Pension Scheme For Labourers | రోజు కూలీలకు కూడా పెన్షన్.. దరఖాస్తు ప్రక్రియ ఇలా..!
Pension Scheme For Labourers | రోజు వారి కూలీలకు కూడా పెన్షన్( Pension ) సదుపాయం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. రోజు కూలీలు.. ఏ రోజు సంపాదనను ఆ రోజే ఖర్చు పెడుతుంటారు. భవిష్యత్ కోసం ఎలాంటి పొదుపు చేయరు. కాబట్టి అసంఘటిత కార్మికులను(Unorganized sector workers ) దృష్టిలో ఉంచుకుని.. కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది.

Pension Scheme For Labourers | పెన్షన్( Pension ) అనగానే ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగులే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. నెల జీతం తీసుకునే సమయంలో వారికి పెన్షన్ కింద కొంత నగదు కట్ అవుతుంది. ఉద్యోగుల జీతం నుంచి కట్ చేసే నగదుకు సమానంగా ఆయా ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు కూడా జమ చేస్తాయి. ఈ నగదు ఒక ఉద్యోగి పదవీ విరమణ పొందిన తర్వాత.. నెలకు పెన్షన్ రూపంలో నగదు ఖాతాదారుడి అకౌంట్లో జమ అవుతుంటుంది. ఈ మాదిరిగానే.. రోజు వారి కూలీలకు కూడా పెన్షన్ సదుపాయం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. రోజు కూలీలు.. ఏ రోజు సంపాదనను ఆ రోజే ఖర్చు పెడుతుంటారు. భవిష్యత్ కోసం ఎలాంటి పొదుపు చేయరు. కాబట్టి అసంఘటిత కార్మికులను (Unorganized sector workers) దృష్టిలో ఉంచుకుని.. కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం ఏంటంటే.. ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన(PM-SYM).
పీఎం – ఎస్‌వైఎం పథకానికి అర్హులు ఎవరు..?
ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన(PM-SYM)ను 2019 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది అసంఘటిత కార్మికుల కోసం ఏర్పాటు చేసిన స్వచ్ఛంద పథకం. ఈ పథకంలో తప్పనిసరిగా చేరాలన్న నిబంధన లేదు. అయితే, పీఎం – ఎస్‌వైఎంలో డబ్బు జమ చేసిన అసంఘటిత కార్మికులు అందరికీ కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ప్రయోజనం అందిస్తుంది. అయితే 18 నుంచి 40 ఏండ్ల వయసు మధ్య గల కార్మికులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ఎలా..?
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కార్మికులు కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లి నమోదు చేసుకోవాలి. దీని కోసం కొన్ని రకాల గుర్తింపు పత్రాలు అవసరం. అవసరమైన అన్ని పత్రాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత పీఎం శ్రమ్ యోగి కార్డ్ నంబర్ జారీ అవుతుంది. దీని ద్వారా ఖాతా సమాచారాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద కార్మికుడు నెలనెలా చెల్లించాల్సిన మొత్తం ప్రతి నెలా ఆటో డెబిట్ ద్వారా కట్ అవుతుంది. ఆ కార్మికుడికి 60 ఏళ్ల వయస్సు నుంచి పింఛను రావడం ప్రారంభం అవుతుంది.
మరి ఎంత పెన్షన్ వస్తుంది..?
ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన కింద, 60 సంవత్సరాల వయస్సు దాటిన కార్మికులకు నెలకు రూ. 3000 వరకు పెన్షన్ అందించే నిబంధన ఉంది. ఈ పథకంలో కార్మికులు ఎంత జమ చేస్తే, కేంద్ర ప్రభుత్వం కూడా అంత మొత్తం జమ చేస్తుంది. ఈ పథకంలో కనీసం 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టడం అవసరం. 60 ఏళ్ల వయస్సు తర్వాత నుంచి ఇందులో పెన్షన్ లభిస్తుంది.