Tips To Choose Health Insurance | హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? : ఇవి తెలుసుకోండి…..

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు ప్రీమియం, కవరేజీ, వెయిటింగ్ పీరియడ్, క్లైయిమ్ నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకోండి.

Tips To Choose Health Insurance | హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? : ఇవి తెలుసుకోండి…..

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జ్వరం వచ్చిందని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే టెస్టుల పేరుతో జేబులు ఖాళీ అవుతున్నాయి. ఏదైనా పెద్ద జబ్బు లేదా శస్త్రచికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తే ఇక పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఎక్కువ మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే సమయంలో కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.

ఎలాంటి పాలసీలు తీసుకోవాలి ?

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులుంటారు.. వారి వయస్సు, వారి ఆరోగ్య పరిస్థితులు వారికి అవసరమయ్యే హెల్త్ పాలసీ ఏంటనే విషయాలను పరిశీలించిన తర్వాత పాలసీ తీసుకోవాలి. ఉదహరణకు రూ. 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఏయే కంపెనీలు ఎంత ప్రీమియం వసూలు చేస్తున్నాయి? ఏయే జబ్బులకు ఇన్సూరెన్స్ కల్పిస్తున్నాయి? వెయిటింగ్ పీరియడ్ ఎంత? ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. నిబంధనలు, షరతులు ఆయా కంపెనీల్లో ఉన్న తేడా… ఏ కంపెనీ పాలసీ అయితే మీతో పాటు మీ కుటుంబసభ్యులకు ఉపయోగమనే విషయాన్ని బేరీజు వేసుకోవాలి. అప్పుడు పాలసీ తీసుకోవాలి.

తక్కువ ప్రీమియంతో పాలసీ కావాలా?

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొనే సమయంలో మీ కుటుంబానికి మొత్తం పాలసీ వర్తిస్తోందా? మీకు ఒక్కరికే ఇన్సూరెన్స్ వర్తిస్తోందా? ఎంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందనే విషయాల గురించి ఇన్సూరెన్స్ ఏజంట్లు లేదా ఆ పాలసీ గురించి ఆన్ లైన్ లో సెర్చ్ చేసి తెలుసుకోవాలి. తక్కువ ప్రీమియం చెల్లించాలంటే వయస్సు తక్కువగా ఉండాలి. పాలసీ తీసుకొనే వ్యక్తి వయస్సు ఎక్కువగా ఉంటే ప్రీమియం ఎక్కువగా చెల్లించాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఉదహరణకు రూ. 5లక్షల పాలసీని 25 ఏళ్ల వ్యక్తి తీసుకుంటే ఆయనకు ప్రీమియం తక్కువగా ఉంటుంది. 40 ఏళ్ల వయస్సున్న వ్యక్తి తీసుకుంటే ఆయన ప్రీమియం ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ తక్కువ ప్రీమియంతో పాలసీలు తీసుకుంటే అన్ని రకాల జబ్బులు లేదా శస్త్రచికిత్సలు అందులో కవర్ కావు. అలాంటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా ఉపయోగం ఉండదు. తక్కువ వయస్సులోనే పాలసీని తీసుకుంటే ప్రీమియం తక్కువగా చెల్లించేందుకు అవకాశం ఉంటుంది.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొనే సమయంలో అన్ని విషయాలను సమగ్రంగా నమోదు చేయించాలి. వయస్సు, ఆదాయం, వృత్తి వంటి అంశాలతో పాటు ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని కచ్చితంగా నమోదు చేయించాలి. కొందరికి గుండె, కిడ్నీ వంటి సమస్యలు లేదా బీపీ, షుగర్ వంటివి ఉంటే వాటి వివరాలను చెప్పాలి. ఒకవేళ ఈ వివరాలను నమోదు చేయకపోతే క్లైయిమ్ చేసే సమయంలో ఇబ్బందులు తప్పవు. క్లైయిమ్ చేసుకొనేందుకు ఎంత సమయం అనే విషయాల గురించి కూడా తెలుసుకోవాలి. ఆ కాలపరిమితి లోపుగా ఇన్సూరెన్స్ కంపెనీ అడిగిన వివరాలు, డాక్యుమెంట్లను అందించాలి.. అప్పుడే క్లైయిమ్ చేసుకొనేందుకు అవకాశం లభిస్తోంది.

టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఏంటి?

మీరు తీసుకున్న బేస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అధిక ఇన్సూరెన్స్ పాలసీగా అప్ గ్రేడ్ చేయడానికి టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉపయోగపడుతుంది. తక్కువ ప్రీమియంతోనే ఇది వినియోగదారుడికి లభిస్తోంది. బేస్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా ఉదహరణకు రూ. 5 లక్షలు క్లైయిమ్ చేసుకొనే పరిస్థితి ఉంటే… టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ద్వారా రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఖర్చు కూడా ఈ పాలసీ ద్వారా క్లైయిమ్ చేసుకోవచ్చు. ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ గా చేరిన సమయంలో డాక్టర్ ఫీజు సహా అన్ని కూడా దీని ద్వారా క్లైయిమ్ చేసుకొనే వెసులుబాటు ఉంది.