Telangana BJP | బీజేపీలో విభేదాలు కంటిన్యూ? ఢిల్లీలో పార్టీ ఎంపీల విందు రాజకీయం

పార్లమెంటు సమావేశాల వేళ ఢిల్లీలో ఉన్న తెలంగాణ బీజేపీ ఎంపీలు విందు రాజకీయాలతో ఆసక్తి రేపారు. మంగళవారం ఢిల్లీలోని తన కొత్త నివాసంలో బీజేపీ విప్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇచ్చిన విందుకు ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, గోడం నగేశ్‌ హాజరయ్యారు. కేంద్ర మంత్రులు బండి సంజ‌య్, కిష‌న్ రెడ్డి హాజరుకాలేదని తెలిసింది.

Telangana BJP | బీజేపీలో విభేదాలు కంటిన్యూ? ఢిల్లీలో పార్టీ ఎంపీల విందు రాజకీయం

Telangana BJP | హైదరాబాద్‌, జూలై 23 (విధాత): తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు ఇప్పుడప్పుడే సమసిపోయే అవకాశాలు లేవనే వాదన వినిపిస్తున్నది. బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా రామచందర్ రావు ఎంపికతో పార్టీలో అంతర్గత పోరు బహిర్గతమైంది. అధ్యక్ష పీఠం ఆశించిన నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారని వార్తలు వచ్చాయి. పార్టీ చీఫ్ పదవిని ఆశించిన ఎంపీలు అరవింద్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, డీకే అరుణ భంగపడ్డారు. ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగానే వ్యతిరేకించి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే.. అధ్యక్ష ఎంపిక బీజేపీ ఢిల్లీ హైకమాండ్ నిర్ణయం అంటూ రాష్ట్ర పార్టీ పెద్దలు చెప్పుకొచ్చారు. పదవి దక్కుతుందని ధీమాగా ఉన్న కొందరు నేతలు బహిరంగంగా స్పందించకపోయినా లోలోపల రగిలిపోయారన్న వార్తలు వినిపించాయి. మరో వైపు పార్టీ కమిటీల్లో కోరుకున్నవారినే నియమించుకున్నారని కార్యకర్తల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కమలం పార్టీలోని నాయకులు వర్గాలుగా విడిపోయినట్లు ప్రచారం సాగుతోంది.

ఢిల్లీలో బీజేపీ ఎంపీల విందు రాజకీయం!

తాజాగా, పార్లమెంటు సమావేశాల వేళ ఢిల్లీలో ఉన్న తెలంగాణ బీజేపీ ఎంపీలు విందు రాజకీయాలతో ఆసక్తి రేపారు. మంగళవారం ఢిల్లీలోని తన కొత్త నివాసంలో బీజేపీ విప్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇచ్చిన విందుకు ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, గోడం నగేశ్‌ హాజరయ్యారు. కేంద్ర మంత్రులు బండి సంజ‌య్, కిష‌న్ రెడ్డి హాజరుకాలేదని తెలిసింది. ఇటీవల ఈటల రాజేందర్‌కు, బండి సంజయ్‌కు మధ్య విబేధాలు రచ్చకెక్కిన నేపథ్యంలో ఎంపీల విందు రాజకీయం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో ఈటలకు సహచర ఎంపీలు సర్దిచెప్పినట్టు తెలుస్తున్నది.

గ్రూప్ వార్ బహిర్గతమైందా?

ఈ సమావేశంతో తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు ఇప్పుడప్పుడే ముగిసే అవకాశాలు లేవనే సంకేతాలు వచ్చాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహా ప్రస్తుతం ఉన్న చాలా మంది నాయకులు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, గోడం నగేశ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ వంటి నేతలూ సొంత రాజకీయ అత్యవసర పరిస్థితితిలో కాషాయ కండువా కప్పుకొన్నారు. దీంతో వారి మధ్య ఓ బలమైన సమూహ బంధం ఏర్పడిందనే వాదన ఉన్నది. తాజాగా ఈ సమూహానికి చెందిన నాయకులు ఢిల్లీలో భేటీ కావడంతో రాజకీయ చర్చ మొదలైంది. ఈ సమావేశానికి బండి సంజయ్, కిషన్‌రెడ్డి హాజరుకాకపోవడంతో గ్రూప్‌ పాలిటిక్స్‌ కొనసాగుతున్నాయన్న వార్తలకు బలం చేకూరుతున్నది. ఎంపీలు భేటీ అయిన ఫోటోలపై కాంగ్రెస్, బీఆర్ ఎస్ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెడుతూ ఆ పార్టీ కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు.

అంతర్గతపోరుతో బీజేపీకి నష్టం

తాజా పరిణామాలపై కమలం పార్టీ తగిన చర్యలు తీసుకోకపోవడంతోనే పార్టీ వ్యతిరేక ప్రచారం జోరుగా సాగుతున్నదని సాధారణ కార్యకర్తలు వాపోతున్నారు. ఎంపీల భేటీ ఫోటోలు వైరల్ కావడంతో పార్టీ కింది స్థాయి కార్యకర్తల్లో ఆందోళన నెలకొన్నది. కాంగ్రెస్ తరువాత రాష్ట్రంలో తామే అధికారం చేపడుతామని పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నది. అంతకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కొనాల్సి ఉన్నది. ఈ పరిణామాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.