BJP President | బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ ఎవరు? ఎంపికలో లేట్ ఎందుకు?
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో మహిళా నాయకుల పేర్లు కూడా తెరమీదికి వచ్చాయి. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ , శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, బీడీ శర్మ పేర్లు వినిపిస్తున్నాయి

BJP President | (విధాత ప్రత్యేక ప్రతినిధి) గొప్ప క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకొనే బీజేపీలో.. జాతీయ అధ్యక్షుడి ఎంపిక సుదీర్ఘకాలంగా ఒక కొలిక్కి రావడం లేదు. తాజాగా ఆగస్ట్ 15నాటికి కొత్త అధ్యక్షుడు వస్తారని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. నిజానికి ఇటీవల బ్రిక్స్ సదస్సు నుంచి ప్రధాని నరేంద్రమోదీ తిరిగి రాగానే బీజేపీ అధ్యక్ష ఎంపికపై తేల్చేశారని తొలుత వార్తలు వచ్చినా.. తదుపరి వాయిదా మాటే వినిపించింది. ముందుగా భావించిన దాని ప్రకారం జూలై 19 నాటికే అధ్యక్ష ఎన్నిక పూర్తి కావాలి. కానీ, కొత్త అధ్యక్షుడి విషయంలో ఆరెస్సెస్, మోదీ, షా మధ్య ఏకాభిప్రాయం కుదరలేదనే ప్రచారం సాగుతోంది. సంఘ్ సిద్ధాంతాలకు అనుగుణంగా, నాగపూర్తో గట్టి అనుబంధం ఉన్నవారిని, అందులోనూ మోదీ, అమిత్షా ప్రభావానికి లోనుకాని వారిని బీజేపీ జాతీయ అధ్యక్షుడిని చేయాలనేది ఆరెస్సెస్ ఆలోచనగా చెబుతున్నారు. కానీ.. మోదీ, షా మాత్రం తమ ఆలోచనల మేరకు బాధ్యతలు నిర్వహించగలిగే డమ్మీ క్యాండిడేట్ను జాతీయ అధ్యక్షుడిగా కోరుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మోదీ, అమిత్షా ఏది చెబితే అదే పార్టీ నిర్ణయంగా అమలవుతున్న సందర్భాలను పలువురు ఉదహరిస్తూ.. వారిద్దరికీ భిన్నంగా, స్వతంత్రంగా పనిచేసే నాయకుడిని సహజంగానే మోదీ, షా కోరుకోరని అంటున్నారు. ఈ పాయింట్ వద్దే ఆరెస్సెస్, బీజేపీ మధ్య పీట ముడి పడిందని అంటున్నారు.
బీజేపీలో పట్టు సాధించే యత్నాల్లో సంఘ్?
పదేళ్లుగా మోదీ, అమిత్షా ఆధిపత్యంలో కొనసాగుతున్న బీజేపీపై తిరిగిన తనదైన పట్టు సాధించాలనే భావనతో ఆరెస్సెస్ నాయకత్వం ఉందనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నాగపూర్ అభిప్రాయాల మేరకు పనిచేసే నాయకుడిని ఆ స్థానంలో ఉంచాలనేది సంఘ్ అభిప్రాయంగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే మోదీ, అమిత్షా ప్రతిపాదించిన పేర్లను నాగపూర్ పక్కన పెట్టిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆరెస్సెస్ ప్రతిపాదించే పేర్లపై మోదీ, షా సుముఖంగా లేరని, అందుకే ఈ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
బీజేపీ, ఆరెస్సెస్ మధ్య గ్యాప్?
బీజేపీ, ఆరెస్సెస్ మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలో స్వంతంగా 400 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రచారం సాగించింది. అయితే ఎన్నికల సమయంలో తమకు ఆరెస్సెస్ అవసరం లేదని, గతంలో ఉన్న బీజేపీకి ఇప్పటికీ చాలా తేడా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ వ్యాఖ్యలను ఆరెస్సెస్ నాయకత్వం తీవ్రంగా పరిగణించిందని సమాచారం. క్షేత్రస్థాయిలో ఆరెస్సెస్ ప్రచారక్లను సైతం బీజేపీ నేతలు పట్టించుకోకపోవడంతో వారు గత ఎన్నికల్లో పెద్దగా పని చేయలేదు. బీజేపీ తన చార్ సౌ పార్ నినాదాన్ని నెరవేర్చుకోలేక పోవడానికి, కనీసం సొంతంగా మెజార్టీ తెచ్చుకోలేక పోవడానికి కారణమైందని కొందరు బీజేపీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. ప్రధానంగా యూపీ వంటి రాష్ట్రాల్లో బీజేపీకి తక్కువ ఎంపీ సీట్లు రావడానికి సంఘ్ సహాయ నిరాకరణే కారణమనే వాదన బీజేపీ నేతల్లో ఉంది. ఆ తర్వాతే ఆరెస్సెస్, బీజేపీ మధ్య గ్యాప్ పూడ్చే ప్రయత్నాలు జరిగాయి. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయానికి సదీర్ఘకాలం విరామం తర్వాత మోదీ వెళ్లడం కూడా ఇందులో భాగమే అనే చర్చలు జరిగాయి. ఇదే సమయంలో రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల ఎంపికలో సంఘ్ నేరుగా జోక్యం చేసుకుంటున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు ఇటీవలి తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎంపికే నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నిక పేరుతో నోటిఫికేషన్ జారీ చేసి, చివరికి ఎవరినీ నామినేషన్లు వేయనీయకుండా.. సంఘ్ సూచనల మేరకు ఎన్ రామచంద్రరావును అధ్యక్షుడిగా నియమించారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అటు ఏపీలోనూ ఆరెస్సెస్ సూచనల మేరకే మాధవ్ను ఎంపిక చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి.
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఎంపిక ఎలా చేస్తారు?
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఎంపిక ప్రక్రియను సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేపడుతారు. గ్రామంలోని బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీ కాలం పూర్తయి రెండేళ్లు దాటింది. 2023 జనవరితో ఆయన టర్మ్ పూర్తైంది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నడ్డా ఈ పదవిలో కొనసాగారు. బీజేపీకి దేశవ్యాప్తంగా 37 రాష్ట్ర శాఖలున్నాయి. జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాలంటే.. లేదా ఎన్నిక చేయాలంటే సగం రాష్ట్రాల అధ్యక్ష పదవులకు ఎన్నికలు పూర్తి కావాలి. అంటే కనీసం 19 రాష్ట్రాల అధ్యక్షపదవులకు ఎన్నికలు జరగాలి. ఇప్పటికి 14 రాష్ట్రాల అధ్యక్ష పదవులకు ఎన్నికలు జరిగాయి. మిగిలిన రాష్ట్రాల్లో కూడా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. జాతీయ అధ్యక్షుడి విషయంలో ఒక అభిప్రాయానికి రాలేక పోయిన నేపథ్యంలోనే ఈ ఎన్నికలు కూడా ఆలస్యమవుతున్నాయన్న సందేహాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
అధ్యక్ష రేసులో వీరే
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో మహిళా నాయకుల పేర్లు కూడా తెరమీదికి వచ్చాయి. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ , శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, బీడీ శర్మ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మహిళా నాయకుల నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, దగ్గుబాటి పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్ పేర్లు తెరమీదికి వచ్చాయి. ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ పేర్లను ఆరెస్సెస్ పక్కన పెట్టిందనే ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరు కూడా మోదీ, అమిత్ షాకు దగ్గర అనే ప్రచారం కూడా ఉంది. ఆరెస్సెస్తో సంబంధం ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నాయకుడు బీడీ శర్మ, మనోహర్ లాల్ ఖట్టర్ పేర్లు కూడా తెరమీదికి వచ్చాయి. వీరికి ఆర్గనైజేషన్పై పట్టుంది. సంఘ్తో మంచి సంబంధాలున్నాయి. వీరిలో ఒకరి వైపు సంఘ్ మొగ్గు చూపొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక మహిళలకు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని కేటాయించాల్సి వస్తే వనతి శ్రీనివాస్ పేరు ముందువరుసలో ఉన్నట్టు చెబుతున్నారు. ఆరెస్సెస్తోపాటు పాటు మోదీ, అమిత్ షా కూడా ఆమె నియామకంపై సుముఖంగానే ఉన్నట్టు సమాచారం. సంఘ్ నేతలు, మోదీ బృందానికి మధ్య ఏకాభిప్రాయం కుదరని పక్షంలో మహిళా అధ్యక్షురాలు తెరపైకి వస్తారా? అనేది వేచి చూడాలి.