Telangana ministers Silence | రేవంత్‌పై బీఆరెస్‌ నేతల ముప్పేట దాడి.. మంత్రుల మూతికి తాళం వెనుక!

ఎన్నికలకు ముందు, ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో రేవంత్‌రెడ్డిని బీఆరెస్‌ నాయకులు విమర్శిస్తే.. అంతే స్థాయిలో కాంగ్రెస్‌ నేతలు రియాక్టయ్యేవారు. కానీ.. ఈ మధ్య కాలంలో రేవంత్‌ను కేటీఆర్‌, హరీశ్‌, కవిత టార్గెట్‌ చేస్తూ, పరుష పదజాలంతో దూషిస్తున్నా.. ఇదేదో రేవంత్‌ జవాబు చెప్పుకోవాల్సిందేనన్నట్టుగా మంత్రుల వ్యవహారం కనిపిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telangana ministers Silence | రేవంత్‌పై బీఆరెస్‌ నేతల ముప్పేట దాడి.. మంత్రుల మూతికి తాళం వెనుక!
  • మౌనం దాల్చిన మంత్రులు
  • సీనియర్‌ నాయకులదీ అదే వైఖరి
  • అక్కడక్కడా ఒకరిద్దరు మినహాయింపు
  • తిట్లన్నింటికీ రేవంతే కౌంటరివ్వాలా?
  • ముందున్న దూకుడు ఎక్క‌డ‌ పోయింది?
  • రేవంత్‌పై విమర్శలు ప్రభుత్వంపై కాదా?
  • ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిశీలకులు

(విధాత ప్రత్యేకం)
Telangana ministers Silence | భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్‌) ముఖ్య నాయ‌కులు కే తార‌క రామారావు, టీ హ‌రీశ్ రావు, క‌ల్వ‌కుంట్ల క‌విత ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని ల‌క్ష్యంగా చేసుకుని సూటిపోటి మాట‌ల‌తో ముప్పేట దాడి చేస్తున్నారు. కొన్ని సంద‌ర్భాల‌లో హ‌ద్దులు దాటి ప‌రుష ప‌దాల‌తో విరుచుకుపడుతున్నారు. ఇటు సోష‌ల్ మీడియాలో, అటు ప్ర‌చార ప్ర‌సార సాధ‌నాల్లో ఎగ‌తాళి మాట‌లు సంధిస్తున్నా ఏ ఒక్క మంత్రి కూడా దీటుగా తిప్పికొట్టేందుకు ప్రయత్నం చేయకపోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతున్నది. ఇద్ద‌రు ముగ్గురు కాంగ్రెస్ నాయ‌కులు ఘాటుగా స్పందిస్తున్నా, అవి ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం లేదు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుదీరిన కొత్త‌లో బీఆర్ఎస్ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తే మంత్రులు ఒంటికాలిపై లేచి ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసేవారు. ఇప్పుడా తెగువ ఏ ఒక్క మంత్రిలో క‌న్పించ‌డం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తిట్టేది మమ్మల్ని కాదు కదా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కదా? అనే తృణీకరణ భావం పలువురు మంత్రుల్లో కనిపిస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. తిట్లు పడుతున్న రేవంత్‌రెడ్డే నోరు పెంచుకోవాలనే విధంగా వారి వ్యవహారం కనిపిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మంత్రుల్లో నైరాశ్యం వల్లేనా?

తెలంగాణ కాంగ్రెస్ స‌ర్కార్‌లో అమాత్యుల నైరాశ్యం పెరుగుతోంది. మంత్రి ప‌ద‌వులు ఇచ్చి, కీల‌క‌మైన శాఖ‌లు ఇచ్చినా వాటిపై ప‌ట్టు పెంచుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు. ‘త‌మ సీనియారిటీని గుర్తించి ఇచ్చార‌ని కొంద‌రు, పార్టీని న‌మ్ముకున్నందుకు ప‌ద‌వులు వ‌చ్చాయ‌ని కొంద‌రు ఇలా ఎవ‌రికి వారు తమ అర్హత మేరకేనని ఊహించుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి అంగీకారంతో త‌మ‌కు ప‌ద‌వులు వ‌చ్చాయ‌ని మెజారిటీ మంత్రులు అనుకోవ‌డం లేదు’ అని ఒక సీనియర్‌ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. అమాత్యుల నిర్లిప్త‌త‌, మొక్కుబ‌డిగా ప్ర‌తిస్పందించ‌డాన్ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కులు అలుసుగా తీసుకుని వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగుతున్నారని ఆయన అన్నారు. ‘ఇక నుంచి కేసీఆర్‌ను దూషిస్తే నీ నాలుక చీరేసే రోజు వ‌స్తుంది.. త‌ప్ప‌కుండా గుర్తు పెట్టుకో’ అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఇటీవ‌ల బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ ప‌రుషంగా విమ‌ర్శించారు. ‘స‌ర్కార్ న‌డ‌ప‌లేని స‌న్నాసి’, ‘అహంకారం’, ‘యాక్సిడెంటల్‌ సీఎం’, ‘పేమెంట్ కోటాలో ప‌ద‌వి ద‌క్క‌డంతో క‌ళ్లు నెత్తికెక్కాయి’ అనే విమర్శలు మొదలుకుని.. ‘మందికి పుట్టిన బిడ్డ‌ని మా బిడ్డ‌ అని చెప్పుకునే బాప‌తు’, ‘తాను చ‌నిపోయే నాటికి త‌న మీద బీజేపీ జెండా ఉంటుంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి రేవంత్ మాట ఇచ్చారు’ అంటూ కేటీఆర్‌ చెలరేగిపోయారు. ‘నేను మంత్రి అయిన రోజు నా కారు ముందు డ్యాన్స్ చేసినోడివి, బీఆర్ఎస్ పొత్తుతోనే ఎమ్మెల్యేవి అయ్యావు..’ అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ హ‌రీశ్ రావు నిప్పులు చెరుగుతున్నారు. రేవంత్ రెడ్డి ఆరెస్సెస్‌ సీఎం అని.. ప్రధాని మోదీ డైరెక్షన్‌లో ప‌నిచేస్తున్నారంటూ.. తానేమీ తక్కువ కాదన్న రీతిలో కేసీఆర్‌ పుత్రిక, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత తిట్లు అందుకున్నారు. ఒకటి గమనిస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని ఇతరులపై కంటే ఒక్క రేవంత్‌రెడ్డినే టార్గెట్‌ చేసుకున్నారని స్పష్టమవుతున్నదనే అభిప్రాయాలు ఉన్నాయి.

పార్టీలోనూ… ప్ర‌భుత్వంలోనూ రేవంత్ టార్గెట్‌

పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి ప‌నిచేసిన స‌య‌మంలో బీఆర్ఎస్ ముఖ్య నాయ‌కులు ఎలాగైతే వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు, ఎగ‌తాళి చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా ఆయ‌న ల‌క్ష్యంగా ప‌రుష ప‌దాల‌తో విమర్శలు చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి సీటుకు గౌర‌వం ఇస్తూ సున్నితంగా తిట్టే అవ‌కాశం ఉన్నా ఆ ప‌ని చేయ‌డం లేదు. అదేమంటే ఆయ‌న పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు మా నాయ‌కుడు కేసీఆర్, మా పై ఘాటుగా మాట్ల‌డ‌లేదా అని స‌మ‌ర్థించుకుంటున్నారు. ఏది ఏమైనా రాజకీయ విమర్శలు వేరు.. తిట్లతో సాగే విమర్శలు వేరు. ఎన్నడూ లేని స్థితిని ఇప్పుడు చూస్తున్నామనేది మాత్రం వాస్తవం. హుందాగా సాగిపోయే రాజకీయాల్లో ఈ తిట్ల పురాణాలను పుట్టించిందెవరో అందరికీ తెలుసని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పట్లో కేసీఆర్‌ తిట్టడం మొదలు పెడితే.. పొట్టుపొట్టు తిట్టి పడేసేవారు. దానికి కౌంటర్‌గా మొదలైన ఎదటిపక్షం తిట్లు.. భరించే స్థితిలో బీఆరెస్‌ నేతలు లేరన్న విషయం అర్థమవుతూనే ఉన్నది. దీని సంగతి పక్కనపెడితే.. బీఆర్ఎస్ ముఖ్య‌నాయ‌కులు కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీశ్ రావు, క‌విత ముఖ్యమంత్రిపై చేసే వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు మంత్రులు అదే స్థాయిలో స్పందించ‌డం లేదనేది మాత్రం కనిపిస్తున్న వాస్తవం. ‘న‌న్ను దూషించ లేదు కదా, రేవంత్ ను తిట్టారు క‌దా, ఆయ‌నే చూసుకుంటారులే’ అనే భావనతో మెజార్టీ మంత్రులు మౌనంగా ఉన్నారనే అభిప్రాయాలు రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ మీడియా స‌మావేశం పెట్టినా మొక్కుబ‌డిగా మాట్లాడి మ‌మ అనిపించేలా ఆ విమర్శలు ఉంటున్నాయి.

నాటి దూకుడేది?

ప్ర‌భుత్వం ఏర్పాటు అయిన కొత్త‌లో మంత్రులు కొండా సురేఖ‌, జూప‌ల్లి కృష్ణారావు, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీత‌క్క‌ ఘాటుగా, దీటుగా త‌మ‌దైన శైలిలో మీడియా స‌మావేశాలు నిర్వ‌హించి, బీఆర్ఎస్ నేత‌ల‌పై దుమ్ము దులిపేవారు. ఎక్క‌డ కూడా త‌గ్గ‌కుండా అదే స్థాయిలో ప్ర‌తిస్పందించేవారు. అయితే ఇప్పుడా దూకుడు, దుమ్ము దులుపుడు త‌గ్గించి నిర్లిప్తంగా ఉంటున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి ప‌ద‌వులు త‌మ నియోజ‌క‌వ‌ర్గం కోస‌మే అన్న‌ట్లుగా చ‌క్క‌బెట్టుకుంటున్నారు. క‌నీసం జిల్లా స్థాయిలో కూడా త‌మ ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌డం లేదనే విమర్శలు ఉన్నాయి. నియోజ‌క‌వర్గ ప్ర‌జ‌ల‌కు గోస వ‌స్తే త‌మ‌కు క‌ష్టం వ‌చ్చిన‌ట్లుగా చ‌క‌చ‌కా అధికారుల‌ను పుర‌మాయించి పూర్తి చేయించుకుంటున్నారు. వీళ్లు నియోజ‌క‌వ‌ర్గం మంత్రులా? రాష్ట్రానికి మంత్రులా? అనే చ‌ర్చ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల్లోనే నడుస్తున్నది. రేవంత్ రెడ్డికి మంత్రుల బ‌లం లేద‌నేది బీఆర్ఎస్ ముఖ్య నేత‌లు గ‌మ‌నించి, దాడిని తీవ్రం చేస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

వారి స్థాయి స‌రిపోవ‌డం లేదు..

సీఎం రేవంత్ రెడ్డిపై చేసే విమ‌ర్శ‌ల‌ను ప్ర‌భుత్వ విప్‌లు బీర్ల అయిల‌య్య‌, ఆది శ్రీనివాస్‌, ఎంపీ చామ‌ల కిర‌ణ్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్ వంటివారు తిప్పికొడుతున్నా జ‌నం అంత‌గా స్వీక‌రించ‌డం లేదు. చోటా మోటా నాయ‌కులు మాట్లాడుతున్నారంటూ ప్ర‌జ‌లు టీవీ చానల్‌ మార్చేస్తున్నారు. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లను సీఎం తిప్పికొట్టిన సంద‌ర్భాల్లో ప్ర‌జ‌లు ఆస‌క్తిగా చూస్తున్నారు, ప‌త్రిక‌ల్లో చ‌దువుతున్నారు. త‌న‌పై వ‌చ్చిన అభాండాల‌కు తానే స‌మాధానం చెప్పుకోవాల్సిన ప‌రిస్థితులు అప్పుడూ ఇప్పుడూ ఉన్నాయి. ఇక మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డీ శ్రీధ‌ర్ బాబు, పొన్నం ప్ర‌భాక‌ర్ తో పాటు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క బీఆర్ఎస్ చౌక‌బారు విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి పై చేసిన వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌పై తీవ్రంగా ప్ర‌తిస్పందించ‌డం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పై, రాహుల్ గాంధీ పై విమర్శ‌లు చేసిన సంద‌ర్భంలోనే కొంత క‌ఠినంగా బ‌దులిస్తున్నారు. ఎందుకిలా వ్య‌వ‌హరిస్తున్నార‌నేది కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి..

India-Pakistan ceasefire | కాల్పుల విరమణ సరైందేనా? సీజ్‌ఫైర్‌ వెనుక మతలబేంటి?
Snake in Train | వేగంగా దూసుకుపోతున్న రైలు.. టాయ్‌లెట్‌లో పాము!
Smart Ration cards | తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు ఇంకెప్పుడు? అప్ డేట్ ఏమిటి?

Jalasoudha | ఫైటర్‌ మినిస్టర్‌ శాఖలో ఏం జరుగుతున్నది?
Nominated Posts | తెలంగాణ కాంగ్రెస్‌ సర్కార్‌లో అటకెక్కిన నామినేటెడ్‌ పదవుల భర్తీ