Wheatgrass | గోధుమ గడ్డి వ్యాపారం.. నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్న హైదరాబాదీ..!
Wheatgrass | గోధుమ గడ్డి( Wheatgrass ) జ్యూస్ తాగడం ద్వారా పుష్కలమైన పోషకాలు( Nutrients ) శరీరానికి అందుతాయి. గోధుమ గడ్డి రసం( Wheatgrass Juice ) జీర్ణక్రియ శక్తిని కూడా పెంపొందిస్తాయి. రోగనిరోధక శక్తి( Immunity Power )ని పెంపొందించడంలో కూడా అద్భుతంగా సహాయపడుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే రక్షణ కవచం మీ శరీరానికి లభిస్తుంది. మరి ఇలాంటి గోధుమ గడ్డితో వ్యాపారం చేస్తూ ఓ హైదరాబాదీ నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాడు.

Wheatgrass | కరోనా( Corona )తో పరిశ్రమ రంగం కూడా కుదేలైంది. ఎంతో మంది కార్మికులు రోడ్డున పడ్డారు. బుక్కెడు బువ్వ, గుక్కెడు నీళ్ల కోసం కోట్లాది మంది అల్లాడిపోయారు. అలా కరోనా ఎంతో మంది జీవితాలను కబళించింది. అయితే ఈ సమయంలో కొందరూ వినూత్న ఆలోచనలకు( Innovative Thoughts ) పదును పెడుతూ.. సెలబ్రిటీలుగా మారిపోయారు. కొందరైతే జనాలకు అవసరమైన, ఉపయోగకరమైన సమాచారాన్ని అందించారు. ఇంకొందరైతే.. ఇంట్లోనే ఉండి.. ఇమ్యూనిటీ పవర్( Immunity Power )ను పెంచే పదార్థాలు ఏంటి..? ఏయే పదార్థాలు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..? ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? కరోనాను నిర్మూలించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తూ.. వీడియోల రూపంలో సమాచారాన్ని ప్రజలకు చేరవేశారు.
అయితే ఓ హైదరాబాదీ కూడా కరోనా సమయంలో వినూత్నంగా ఆలోచించాడు. కరోనా దెబ్బకు తన ప్లే స్కూల్( Play School ) మూతబడింది. దీంతో ఎలా ఉపాధి పొందాలి..? అని ఆలోచించసాగాడు. అది కూడా పది మందికి ఉపయోగపడేలా ఉంటే బాగుండు అని అనుకున్నాడు. ఆ దిశగా ఆలోచించిన సమయంలో రోగ నిరోధక శక్తి( Immunity Power )ని పెంపొందించే పదార్థాలు ఏవి..? దాని కోసం మనం ఏం చేయొచ్చు అన్న ఆలోచన తట్టింది. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తుండగా.. గోధుమ గడ్డి( Wheatgrass ) ఇమ్యూనిటీ పవర్‌ను పెంపొందిస్తుందని, కరోనా నిర్మూలనకు చాలా వరకు హెల్ప్ చేస్తుందని పలు ఆరోగ్య నిపుణులు( Health Experts ) చెప్పిన వీడియోలు కోకోల్లలు ఉన్నాయి. దీంతో ఆ హైదరాబాదీ గోధుమ గడ్డిని పెంచడం ప్రారంభించి.. లక్షలు సంపాదించే దిశగా ఎదిగాడు. మరి ఆయన ఎవరంటే..? హైదరాబాద్ నగరానికి చెందిన మొగోళ్ల జనార్ధన్ గౌడ్.
ఇంట్లోనే ఉండి.. గోధుమగడ్డి సాగు..
జనార్ధన్ గౌడ్ 2014లో ప్లే స్కూల్ ప్రారంభించాడు. ఓ ఆరేండ్ల పాటు స్కూల్ బాగా నడిచింది. ఆర్థికంగా ఎలాంటి కష్టాల్లేవు. కానీ 2020లో వచ్చిన కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆ స్కూల్ మూతబడింది. ఇన్‌కమ్ కూడా ఆగిపోయింది. ఇక కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. ఇంట్లోనే ఉండి.. మార్కెట్‌లో డిమాండ్ ఉండే పదార్థాలు ఏంటి..? వస్తువులు ఏంటి..? ఆలోచించాడు. ఇంటర్నెట్‌లో శోధించగా.. ఇండోర్ ఫార్మింగ్‌లో గోధుమ గడ్డిని సులభంగా పెంచొచ్చు అనే విషయాన్ని గ్రహించాడు. గోధుమ గడ్డి రసం శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను కూడా పెంచుతుందని గ్రహించాడు.
ఇంటి మీద.. 150 చదరపు అడుగుల్లో
ఇక 2020 జులై నెలలో తన ఇంటి మీద.. 150 చదరపు అడుగుల్లో గోధుమ గడ్డిని పెంచడం ప్రారంభించాడు. ఇందుకోసం కనీస మౌలిక సదుపాయాలు.. గ్రీన్‌హౌస్ షెడ్ నెట్స్, ట్రేస్, ఐరన్ ర్యాక్స్, ఆర్గానిక్ గోధుమ గింజలు, కూలీల ఖర్చు కోసం రూ. 2 లక్షల దాకా ఖర్చు వెచ్చించాడు. వర్టికల్ విధానంలో వీట్ గ్రాస్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాడు. మొత్తం ఏడు లేయర్లలో సాగు ప్రారంభించాడు. ప్రతి లేయర్‌లో 40 ట్రేలను ఉంచి గోధుమ గడ్డిని పెంచాడు. అలా 280 ట్రేలను వినియోగంలోకి తీసుకున్నాడు. ఇక ఒక్కో ట్రే ఖరీదు రూ. 150.
రూ. 50కి 50 గ్రాముల గోధుమ గడ్డి..
ఆర్గానిక్ గోధుమ గింజలను మధ్యప్రదేశ్‌లోని షేహోర్ శర్బతి నుంచి కొనుగోలు చేశాడు జనార్ధన్. ఈ గోధుమ గింజలు గోల్డెన్ కలర్‌లో ఉండి, స్వీట్‌నెస్, హై ప్రోటీన్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి. ఇక ఇప్పటి వరకు కూడా ఇవే గోధుమ గింజలను కొనుగోలు చేస్తున్నట్లు జనార్ధన్ తెలిపాడు. సాగులో భాగంగా.. ప్రతిరోజు కేజీ వరకు గోధుమ గడ్డిని తెంపి.. దాన్ని ఇరుగుపొరుగు వారికి, తన స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్‌కు విక్రయించడం ప్రారంభించాడు. 50 గ్రాముల గోధుమ గడ్డిని రూ. 50కి విక్రయించాడు మొదట్లో. డిమాండ్ పెరిగిన తర్వాత ధరను కూడా క్రమక్రమంగా పెంచేశాడు. ఇప్పటి వరకు నష్టం లేదు.. లాభాల బాటలోనే ఉన్నట్లు జనార్ధన్ తెలిపాడు.
నెలకు రూ. 2 లక్షలు సంపాదన..
ప్రస్తుతం కేజీ గోధుమ గడ్డిని రూ. 600కు సూపర్ మార్కెట్లకు, ఇరుగుపొరుగు వారికి విక్రయిస్తున్నట్లు తెలిపాడు. ఇటీవలే వీట్ గ్రాస్ పౌడర్‌ను కూడా తయారు చేస్తున్నట్లు తెలిపాడు. 90 గ్రాముల పౌడర్ ఖరీదు రూ. 450. అయితే గోధుమ గడ్డి విత్తనాలు నాటిన తర్వాత ఏడు రోజులకు గడ్డి కోస్తున్నట్లు పేర్కొన్నాడు. మొత్తంగా గోధుమ గడ్డి వ్యాపారంతో నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నట్లు జనార్ధన్ గౌడ్ తెలిపాడు. ఇందులో ఖర్చులు పోను నెలకు రూ. 1 లక్ష వరకు మిగులుతున్నట్లు చెప్పాడు జనార్ధన్ గౌడ్.