Income Tax Return Deadline| ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంచలేదు: ఐటీ శాఖ కీలక ప్రకటన
ఎలాంటి జరిమానాలు లేకుండా ఐటీఆర్ దాఖలుకు సెప్టెంబరు 15 చివరి తేదీ మాత్రమేనన్న విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలని ఐటీ శాఖ పేర్కొంది. ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును పెంచలేదని...సెప్టెంబర్ 30వరకు గడువు పొడిగించినట్లుగా వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిపింది.

న్యూఢిల్లీ : గత ఆర్థిక సంవత్సరానికి(2024-25)గాను ఐటీఆర్( ITR Filing) ఫైలింగ్ గడువును పెంచలేదని కేంద్ర ఆదాయ పన్ను శాఖ(Income Tax Department) తన ఎక్స్ ఖాతాలో స్పష్టం చేసింది. ఇప్పటికే ఐటీఆర్ ఫైలింగ్ గడువును ఇప్పటికే జులై 31 నుంచి సెప్టెంబరు 15 వరకు పొడిగించామని.. దీన్ని సెప్టెంబరు 30వ తేదీ వరకు పొడిగించినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది. ఎలాంటి జరిమానాలు లేకుండా ఐటీఆర్ దాఖలుకు సెప్టెంబరు 15 చివరి తేదీ (last date September 15) మాత్రమేనన్న విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలని పేర్కొంది. ఆదాయపు పన్ను శాఖ అధికారికంగా ఇచ్చే అప్‌డేట్లను ఎప్పటికప్పుడు చూసుకోవాలని పన్ను చెల్లింపుదారులను కోరుతున్నామని తెలిపింది. ఐటీఆర్ ఫైలింగ్, పన్ను చెల్లింపులపై సందేహాలు తీర్చేందుకు 24×7 హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశాం. కాల్స్, లైవ్ చాట్స్, వెబ్ సెషన్స్, ఎక్స్‌లోనూ పన్ను చెల్లింపుదారులకు అవసరమైన సహాయం అందిస్తున్నామని వెల్లడించింది.
ఇప్పటిదాక 6కోట్ల మంది ఐటీ రిటర్న్స్
ఇప్పటివరకు దాదాపు 6 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్ సమర్పించారని ఐటీ విభాగం పేర్కొంది. ఈ-వెరిఫై అయిన రిటర్న్స్ 5.51 కోట్లు ఉన్నాయని, ఇందులో 3.78 కోట్ల వరకూ పరిశీలన పూర్తయ్యిందని తెలిపింది. రూ.3 లక్షలకు మించి ఆదాయం ఉన్నవారందరూ త్వరగా రిటర్నులు దాఖలు చేయాలని సూచించింది. కొత్త పన్ను విధానంలో ఏది లాభదాయకమో చూసుకోవాలని తెలిపింది. మోసపూరిత మినహాయింపులు చూపించి, రిఫండును కోరడం తప్పు అని, తర్వాత కాలంలో ఇది నోటీసులకు, జరిమానాలకు దారితీస్తుందని హెచ్చరించింది.