Income Tax Return : ఐటీ రిటర్న్స్ ఎవరు దాఖలు చేయాలి?
ఆర్ధిక సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) ఎవరు దాఖలు చేయాలి, లాభాలు, నష్టాలు, నిర్లక్ష్య ఫలితాలు, ప్రతి ఏటా ఫైలింగ్ అవసరమా అన్న వివరాలు.
ఆదాయ పన్ను రిటర్న్స్ లేదా ఐటీ రిటర్న్స్ ఎవరు దాఖలు చేయాలి? ఐటీ రిటర్న్స్ దాఖలుతో లాభ, నష్టాలు ఏంటి? ప్రతి ఆర్ధిక సంవత్సరం రిటర్న్స్ సబ్ మిట్ చేయాలా? రిటర్న్స్ దాఖలు చేయకపోతే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందా? ఐటీ రిటర్న్స్ మీ ఆర్ధిక చరిత్రను తెలుపుతుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
ఐటీ రిటర్న్స్ అంటే ఏంటి?
ఐటీఆర్ అంటే ఆదాయ పన్ను రిటర్న్స్ అంటారు. ఒక ఆర్ధిక సంవత్సరంలో ఒక వ్యక్తి సంపాదించిన ఆదాయం, ఆ ఆదాయంపై చెల్లించే పన్నుల వివరాలను ఆదాయపు పన్ను శాఖకు తెలపడానికి ఒక నిర్ణీత ఫారమే ఐటీ రిటర్న్స్ గా పిలుస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులే కాదు, వ్యాపారులు కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి. అయితే ఇది వారి ఆదాయంతో ముడిపడి ఉంటుంది. ఆదాయానికి సంబంధం లేకుండా మీ బ్యాంకు ఖాతాల లావాదేవీల ఆధారంగా కూడా కొన్ని సమయాల్లో ఐటీ రిటర్న్స్ ను దాఖలు చేయాల్సి రావచ్చు.
ఎవరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి?
ఉద్యోగుల ఆదాయం ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ. 12.75 లక్షలు దాటితే ఆదాయ పన్ను చెల్లించాలి. ఇతరుల ఆదాయం ఏడాదికి రూ. 12 లక్షలుంటే పన్ను కట్టాల్సిందే. 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న వారి ఆదాయం ఏటా రూ. 2.50 లక్షలు దాటితే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి. 60 ఏళ్లు దాటిన వారు సీనియర్ సిటిజన్స్ ఆదాయం ప్రతి ఏటా రూ. 3 లక్షలు దాటితే ఐటీ రిటర్న్స్ సబ్ మిట్ చేయాలి. ఇక ఆదాయంతో సంబంధం లేకుండా కూడా రిటర్న్స్ దాఖలు చేయాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు. ఒక ఆర్ధిక సంవత్సరంలో కోటి రూపాయాలను బ్యాంకులో డిపాజిట్ చేస్తే రిటర్న్స్ దాఖలు చేయాలి. అయితే ఈ డబ్బును మీ ఒక్కరి బ్యాంకు ఖాతాలో కాకుండా మీ భార్య బ్యాంకు ఖాతాలో జమ చేస్తే ఇబ్బంది లేదు. విదేశాలకు వెళ్లిన సమయంలో రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే రిటర్న్స్ సబ్ మిట్ చేయాలి. విద్యుత్ బిల్లు రూ. 1 లక్ష దాటినా కూడా ఐటీ రిటర్న్స్ ఇవ్వాలి. వ్యాపారస్తులు తమ ఏడాది టర్నోవర్ రూ. 60 లక్షలు దాటితే చాలు రిటర్న్స్ ఇవ్వాలి. ప్రొఫెషనల్స్ ఆదాయం ఏడాదికి రూ. 10 లక్షలు దాటినా కూడా రిటర్న్స్ దాఖలు చేయాలి. టీడీఎస్ రూ. 25 వేలు దాటినా కూడా రిటర్న్స్ ఇవ్వాలి.
లాభాలు ఏంటి? నష్టాలు ఏంటి?
ఐటీ రిటర్న్స్ ప్రతి ఏటా దాఖలు చేయడం వల్ల మీ ఆదాయం, ఆదాయంపై ట్యాక్స్ హిస్టరీ తెలుస్తుంది. ట్యాక్స్ పరిమితి దాటిన ఆదాయానికి ఎంత ట్యాక్స్ కట్టారో తెలుస్తుంది. ఒక రకంగా మీ ఆర్ధిక క్రమశిక్షణను ఐటీ రిటర్న్స్ ద్వారా తెలుసుకోవచ్చు. బ్యాంకులు రుణాలు ఇచ్చే సమయంలో ఐటీ రిటర్న్స్ కూడా అడుగుతాయి. వీసాల ధరఖాస్తు సమయంలో, క్రెడిట్ కార్డు అప్లికేషన్స్ కు కూడా ఐటీ రిటర్న్స్ ను అడుగుతారు. భారీ టెండర్ల దక్కించుకొనే వేలంలో పాల్గొనే సమయంలో కొన్ని సంస్థలు ఐటీ రిటర్న్స్ ను అడిగే అవకాశం ఉంది. ఐటీ రిటర్న్స్ అంటే మీ ఆదాయానికి అధికారిక రుజువుగా కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాది ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుందా? అంటే లేదనే సమాధానాన్ని కొందరు ఆడిటర్లు చెబుతున్నారు. ఒక ఆర్ధిక సంవత్సరం మీ ఆదాయం తగ్గితే ఆ సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram