Hyderabad Real Estate | కమర్షియల్ స్పేస్ ‘ఇంటి’ చూపు!.. గచ్చిబౌలిలో 44% స్పేస్ ఖాళీ.. మరో దారి లేక రెసిడెన్షియల్స్‌గా మార్పు
గచ్చిబౌలిని గమనిస్తే.. భారీ నిర్మాణాలు ఉన్నాయి కానీ.. ఖాళీలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇక్కడి నిర్మాణల్లో 44.03% ఖాళీగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇక్కడ సగటు అద్దె 68.56 రూపాయలుగా ఉన్నది. ఇప్పటికే భారీ స్థాయిలో ఖాళీలు ఉండగా.. కొత్తగా 3.11 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మాణంలో ఉన్నది. ఇది ఇప్పటికే ఉన్న ఖాళీ స్పేస్ శాతంపై మరింత ఒత్తిడి పెంచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Hyderabad Real Estate | హైదరాబాద్ హ్యాపెనింగ్ సిటీ అన్నారు! రాబోయే రోజుల్లో ఎక్కడికో వెళ్లిపోతుందని ఊహల్లో విహరింపజేశారు! నిజమేననుకుని నమ్మేసిన రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థలు.. టెక్ హబ్‌గా ఉన్న కోర్ సిటీలో భారీ మల్టీస్డోరీడ్ టవర్లను నిర్మించాయి. కానీ.. బలుపు కాదు.. వాపేనని తేలింది. ఇప్పుడు ఆ టవర్లను కొనేవాళ్లు సరే.. కనీసం లీజుకు లేదా అద్దెకు తీసుకునేవాళ్లు కూడా కనిపించడం లేదు. మరో మార్గంలేని రియల్ ఎస్టేట్ కంపెనీలు వాటిని రెసిడెన్షియల్ ఫ్లాట్లుగా మార్చి.. వచ్చినకాడికి అమ్ముకుంటున్న దుస్థితి కనిపిస్తున్నది. ఈ మేరకు హైదరాబాద్ రియాలిటీ (@where2buy_hyd) ఎక్స్‌లో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టింది. హైదరాబాద్ నగర వాణిజ్య కల వేగంగా మసకబారుతున్నదన్న సంకేతాలను ఇచ్చింది. ప్రత్యేకించి గచ్చిబౌలి – ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఆఫీసుల కోసం నిర్మించిన టవర్లలో ఖాళీలు 44 శాతానికిపైగానే ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉందని తెలిపింది. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఆందోళన కలిగిస్తున్న ఈ ఖాళీలు.. మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నది.
దృష్టిపెట్టని జీసీసీలు
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) నుంచి డిమాండ్ లేకపోవడంతో డెవలపర్లు వాటిని నివాస ప్రాజెక్టులుగా మార్చేందుకు సిద్ధమవుతున్నారని ఈ పోస్టింగ్ సారాంశం. అనేక ప్రముఖ కమర్షియల్ స్పేస్‌లను నివాస ఫ్లాట్‌లుగా మార్చే పనులు కూడా వేగంగానే సాగుతున్నాయని తెలుస్తున్నది. ఫీనిక్స్, రాఘవ సీఐఎన్‌క్యూ, కాండ్యూర్ స్కైలైన్, పలైస్ రాయల్, వరాహ ఇన్‌ఫ్రా వంటివి ఈ ప్రయత్నాల్లో ఉన్నట్టు హైదరాబాద్ రియాల్టీ పేర్కొన్నది. బాబూఖాన్ టెక్ పార్క్‌ను లాన్సమ్ ఎలేనాగా రీడెవలప్ చేశారని తెలిపింది. మైహోమ్ వాణిజ్య నిర్మాణాన్ని సైతం గ్రావా రెసిడెన్సెస్‌గా మార్పు చేశారని పేర్కొన్నది. మరికొన్నింటిని గమనిస్తే.. ఎస్‌ఏఎస్ డైమండ్‌ను ఆర్ వన్ డైమ్‌గా (మిశ్రమ ఉపయోగం) మార్చారు. ఆర్‌ఎంజెడ్ మైహోం జేవీ 25 ఎకరాల మెగా ప్రాజెక్టు సైతం రెసిడెన్షియల్ రూపు తీసుకోబోతున్నదని సమాచారం. ఓఆర్‌ఆర్ బెల్ట్‌లో జయభేరి పినాకిల్ నుంచి నియోపోలిస్ ఎంట్రీ వరకు ఒకప్పుడు టెక్ పార్క్‌ల కోసం ఉద్దేశించిన భారీ భవనాలన్నీ.. మౌనంగా రూపు మార్చుకుంటున్నాయని హైదరాబాద్ రియాలిటీ తన పోస్టులో వ్యాఖ్యానించింది. రాయ్‌దుర్గ్ నుండి నియోపోలిస్ వరకు మెట్రో కనెక్టివిటీ వంటి కీలకమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్లే జీసీసీలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కార్యకలాపాలను ప్రారంభించేందుకు వెనుకాడుతున్నాయని పేర్కొంటున్నారు.
గచ్చిబౌలిలో 44.03 శాతం ఖాళీ!
ఈ ట్వీట్లో జత చేసిన మార్కెట్‌బీట్ డాటా ప్రకారం.. సంవత్సరానికి 5.3% పెరుగుదల (1,32,200 చదరపు మీటర్లకు), 1.2% త్రైమాసిక పెరుగుదలను చూపిస్తున్నది. ఇది ఓవర్ సప్లైని సూచిస్తున్నది. అయితే.. ప్రీమియం నివాసాల అమ్మకాలు (కోటి రూపాయల కంటే ఎక్కువ ఉండే ఇళ్లు) 14 శాతం పెరుగుదలను చూపిస్తున్నాయని 2024 నైట్‌ఫ్రాంక్ నివేదిక పేర్కొంటున్నది. మొత్తం హైదరాబాద్‌లో 11.29 కోట్ల చదరపు అడుగులు అందుబాటులో ఉంటే.. అందులో 23.10 శాతం ఖాళీగా ఉన్నట్టు మార్కెట్‌బీట్ పేర్కొంటున్నది. ఇవి కాక మరో 4.08 కోట్ల చదరపు అడుగులు వివిధ ప్రాజెక్టుల్లో నిర్మాణంలో ఉన్నాయి. సబ్ మార్కెట్ ప్రకారం చూస్తే.. మాదాపూర్‌లో ఖాళీ శాతం తక్కువగా (10.48%) కనిపిస్తున్నది. ఇక్కడ గరిష్ఠ అద్దె నెలకు చదరపు అడుగుకు 91.73 రూపాయలుగా ఉన్నది. ఇక్క మార్కెట్ బలంగా ఉన్నది. అధిక అద్దెలు వసూలవుతున్నాయి. మరో 97.52 లక్షల చదరపు అడుగుల నిర్మాణం జరుగుతున్నది. గచ్చిబౌలిని గమనిస్తే.. భారీ నిర్మాణాలు ఉన్నాయి కానీ.. ఖాళీలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇక్కడి నిర్మాణల్లో 44.03% ఖాళీగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇక్కడ సగటు అద్దె 68.56 రూపాయలుగా ఉన్నది. ఇప్పటికే భారీ స్థాయిలో ఖాళీలు ఉండగా.. కొత్తగా 3.11 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మాణంలో ఉన్నది. ఇది ఇప్పటికే ఉన్న ఖాళీ స్పేస్ శాతంపై మరింత ఒత్తిడి పెంచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.