదర్శకాలు ఇవే..!
Telangana ministers Silence | రేవంత్‌పై బీఆరెస్ నేతల ముప్పేట దాడి.. మంత్రుల మూతికి తాళం వెనుక!