PMAY | సొంతింటి కల కనేవారికి గుడ్ న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద గృహ రుణాలపై వడ్డీ రాయితీ.. దరఖాస్తు చేసుకోండి ఇలా..!
PMAY | దేశంలోని మధ్య తరగతి ప్రజలకు సొంతిల్లు నిర్మాణం, కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తుంది. సొంతిల్లు నిర్మాణం, కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందితే.. వడ్డీ రాయితీ కల్పిస్తుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద ఈ లబ్ది పొందొచ్చు. గత కొంతకాలంగా ఈ పథకం అటకెక్కగా, తాజా బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు.

PMAY | సొంతిల్లు కలిగి ఉండాలని ప్రతి మధ్య తరగతి వ్యక్తి కల. ఇందుకోసం పడరాని కష్టాలు పడుతుంటారు. వ్యక్తుల వద్ద అప్పులు చేస్తుంటారు. ఆ అప్పులు పెరిగి పోతుంటాయి. ఒకానొక దశలో అప్పులు తీర్చలేక సతమతమవుతుంటారు. అలాంటి సమస్యల బారిన పడొద్దనే ఉద్దేశంతో.. దేశంలోని మధ్య తరగతి ప్రజలకు సొంతిల్లు నిర్మాణం, కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తుంది. సొంతిల్లు నిర్మాణం, కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందితే.. వడ్డీ రాయితీ కల్పిస్తుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద ఈ లబ్ది పొందొచ్చు. గత కొంతకాలంగా ఈ పథకం అటకెక్కగా, తాజా బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్( Nirmala Sitharaman ) కీలక ప్రకటన చేశారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం కింద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు గృహ రుణంపై గతంలో లభించిన వడ్డీ రాయితీ( Subsidy )ని మళ్లీ అమలు చేస్తామని నిర్మలమ్మ ప్రకటించారు. పీఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద 1 కోటి పట్టణ పేద, మధ్యతరగతి కుటుంబాల గృహ అవసరాల కోసం రూ. 10 లక్షల కోట్లు ప్రభుత్వం వెచ్చించనుంది. ఇందులో రూ. 2.2 లక్షల కోట్ల మేరకు కేంద్రం సహాయం చేస్తుంది. రాబోయే ఐదేండ్లలో సరసమైన ధరలకు రుణాలను అందించడానికి ఈ వడ్డీ రాయితీ ఇవ్వనున్నాం’ అని నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 2022లో దీనిని నిలిపివేసిన తర్వాత క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ కింద వడ్డీ రాయితీని తిరిగి ప్రవేశపెట్టడాన్ని పలువురు విశ్లేషకులు స్వాగతించారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి దరఖాస్తు చేసుకోండి ఇలా..
ప్రధాన మంత్రిఆవాస్ యోజన అనేది సమాజంలోని బలహీన వర్గాలకు, తక్కువ ఆదాయ వర్గాలకు, పట్టణ మరియు గ్రామీణ పేదలకు సరసమైన ధరలో గృహాలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించబడింది. ఈ పథకానికి అర్హులైన వారికి కేంద్రం ఆర్థిక సహకారం అందిస్తుంది. పీఎం ఆవాస్ యోజన కింద లబ్ది పొందటానికి దరఖాస్తు ప్రక్రియ ఇదే..
అర్హులు ఎవరంటే..?
భారతదేశ నివాసితులై ఉండాలి. పక్కా ఇల్లు అసలే ఉండకూడదు. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం నిర్దేశించిన పరిమితుల్లో ఉండాలి. ఇక ఇతర హౌసింగ్ స్కీమ్‌ల కిద ఎలాంటి కేంద్ర సహాయాన్ని పొంది ఉండకూడదు. ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలి.
దరఖాస్తు చేయడం ఎలా..?
పీఎం ఆవాస్ యోజన పథకానికి అర్హులైన వారు PMAY వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ ‘సిటిజన్ అసెస్‌మెంట్’ ఆప్షన్ ఎంచుకుని, వర్తించే కేటగిరీని ఎంచుకోవాలి. ‘మురికివాడల నివాసితుల కోసం’ లేదా ‘ఇతర 3 భాగాల క్రింద ప్రయోజనాలుస.. ఈ రెండింటిలో ఏది వర్తిస్తదో అది సెలెక్ట్ చేయాలి. ఈ దరఖాస్తు ప్రక్రియను కొనసాగించడానికి మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం పూర్తి వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి. దరఖాస్తులో వ్యక్తిగత వివరాలు, అడ్రస్, ఆదాయ వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. చివరగా సబ్‌మిట్ చేసే ముందు.. వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
ఈ ధృవీకరణ పత్రాలు సమర్పించాలి..
దరఖాస్తుతో పాటు ఐడెంటిటీ కార్డు, అడ్రస్ ప్రూఫ్, ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి. అవసరమైతే మీ ఆస్తి పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. అధికారులు మీ అర్హత, పత్రాలను తనిఖీ చేస్తారు. దరఖాస్తు ఆమోదించబడితే దానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను అందుకుంటారు.
సబ్సిడీ పంపిణీ
అర్హులైన దరఖాస్తుదారులకు హోమ్ లోన్ వడ్డీ రేటుపై సబ్సిడీని అందుకుంటారు. మొత్తం మీ ఆదాయ సమూహం, లోన్ మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఈ సబ్సిడీ ఇంటి నిర్మాణ ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుంది.
ట్రాకింగ్ అప్లికేషన్ స్టేటస్
దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ స్టాటస్‌ను ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకోవచ్చు. PMAY వెబ్‌సైట్‌ని సందర్శించి అక్కడ ‘ట్రాక్ యువర్ అసెస్‌మెంట్ స్టేటస్’ ఆప్షన్ ఎంచుకోండి. అప్‌డేట్‌లను వీక్షించడానికి మీ అసెస్‌మెంట్ ID లేదా ఆధార్ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా దరఖాస్తును పరిశీలించుకోవచ్చు.