Maize Cultivation | ఒక్కో మొక్కజొన్న కంకి రూ. 200..! మొక్కజొన్నలందు ఈ మొక్కజొన్న వేరయా..!
Maize Cultivation | మొక్కజొన్న కంకులను పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. వీటితో అనేక రకాల ఆహార పదార్థాలను కూడా తయారు చేస్తుంటారు. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన ఈ మొక్కజొన్న( Maize )ను మార్కెట్లో విరివిగా విక్రయిస్తుంటారు. ఇక ఒక్కో మొక్కజొన్న ఖరీదు రూ. 10 నుంచి రూ. 20 వరకు ఉంటుంది. కానీ ఈ మొక్కజొన్న ఖరీదు మాత్రం రూ. 200. మరి ఈ మొక్కజొన్న ప్రత్యేకత ఏమై ఉండొచ్చని మీకు సందేహం రావొచ్చు. ఆ సందేహం తీరాలంటే.. రాజస్థాన్( Rajasthan )కు చెందిన రైతు సంజయ్ యాదవ్( Sanjay Yadav )ను పలుకరించాల్సిందే.
Maize Cultivation | రాజస్థాన్( Rajasthan ) అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఎడారి నేలలు.. ఎటుచూసినా నీటి కొరత అధికంగా ఉంటుంది. పంటలు పండించడం కష్టం. అలాంటి నీటి కొరత ఉన్న ప్రాంతంలో తనదైన రీతిలో వ్యవసాయం చేస్తూ లాభాలు గడిస్తున్నాడు యువ రైతు సంజయ్ యాదవ్( Sanjay Yadav ). మొక్కజొన్న సాగు( Maize Cultivation )లో సరికొత్త ఆవిష్కరణలు చేసి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. రంగు రంగుల మొక్కజొన్నలు పండిస్తూ రైతుల దృష్టిని తనవైపు మళ్లించాడు. మొక్కజొన్నలోనే కాదు ముల్లంగి పంటలోనూ కొత్త పుంతలు తొక్కాడు ఈ యువ రైతు.
సికార్ జిల్లాలోని పిప్రాలి గ్రామానికి చెందిన సంజయ్ యాదవ్ వృత్తిరీత్యా రైతు. 2012 నుంచి రసాయన ఎరువులకు బదులుగా సహజమైన ఎరువులతో పంటలు పండించాలని సంకల్పించాడు. దాంతో సహజ విత్తనాలు, బయో ఫర్టిలైజర్స్, ఇంట్లో తయారు చేసిన కంపోస్టును తన సాగుకు వినియోగిస్తూ వస్తున్నాడు. పంటల సాగుకు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని ఎంచుకున్నాడు. అలా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ.. అధిక దిగుబడులు పొందుతున్నాడు సంజయ్.
మలుపు తిప్పిన కొత్త వంగడాల సృష్టి..
అయితే కొంతకాలం క్రితం సంజయ్.. ఫతేహ్‌పుర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరయ్యాడు. అక్కడ వివిధ రకాల విత్తనాల అభివృద్ధికై కొత్త వంగడాల సృష్టికి సంబంధించి శిక్షణ ఇచ్చారు. మంచి పోషకాలు కలిగిన కొత్త రకం మొక్కజొన్న వంగడాలను ఎందుకు సృష్టించకూడదు అనే ఆలోచన సంజయ్‌కు వచ్చింది. ఈ క్రమంలోనే అనేక ప్రయోగాలు నిర్వహించి.. పరపరాగ సంపర్కం (క్రాస్ పాలినేషన్) ద్వారా తెలుపు, పసుపు, లేత ఎరుపు, ముదురు ఎరుపు ఇలా రకరకాల రంగుల్లో మొక్కజొన్న పండించాడు. ఇవి ఆకర్షణీయంగా ఉండడమే కాదు, వీటిలో మంచి యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా లభ్యమవుతున్నాయని రైతు సంజయ్ తెలిపాడు.
రంగు రంగుల మొక్కజొన్నతో భారీ లాభాలు..!
సంజయ్ తాను సృష్టించిన ఒక్కో మొక్కజొన్న కంకిని రూ.200కు విక్రయిస్తున్నాడు. అందుకే తాను సృష్టించిన కొత్త రకం మొక్కజొన్నకు పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు పెట్టుకున్నట్లు తెలిపాడు. ఈ మొక్కను ఇతర రైతులకు కూడా అందుబాటులో తెస్తానని, వారు కూడా దీని ద్వారా ఎక్కువ సంపాదించుకోవాలనేది తన కల అని సంజయ్ చెబుతున్నారు.
ముల్లంగిపై ప్రయోగం
సంజయ్ కేవలం మొక్కజొన్నతో ఆగలేదు. అతను ముల్లంగిపై కూడా ప్రయోగాలు చేసి, కొత్త రకాన్ని సృష్టించాడు. సాధారణంగా పండించే తెలుపు ముల్లంగికి బదులు ఆయన ఎరుపు రంగు ముల్లంగిని పండించాడు. ప్రస్తుతం సహజంగా పండే తెలుపు ముల్లంగి కంటే ఎరుపు రంగు ముల్లంగికి ఎక్కువ డిమాండ్ ఉంది. మార్కెట్లో తెలుపు ముల్లంగి కిలోకు రూ.40కు అమ్ముడు పోగా, ఎరుపు ముల్లంగి కిలోకు రూ.60 వరకు ధర లభించిందని తెలిపాడు. తాను చేస్తున్న సేంద్రియ వ్యవసాయం లాభాలను పెంచటమే కాకుండా, నేలను సంవత్సరాలపాటు సారవంతంగా ఉంచుతుందని సంజయ్ చెబుతున్నాడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram