భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్ లో బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గు ముఖం పట్టాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,070 తగ్గి రూ. 1,52,020 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,900 తగ్గి రూ.1,39,350 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 2,50,000 వద్ద కొనసాగుతుంది.

విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక సమీకరణాల మార్పుల క్రమంలో బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తీవ్ర అస్థిరతకు లోనవుతున్నాయి. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న భారీ ర్యాలీకి బ్రేక్ వేస్తూ.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న నిర్ణయాలు, కఠిన వైఖరి సంకేతాలు పసిడి లోహాలపై విక్రయాల ఒత్తిడిని పెంచాయి. బుధవారం బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా దిగివచ్చాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,070 తగ్గి రూ. 1,52,020 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,900 తగ్గి  రూ.1,39,350 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.10వేలు తగ్గి  రూ. 2,50,000 వద్ద కొనసాగుతుంది.

హెచ్చుతగ్గుల ఆటలో ముందుకే..

రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరుగుతాయా లేదా అనేదానిపై మార్కెట్ నిపుణులు భిన్న అంచనాలు వెల్లడించారు. వెండితో పోలిస్తే బంగారానికే బలమైన మద్దతు కలిగి ఉందని జూలియస్ బేర్ రీసెర్చ్ హెడ్ కార్టెన్ పేర్కొన్నారు. సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఇండస్ట్రియల్ డిమాండ్ మందగించడం, చైనాలో సోలార్ మాడ్యూల్స్ వృద్ధి తగ్గటం వంటి అంశాలు వెండిపై ఒత్తిడిని పెంచుతున్నాయని వివరించారు. ప్రముఖ సంస్థ మోనార్క్ పీఎంఎస్ 2026 చివరి నాటికి బంగారం, వెండి ధరలపై మూడు భిన్నమైన అంచనాలను ప్రకటించింది.

ఇందులో భాగంగా తులం బంగారం ధర ఏకంగా రూ. 1లక్ష 52వేల 554 నుంచి రూ.1లక్ష 70వేల 861 మధ్యకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ఈ గరిష్ట అంచనా నిజం కావాలంటే కొన్ని ప్రత్యేక ఆర్థిక పరిస్థితులు అనుకూలించాలని పేర్కొంది. అమెరికా లేబర్ మార్కెట్లో తీవ్ర బలహీనత ఏర్పడి, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవలసి రావడం, రియల్ ఈల్డ్స్ పడిపోవడం, ప్రపంచవ్యాప్తంగా సంస్థాగత పెట్టుబడిదారులు తిరిగి గోల్డ్ వైపు మళ్లడం వంటి బలమైన కారణాలు తోడైతేనే బంగారం ధర రూ.1 లక్ష 70వేల 861 స్థాయిని తాకే అవకాశం ఉందని వివరించింది.

లేదంటే రూ.1లక్ష 35వేల నుంచి రూ.1లక్ష 55వేల మధ్య మరికొంత కాలం హెచ్చుతగ్గులకు గురి కావచ్చంటున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ సవాళ్లు, ఫెడ్ విధానాల ఆధారంగా రాబోయే కాలంలో బంగారం, వెండి ధరల గమనం పూర్తిగా ఆధారపడి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో పుంజుకునే అవకాశాలు ఎక్కువని అంటున్నారు.

Latest News