BJP National President | అధ్యక్ష ఎంపికలో అడ్డంకులెన్నో! సంకీర్ణాల నేపథ్యంలో భారీ కసరత్తు!

BJP National President | అధ్యక్ష ఎంపికలో అడ్డంకులెన్నో! సంకీర్ణాల నేపథ్యంలో భారీ కసరత్తు!

BJP National President | గత దశాబ్ద కాలంగా దేశంలో అత్యంత శక్తిమంతమైన పార్టీగా చెప్పుకొనే బీజేపీ.. తన అంతర్గత సున్నిత సమస్యను పరిష్కరించుకోవడానికి నానా యాతనలు పడుతున్నది. అదే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఎంపిక. అంతర్గత సమస్యల కారణంగా ఈ విషయాన్ని నాన్చుతూ వస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైకి చూడటానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక సాధారణంగా నిర్దిష్టకాల పరిమితిలో జరిగిపోయేదే అనిపిస్తుంది. కానీ.. దాని వెనుక రాజకీయ నిర్ణయం ఆధారపడి ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తీవ్ర నిరుత్సాహ ఫలితాలను సాధించింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలకు మళ్లీ పార్టీని పటిష్టం చేసుకోవడంతోపాటు, పార్టీలో ఆధిపత్య ధోరణులు, అంతర్గత సమస్యల పరిష్కారం కూడా కొత్త జాతీయ అధ్యక్షుడి నియామకాన్ని ప్రభావితం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సమర్థుడైన నేతను ఎన్నుకోవడం అనే ఒక్క విషయానికే ఈ సమస్య పరిమితమై లేదని వారు అంటున్నారు. దీర్ఘకాలిక రాజకీయ, సైద్ధాంతిక పారామీటర్లతోపాటు.. ‘అందరి’ ఆమోదం లభించే వ్యక్తి అయి ఉండాలి. దీనికి తోడు గత దశాబ్ద కాలంగా బీజేపీలో కీలక అధికారాలు మొత్తం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చుట్టూ కేంద్రీకృతమై ఉండిపోవడం ఈ ఎంపికను మరింత సంక్లిష్టంగా మార్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో సంఘ్‌పరివార్‌గా పిలిచే విస్తృత నెట్‌వర్క్‌లోని ఆరెస్సెస్‌, వీహెచ్‌పీ ఉండనే ఉన్నాయి. వీటన్నింటి ఆమోద ముద్రలు లభిస్తేనే కొత్త అధ్యక్షుడు ఎంపికవుతారు. ఇక్కడే అసలు సమస్యలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగిసిపోవడమే కాదు.. పొడిగింపు కాలం కూడా ముగిసిపోతున్నది. బీజేపీలో భూపేందర్‌ యాదవ్‌, వినోద్‌ తావ్డే, సునీల్‌ బన్సల్‌ వంటివారు పార్టీ కార్యక్రమాల రీత్యా సమర్థులగానే కనిపిస్తున్నా.. వారికి జాతీయ స్థాయిలో చరిష్మా లేదని అంటున్నారు. ఇక ప్రాంతీయంగా అత్యంత ప్రభావవంతమైన యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వంటివారు ఉన్నా.. వారిని జాతీయ స్థాయికి ప్రమోట్‌ చేస్తే వారి రాష్ట్రాల్లోని పార్టీలో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న చర్చ నడుస్తున్నది. అంతేకాదు.. ఈ ఇద్దరూ కరడుగట్టిన హిందూత్వ వాదులు. దేశంలో మళ్లీ సంకీర్ణాల యుగం మొదలైందనే అభిప్రాయాలు ఉన్న ప్రస్తుత తరుణంలో ఉదారంగా వ్యవహరించేవారు, చాకచక్యంతో అందరినీ కలుపుకొని పోయేవారు పార్టీకి అవసరం. దానికి బదులు కరడుగట్టిన హిందూత్వ వాదులను తెరపైకి తీసుకొస్తే మరింత మితవాద రాజకీయాలవైపు బీజేపీ వెళుతున్నదనే సంకేతాలు వెళతాయి. ఈ క్రమంలోనే మధ్యేమార్గంగా మహిళా అధ్యక్షురాలు అన్న వాదన ఒకటి తెరపైకి వచ్చిందని చెబుతున్నారు. అదే జరిగితే 45 ఏళ్ల పార్టీ చరిత్రలో బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలను ఒక మహిళకు అప్పగించినట్టు అవుతుంది. ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌, ఏపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, తమిళనాడు నేత వానతి శ్రీనివాసన్‌ పేర్లు చర్చల్లోకి వచ్చాయి. నిర్మలా సీతారామన్‌ అందరికీ ఆమోదయోగ్యమైన నేత అన్న అభిప్రాయాలు బీజేపీలో సైతం వ్యక్తమవుతున్నాయి. మహిళకు అప్పగించే విషయంలో నిర్మాలా సీతారామన్‌ పట్ల ఆరెస్సెస్‌ సైతం అనుకూలంగానే ఉందని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టుసాధించాలనుకునే లక్ష్యం, వచ్చే ఎన్నికల్లో అమలు కానున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు నేపథ్యంలో మహిళా అధ్యక్షురాలివైపు అధినాయకత్వం మొగ్గు చూపుతుందనే వాదన వినిపిస్తున్నది.

ఇదిలా ఉంచితే.. ఇప్పటిదాకా అగ్రవర్ణాల పార్టీగా ఉన్న బీజేపీ.. తన సామాజిక పునాదిని విస్తరించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నది. ప్రత్యేకించి ఓబీసీ వర్గాల్లోకి, దళిత, గిరిజన వర్గాల్లోకి చొచ్చుకుపోయేందుకు విపరీతంగా కృషి చేస్తున్నది. పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపికలో కూడా దీనిని ప్రతిఫలింప చేయాలనే అభిప్రాయం అధినాయకత్వంలో కనిపిస్తున్నదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అదే సమయంలో అగ్రవర్ణాల్లో గట్టి పునాది కలిగినందున వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. మరొక ఫ్యాక్టర్‌గా భౌగోళిక వైవిధ్యం కూడా కనిపిస్తున్నది. ఇప్పటిదాకా బీజేపీలో ఉత్తరాది ఆధిపత్యం గణనీయంగా ఉన్నది. తాజాగా దక్షిణాదితోపాటు.. ఈశ్యాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీ గొంతును గట్టిగా వినిపించే నాయకులు ఉంటున్నారు. బీజేపీ రానున్న రోజుల్లో ఎదగాలని ఆశిస్తున్న తమిళనాడు లేదా తెలంగాణ నుంచి నేతను ఎంపిక చేయడం ఆ పార్టీకి దీర్ఘకాలిక లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే.. దీనికి అందరి ఆమోదం లభిస్తుందా? అనేది ప్రశ్నార్థకంగానే ఉన్నది. అది ఉత్తరాదిలో సంస్థాగత, ఎన్నికల లక్ష్యాలను తక్షణమే ప్రభావితం చేసే అవకాశం ఉందనే వాదన కూడా వినిపిస్తున్నది.

అన్నింటికి మించి 2024 ఎన్నికల్లో సాధించిన ఫలితాలపై బీజేపీ నాయకత్వం సంతృప్తితో లేదు. అంతకు ముందు రెండు ఎన్నికల్లోనూ బీజేపీ భారీ మెజార్టీతో అధికారం నిర్వహించింది. కానీ.. ఈసారి భాగస్వామ్య పక్షాల మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాంతీయ శక్తులైన చంద్రబాబు నాయుడు, నితీశ్‌ కుమార్‌, ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌పవార్‌, పవన్‌ కల్యాణ్‌ వంటివాళ్లు కూడా జాతీయ స్థాయి నిర్ణయాలను ప్రభావితం చేసేలా పరిణామాలు నెలకొన్నాయి. ఇది కూడా అధ్యక్ష ఎంపికలో ఒక కీలక అంశంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజా పరిణామాలు.. పార్టీ వ్యవహారాలను సమన్వయం చేయడమే కాకుండా.. భాగస్వామ్య పక్షాలతో కూడా సంయమనంతో వ్యవహరించాల్సిన బాధ్యత కొత్త అధ్యక్షుడిపై ఉంటుంది. అంటే.. పార్టీకి ఇప్పుడు ఇంతకు ముందుకంటే నైపుణ్యం కలిగిన నేత అవసరం. అతడు కచ్చితంగా కరడుగట్టిన హిందూత్వ వాదాన్ని వినిపించే వ్యక్తి కాకూడదు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే.. మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పేరు రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తున్నది. నాలుగుసార్లు ఎంపీ సీఎంగా పనిచేసిన చౌహాన్‌.. సీనియర్‌, అనుభవజ్ఞుడైన నాయకుడు, చరిష్మా కూడా కలిగిన నేత. అంతేకాదు.. అందరి ఆమోదం లభించే మాస్‌ లీడర్‌కూడా. చౌహాన్‌ ఎంపిక బీజేపీ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పైగా పాత తరం నేతలకు, మోదీ తరం నేతలకు మధ్య అగాధాన్ని ఆయన పూడ్చగలడన్న అభిప్రాయాన్ని పలువురు సీనియర్‌ బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

సీతారామన్‌ను ఎంచుకున్నా, చౌహాన్‌ వైపు మొగ్గినా.. ఇక సమస్య మాత్రం ఉమ్మడిగా కనిపిస్తున్నది. 2010నాటికి ఉన్న చౌహాన్‌ జనాదరణ, ప్రభ.. ఇప్పటికీ ఉన్నాయా? అనేది ఒక ప్రశ్న. మోదీ, అమిత్‌షా ఆధిపత్యంలో ఉన్న పార్టీలో ఆయనకు స్వతంత్రం ఉంటుందా? అనేది మరో ప్రశ్న. నిర్మలా సీతారామన్‌ విషయానికి వస్తే.. ఆమెకు మాస్‌ అప్పీల్‌ లేదనేది ఒక వాదన. పైగా ఆమె ఉన్నస్థాయి వర్గాల ప్రతినిధిగానే జనం చూస్తారనేది మరో వాదన. ఇప్పటి రాజకీయాలలో వీరిద్దరూ నాయకత్వ దూకుడు ప్రదర్శించడం అనుమానమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. వీరిద్దరూ కూడా కేంద్రంలో కీలక శాఖలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇద్దరిలో ఒకరికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే మంత్రివర్గంలో కొనసాగుతారా? అనేదీ అనుమానమే. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే.. కొత్త అధ్యక్షుడి ఎంపికలో పార్టీ అధినాయకత్వం ఎందుకు నాన్చుడు ధోరణి అనుసరిస్తున్నదనే విషయం అర్థమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

Public sector banks hiring | బ్యాంకుల కొలువుల జాతర.. 50 వేలమందికి ఉద్యోగావకాశాలు
Dharmasthala | ధర్మస్థలలో దారుణాలు? ఇరవై ఏళ్లపాటు రేప్‌ విక్టిమ్‌ల శవాలు దహనం చేశానన్న పారిశుధ్య కార్మికుడు