Dharmasthala | ధర్మస్థలలో దారుణాలు? ఇరవై ఏళ్లపాటు రేప్ విక్టిమ్‌ల శవాలు పాతిపెట్టానన్న పారిశుధ్య కార్మికుడు

Dharmasthala | కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో అనేక దారుణాలు చోటు చేసుకున్నట్టు ఒక దళిత పారిశుధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదు సంచలనం రేపుతున్నది. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు ఇరవై ఏళ్ల పాటు తాను అనేకమంది బాలికలు, మహిళల మృతదేహాలను ఇక్కడి మంజునాథ ఆలయ వర్గాల ఒత్తిడితో పాతిపెట్టేవాడినని , అందులో ఎక్కువ శవాలు లైంగిక దాడికి, హత్యకు గురైనట్టుగా కనిపించేవని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాలు తాను బయటకు చెబుతున్నందున తనకు ప్రాణ హాని ఉందని కూడా సదరు పారిశుధ్య కార్మికుడు ఫిర్యాదులో తెలిపాడు. ధర్మస్థల పోలీస్ స్టేషన్‌లో జూలై 3వ తేదీన ఈ ఫిర్యాదు నమోదైంది. 1995 నుంచి 2014 మధ్య సంభవించిన ఘటనలను ఫిర్యాదు దారుడు వివరించాడు. ఇతడు ధర్మ స్థల ఆలయంలో పనిచేసేవాడు. నిత్యం మహిళలు, బాలికల మృతదేహాలను తనకు అప్పగించి, వాటిని పూడ్చిపెట్టాలని ఆదేశించేవారని తెలిపాడు. చాలా శవాలపై లైంగిక దాడికి గురైనట్టు స్పష్టమైన ఆనవాళ్లు కనిపించేవని పేర్కొన్నాడు. వాటిని పూడ్చిపెట్టడం లేదా కాల్చివేయడం చేయకపోతే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించేవారని, ఇష్టం వచ్చినట్టు కొట్టేవారని ఫిర్యాదుదారుడు తెలిపాడు. దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల మంజునాథుడి ఆలయానికి ప్రసిద్ధి. ఇక్కడికి ఏటా లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని ఈ ప్రాంతంలో మతపరంగా, రాజకీయంగా, సామాజికంగా అత్యంత పలుకుబడి ఉన్న హెగ్గడే కుటుంబం నిర్వహిస్తున్నది.
‘నేను ఒక తక్కువదిగా భావించే కులంలో పుట్టాను. ధర్మస్థల ఆలయంలో పారిశుధ్య కార్మికుడిగా 1995 నుంచి 2014 డిసెంబర్ వరకూ పనిచేశాను. మొదట్లో ఆలయానికి సమీపంలోని నేత్రావతి నది వద్ద శుభ్రం చేసే పనుల్లో ఉండేవాడిని. తర్వాత నన్ను భయానక నేరాలకు సాక్ష్యాలను మాయం చేసే పనికి ఉపయోగించారు’ అని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ బాధాకర హత్యలు, తనపై జరిగిన భౌతిక దాడుల జ్ఞాపకాలను భరించలేక ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని తెలిపాడు. అనేక మంది పురుషులను, మహిళలను, బాలికలను లైంగికదాడి చేసి చంపిన ఘటనలపై తక్షణమే దర్యాప్తు చేయాలని అతడు కోరాడు. తొలుత తాను ఆ శవాలు నేత్రావతి నది వద్ద ఆత్మహత్య చేసుకున్నవారివో లేదా ప్రమాదవశాత్తూ చనిపోయినవారివో అనుకునేవాడినని ఫిర్యాదు దారుడు తెలిపాడు. కానీ.. కొంతకాలానికి ఆ శవాలపై లైంగికదాడి ఆనవాళ్లు గుర్తించానని పేర్కొన్నాడు. ‘వాటిలో ఎక్కువ మృతదేహాలు దుస్తులు లేకుండా లేదా లోదుస్తులు లేకుండా ఉండేవి. కొన్నింటిపై భౌతికదాడి, లైంగికదాడి జరిగిన ఆనవాళ్లు ఉండేవి. గాయాలు, గొంతు నులిమిన ఆనవాళ్లు ఉండేవి’ అని పేర్కొన్నాడు. తాను మొదట్లో ఇటువంటి శవాలను దహనం చేసేందుకు తిరస్కరించగా.. తనను తీవ్రంగా కొట్టారని, తనను, తన కుటుంబాన్ని అంతం చేస్తామని బెదిరించారని తెలిపాడు. 2010 నాటి ఒక సందర్భాన్ని ప్రస్తావించిన ఫిర్యాదుదారుడు.. ‘పెట్రోల్ పంప్ నుంచి 500 మీటర్ల దూరానికి నన్ను సూపర్‌వైజర్లు పంపారు. అక్కడ ఒక బాలిక శవం ఉన్నది. మహా అయితే పన్నెడు పదిహేను ఏళ్లుంటాయి. ఆమె ఒంటిపై స్కూల్ యూనిఫాం షర్ట్ ఉన్నది. ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు స్పష్టమైన ఆనవాళ్లు కనిపించాయి’ అని తెలిపాడు. ముఖంపై యాసిడ్ చల్లి ఉన్న ఒక యువతి మృతదేహాన్ని సైతం తాను తగులబెట్టానని పేర్కొన్నాడు. కొందరి గొంతు నులిమి చంపేవారని తెలిపాడు. ‘ఈ హత్యలు నా సమక్షంలో జరిగాయి. మారుమూల అటవీ ప్రాంతంలో మృతదేహాలను తగులబెట్టాలని నన్ను ఆదేశించేవారు’ అని పేర్కొన్నాడు.
తన కుటుంబంతో సంబంధం ఉన్న ఒక బాలిక సూపర్‌వైజర్లతో లింకు ఉన్న ఒక వ్యక్తి తనపై లైంగికదాడి చేశాడని చెప్పిన తర్వాత 2014లో తాను ధర్మస్థలి వదిలి పారిపోయానని, పొరుగు రాష్ట్రంలో బతుకుతున్నానని, తరచూ ఇళ్లు మార్చేవాడినని వెల్లడించాడు. ‘మేం ధర్మస్థలికి దూరంగా బతుకుతున్నప్పటికీ ఏదో ఒక రోజు నన్ను నా కుటుంబాన్ని చంపేస్తారనే భయం రోజూ వెంటాడుతూనే ఉంది’ అని తెలిపాడు. ఇటీవల ఒకనాడు రహస్యంగా ధర్మస్థలికి వచ్చి, తాను గతంలో పాతిపెట్టిన శవాన్ని వెలికి తీశానని, ఆ శవం ఫొటోను కూడా పోలీసులకు అందిస్తున్నానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ‘ధర్మస్థల ప్రాంతంలో ఎక్కడెక్కడ శవాలను పాతిపెట్టానో అన్నీ పోలీసుల సమక్షంలో వెలికి తీసేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని వెల్లడించాడు. ఫిర్యాదులో తనను ఆదేశించిన ఆలయ అధికారులు అని పేర్కొన్నాడు తప్పించి నిర్దిష్టంగా ఎవరి పేర్లనూ ఫిర్యాదుదారుడు తెలియజేయలేదు. ‘నేను చెప్పే కొందరు వ్యక్తులు చాలా బలమైనవారు. వాళ్లను వ్యతిరేకించే వాళ్లను అంతం చేసే ప్రవృత్తి కలిగినవారు’ అని పేర్కొన్నాడు. సాక్షుల రక్షణ పథకం 2018 ప్రకారం తనకు, తన కుటుంబానికి పూర్తి రక్షణ కల్పిస్తే వారి పేర్లను బయటపెడతానని చెప్పాడు. పోలీసుల సమక్షంలో తాను వెలికితీసే శవాలకు తగిన పద్ధతిలో అంత్యక్రియలు చేయకపోతే వాటి ఆత్మలు శాంతించవని, తనను కూడా అపరాధ భావం వెంటాడుతుందని పేర్కొన్నాడు. చట్టానికి అనుగుణంగా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.