టారిఫ్‌లను.. ట్రంప్ ఉపసంహరించుకోవాలి: ఎలాన్ మస్క్

ప్రతీకార టారిఫ్‌ల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టెస్లా అధిపతి, అమెరికా ప్రభుత్వ సలహాదారు ఎలాన్ మస్క్ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను కోరారు. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. అమెరికా, యూరప్ మధ్య జీరో టారిఫ్‌లు ఉండాలని తాను కోరుకుంటున్నట్టు మస్క్ ఇటీవల ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో మితవాద లీగ్ పార్టీ సభ్యులతో వర్చువల్‌గా జరిగిన చర్చల్లో స్పష్టం చేసినట్టు వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. దేశాధ్యక్షునితో మస్క్ విభేదించడం ఇదే మొదటిసారి అని ఆ పత్రిక రాసింది.
మస్క్‌కు సన్నిహితులైన ఇద్దరు ప్రముఖులు ఈ విషయం వెల్లడించినట్టు ఆ పత్రిక పేర్కొంది. అయితే ఈ పరిణామంపై శ్వేతభవనం వర్గాలు, మస్క్ స్పందించలేదని రాయిటర్స్ తెలిపింది. అమెరికా ప్రభుత్వంలో వృథా ఖర్చులను తగ్గించే డిపార్టుమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీకి మస్క్ నాయకత్వం వహిస్తున్న విషయం విదితమే. మస్క్‌పైన, ఆయన కార్లపైన యూరప్‌లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ సూచనలు చేసినట్టు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో టెస్లా కార్ల విక్రయాలు 42 శాతం పడిపోయాయి.