L&T: అదరగొట్టిన.. ఎల్ అండ్ టీ! ఏకంగా రూ.3.5 లక్షల కోట్ల ఆర్డర్లు

  • By: sr    business    May 09, 2025 11:05 AM IST
L&T: అదరగొట్టిన.. ఎల్ అండ్ టీ! ఏకంగా రూ.3.5 లక్షల కోట్ల ఆర్డర్లు

ముంబై: మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టీ) అదిరిపోయే ఫలితాలు సాధించింది. ఏకంగా రూ.3.5 లక్షల కోట్ల ఆర్డర్లు కొల్లగొట్టింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 18% ఎక్కువ. అంతేకాదు, కంపెనీ ఆదాయం కూడా రూ.2.5 లక్షల కోట్లు దాటింది. ఇది కూడా 16% వృద్ధిని నమోదుచేసింది. సంస్థ నికర లాభం (PAT) రూ.15,037 కోట్లకు చేరింది. ఇందులో గతంలో చేసిన ఒక పెట్టుబడికి సంబంధించిన రూ.475 కోట్ల లాభం కూడా ఉంది.

ఈ మొత్తం లాభం గత ఏడాదితో పోలిస్తే 15% ఎక్కువ. ఈ ఫలితాలతో కంపెనీ బోర్డు వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.34 డివిడెండ్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఈ సందర్భంగా ఎల్ అండ్ టీ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఎన్. సుబ్రమణ్యన్ మాట్లాడుతూ.. ఇది తమకు చాలా మంచి సంవత్సరం అని చెప్పారు. కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆర్డర్లు వచ్చాయని, దానివల్ల ఆర్డర్ బుక్ కూడా భారీగా పెరిగిందని ఆయన అన్నారు. కొత్త టెక్నాలజీలు, డిజిటలైజేషన్ ద్వారా మరింత మెరుగైన పనితీరు కనబరుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సెమీకండక్టర్ టెక్నాలజీలు, డేటా సెంటర్ల వంటి కొత్త రంగాల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నామని ఆయన తెలిపారు. దేశీయంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, ప్రైవేట్ రంగంలో వస్తున్న పెట్టుబడుల వల్ల రాబోయే రోజుల్లో కూడా మంచి వృద్ధి ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్య దేశాలు కూడా చమురు, గ్యాస్ రంగాలతో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతుండటం తమకు కలిసి వస్తుందని ఆయన అన్నారు.