Electric Vehicles | ఆ రెండు కంపెనీల మధ్య కీలక ఒప్పందం.. ఇక నిశ్చితంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనొచ్చు..!

Electric Vehicles | మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) వినియోగం రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ.. వాటికి అత్యంత అవసరమైన ఛార్జింగ్ స్టేషన్స్ (Charging stations) మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ కారణంగానే చాలామంది ఇప్పటికీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేయడానికి కొంత వెనుకడుగు వేస్తున్నారు. ఛార్జింగ్‌ ఇబ్బందులు లేకపోతే ఈపాటికే ఎలక్ట్రిక్‌ వాహనాలు ఇంతకుమించి రోడ్లపైకి వచ్చేవి.

  • By: Thyagi |    business |    Published on : Jun 08, 2024 9:12 AM IST
Electric Vehicles | ఆ రెండు కంపెనీల మధ్య కీలక ఒప్పందం.. ఇక నిశ్చితంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనొచ్చు..!

Electric Vehicles : మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) వినియోగం రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ.. వాటికి అత్యంత అవసరమైన ఛార్జింగ్ స్టేషన్స్ (Charging stations) మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ కారణంగానే చాలామంది ఇప్పటికీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేయడానికి కొంత వెనుకడుగు వేస్తున్నారు. ఛార్జింగ్‌ ఇబ్బందులు లేకపోతే ఈపాటికే ఎలక్ట్రిక్‌ వాహనాలు ఇంతకుమించి రోడ్లపైకి వచ్చేవి.

ఈ నేపథ్యంలో ఎంజీ మోటార్‌ ఇండియా (MG Motor India), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ (HPCL) తో చేతులు కలిపింది. ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడానికి ఎంజీ మోటార్, హెచ్‌పీసీఎల్‌లో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నట్లు తెలుస్తోంది. రెండు కంపెనీల ఒప్పందం మేరకు హైవేలపై, ప్రధాన నగరాల్లోని ఎంపిక చేసిన ప్రదేశాలలో 50 kW, 60 kW DC ఫాస్ట్ ఛార్జర్‌లను ఇన్‌స్టాల్ చేయనున్నారు.

ఫలితంగా ఇక ముందు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఛార్జింగ్‌ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. కాబట్టి నిశ్చింతగా ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేయవచ్చు. ‘భారతదేశంలో హెచ్‌పీసీఎల్‌ భారీగా విస్తరిస్తోంది. ఈ సంస్థతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో ఛార్జింగ్ స్టేషన్స్ సంఖ్య గణనీయంగా పెరుగనుంది. బ్యాటరీ రీసైక్లింగ్ & బ్యాటరీల పునర్వినియోగం లాంటి అంశాలపై కొత్తగా సమర్థమైన చర్యలు తీసుకోవచ్చు’ అని ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా తెలిపారు.

దేశంలో 15 వేల ఛార్జింగ్ స్టేషన్స్

ఇప్పటికే ఎంజీ మోటార్ కంపెనీ.. టాటా పవర్ డెల్టా ఎలక్ట్రానిక్స్, ఫోర్టమ్ లాంటి సంస్థల భాగస్వామ్యంతో భారతదేశం అంతటా 15,000 పబ్లిక్, ప్రైవేట్ ఛార్జర్‌లను ఇన్‌స్టాల్ చేసింది. పబ్లిక్ EV ఛార్జర్‌ల ఇన్‌స్టాలేషన్ కోసం ఈ కార్ల తయారీ సంస్థ భారత్ పెట్రోలియం, జియో-బీపీతో భాగస్వామ్యాన్ని కూడా ప్రకటించింది.

హెచ్‌పీసీఎల్‌ 3,600 ఛార్జింగ్ స్టేషన్స్

హెచ్‌పీసీఎల్ కూడా అనేక కంపెనీలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు, ఛార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్లు దేశవ్యాప్తంగా పెట్రోల్ స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ను విస్తరించాయి. హెచ్‌పీసీఎల్‌ దేశవ్యాప్తంగా 3,600 కంటే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ కలిగి ఉంది. ఈ సంఖ్యను 2024 చివరి నాటికి 5000కు పెంచాలని సంస్థ భావిస్తోంది.