తగ్గిన బంగారం,వెండి ధరలు

బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.920 తగ్గి రూ.1,54,970కు, కిలో వెండి రూ.5,000 తగ్గి రూ.2.50 లక్షలకు చేరింది.

అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ఆర్థిక మార్పుల ప్రభావంతో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ద పరిస్థితులు.. హర్మూజ్ జలసంధిపై ట్రంప్ ప్రకటనతో మళ్లీ వేడెక్కడం ప్రపంచ మార్కెట్లను కలవరపరుస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సేఫ్ హెవన్ వైపు మళ్లిస్తున్నారు. దీంతో బంగారం ధరలు నింగిని తాకుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి పెరిగిన బంగారం ధరలు ఈ రోజు సామాన్యులకు ఊరటనిస్తూ కాస్త తగ్గాయి.

బులియన్ మార్కెట్ లో బుధవారం బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.920 తగ్గి రూ.1,54,970 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.850 తగ్గి రూ.1,42,050 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 5,000 తగ్గి రూ. 2,50,000 వద్ద కొనసాగుతుంది.

పెరగునున్న పసిడి, వెండి ధరలు

అమెరికా వడ్డీ రేట్ల తగ్గించే సూచనలు, స్టాక్ మార్కెట్లలోని మార్పులు, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు విలువైన లోహాల ధరలను మరింత పైకి నడిపిస్తాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంగారం ధర 4,600 డాలర్లను తాకితే వెండి ధర ఔన్సుకు 70 డాలర్లకు పైగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే వెండి ధరలు సుమారు 15 శాతం వరకు పెరిగాయని.. ఈ ఊపు రాబోయే రోజుల్లోనూ కొనసాగుతుందని రాబర్ట్ కియోసాకి వివరించారు. రాబోయే నెలల్లో వెండి ధర ఔన్సుకు 200 డాలర్లకు, బంగారం ధర ఔన్సుకు 10,000 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయని పేర్కొన్నారు.

చైనా, జపాన్ భారీగా పసిడి కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఇండియాలో కూడా పసిడి ధరలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి ఇదే విధంగా ఉంటే తులం బంగారం రూ.2 లక్షల వరకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

Latest News