Smart Ration cards | తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు ఇంకెప్పుడు? అప్ డేట్ ఏమిటి?
స్మార్ట్ రేషన్ కార్డుల కోసం తెలంగాణ పేదలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇదిగో అదిగో అని ముఖ్యమంత్రి, పౌర సరఫరాల మంత్రి అంటున్నారేగానీ.. కార్డులు మాత్రం ఇవ్వడం లేదని పేదలు వాపోతున్నారు.

- మే నెల అన్నారు… ఆ ఊసే లేదు
- ప్రతి మూడు నెలలకు హడావుడి..
- తర్వాత మంత్రులు, నేతల మౌనం
- రంగులు మార్చినా.. కార్డులివ్వలేదు
- ఎదురు చూస్తున్న పథకాల లబ్ధిదారులు
- దరఖాస్తులన్నా.. ఆన్‌లైన్ అన్నారు..
- క్షేత్రస్థాయిలో మాత్రం పనికాలేదు..
- ఏపీలో వాట్సాప్ ద్వారా చిటికెలో
- ఇక్కడ బూజుపట్టిన పాత విధానమే
Smart Ration cards | అర్హులైన లబ్ధిదారులకు కొత్త కార్డులు మంజూరు చేస్తామని, కుమారుడు పెళ్లి చేసుకుంటే కుటుంబ యజమాని కార్డు నుంచి వేరు చేసి కొత్తగా మళ్లీ కార్డు మంజూరు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రామ గ్రామాన కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ జమానాలో కార్డులు ఇవ్వకపోవడంతో నిజమేనని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ ఆశలు కల్పిస్తున్నదేగానీ.. కొత్త కార్డులు మంజూరు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాత వాటిలో పేర్లను తొలగించి, వారికి మళ్లీ కొత్త కార్డులు ఇవ్వడం లేదని చెబుతున్నారు. మార్చి నెలాఖరున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామని చెప్పారు. ఈ ఏడాది మే నెలలో స్మార్ట్ కార్డులు ఇస్తామంటూ మార్చి నెలలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రకటనలే తప్ప కార్యరూపం దాల్చకపోవడంతో ప్రజలు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు కన్పిస్తే తిట్టిపోస్తున్నారు.
ఇదిగో ఇస్తున్నామంటున్న ఉత్తమ్
తెలంగాణలో పేదలకు (బీపీఎల్) లబ్ధిదారులకు ఇస్తున్న గులాబీ రంగు కార్డుల స్థానే గ్రీన్ కలర్‌తో రేషన్ స్మార్ట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు నెలల క్రితం తెలిపారు. దారిద్య్రరేఖకు ఎగువన (ఏపీఎల్) ఉన్న వారికి జాతీయ జెండాలోని మూడు రంగులతో స్మార్ట్ కార్డులు ఇస్తామని వివరించారు. గతంలో మాదిరి పేపర్ పుస్తకం మాదిరి కాకుండా ఎండకు ఎండిపోకుండా, వానకు తడవకుండా, ఎక్కడైనా సునాయసంగా వినియోగించుకునేందుకు వీలుగా స్మార్ట్ కార్డు డిజైన్ చేశామన్నారు. కార్డుపై కుటుంబ యజమాని పేరు మాత్రమే ఉంటుందని, అందులో మార్పులు, చేర్పులకు ఇబ్బంది ఉండదన్నారు. మీ సేవా కేంద్రం, తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు సమర్పిస్తే, పౌర సరఫరాల అధికారులు విచారణ జరిపి పేరు చేర్చడం, తొలగించడం జరుగుతుందని వివరించారు. డ్రైవింగ్ లైసెన్స్ కార్డు తరహాలో ఉండే రేషన్ స్మార్ట్ కార్డుల కోసం టెండర్లు ఆహ్వానించామని, మే నెల నుంచి లబ్ధిదారులందరికీ పంపిణీ చేయాలనే యోచనలో ఉన్నామని తెలిపారు. గత దశాబ్ధకాలంగా కొత్త కార్డులు ఇవ్వడం లేదని, పాత వాటిలో కనీసం పేర్లు కూడా చేర్చలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దరఖాస్తులు స్వీకరించి, వెరిఫికేషన్ కూడా పూర్తి చేశామని తెలిపారు. రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని, పాతవారితో పాటు కొత్త లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు ఇస్తామని ఆయన అన్నారు. అయితే మంత్రి ప్రకటించిన ప్రకారం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మార్చి నెలాఖరున ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూతన కార్డులు ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ ఇలా రెండు మూడు సార్లు వాయిదా వేశారు. ఎప్పుడు వీటిని ఇస్తారో తెలియడం లేదని ప్రజలు లబోదిబోమంటున్నారు.
ఏపీలో వాట్సాప్‌లోనే సేవలు
పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కార్డు కావాల్సిన వారు గాభరా పడాల్సిన పనిలేదని, మన మిత్ర వాట్సప్‌లో దరఖాస్తు చేస్తే చాలని ప్రకటించింది. వీలు కానట్లయితే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అడిషన్, డిలీషన్, సరెండర్, అడ్రస్ చేంజ్, అప్టేడ్ వంటి ఏడు రకాల సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఏపీ దూసుకుపోతుండగా తెలంగాణ పౌర సరఫరాల శాఖ మాత్రం ఇంకా బూజుపట్టిన విధానాన్ని అనుసరించడం దారుణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో కొత్త వాటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు తహశీల్దార్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగారు. దరఖాస్తులు సమర్పించేందుకు అపసోపాలు పడ్డారు. ప్రతి దరఖాస్తు కోసం రూ.50 ఫీజు చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. సాంకేతిక లోపాల కారణంగా ప్రజలు ఆర్థికంగా నష్టపోయారు. డబ్బులు చెల్లించినా స్వీకరించినట్లు రశీదులు ఇవ్వలేదు. కొన్ని మీ సేవా కేంద్రాలలో మాత్రమే దరఖాస్తులు స్వీకరించారు. ఆ మరుసటి రోజే మీ సేవలో దరఖాస్తులు స్వీకరించడం లేదని ప్రకటించి ప్రజాగ్రహానికి గురయ్యారు. ఆన్ లైన్ లో కాకుండా కార్యాలయాలకు వెళ్లి అందచేయాలని సూచించింది. అయితే ఇంతకు ముందు గ్రామ సభల్లో, ప్రజా పాలన, ప్రజావాణిలో అప్లికేషన్లు ఇచ్చినవారు మళ్లీ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఒక్క రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచే సుమారు 2 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి అంటే మిగిలిన 8 జిల్లాల నుంచి అంతకు రెట్టింపు సంఖ్యలో నమోదు అయ్యే అవకాశం ఉంది. జిల్లాల వారీగా ఎన్ని దరఖాస్తులు అందాయి, ఎన్నింటిని వెరిఫికేషన్ చేశారు, తిరస్కరించినవి ఎన్ని అనే వివరాలను ఇప్పటి వరకు పౌర సరఫరాల శాఖ అధికారికంగా ప్రకటించలేదు. కాగా అందిన దరఖాస్తులను వడపోశామని, స్మార్ట్ కార్డుల పంపిణీ కోసం టెండర్లు పిలిచామని, మే నెలలో కొత్త వారితో పాటు పాత లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అయినా ఇప్పటి వరకు ఈ దిశగా ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఎప్పటి నుంచి ఇస్తారనేది స్పష్టత ఇవ్వడం లేదు. ప్రస్తుతం జిల్లాల వారీగా రేషన్ షాపులు, కార్డుల సంఖ్య, కుటుంబ సభ్యుల సంఖ్య వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..