Foreign Investments|పెట్టుబడుల యజ్ఞంలో..తెలుగు రాష్ట్రాల సీఎంలు బిజీ!

.రాష్ట్రాల అభివృద్ధికి విదేశీ పెట్టుబడుల సాధన కీలకంగా మారిన తరుణంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు పెట్టుబడుల సాధనపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.పెట్టుబడుల సమీకరణల ప్రయత్నాల్లో ఏపీ సీఎం చంద్రబాబు విశాఖ వేదికగా రెండురోజుల పాటు జరిగే 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు అతిథ్యమివ్వబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో గురువారం ప్రారంభమైన యూఎస్‌-ఇండియా స్ట్రాటజిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫోరమ్‌ సమావేశానికి హాజరై రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించారు.

Foreign Investments|పెట్టుబడుల యజ్ఞంలో..తెలుగు రాష్ట్రాల సీఎంలు బిజీ!

విధాత : దేశం..రాష్ట్రాల అభివృద్ధికి విదేశీ పెట్టుబడుల(Foreign Investments) సాధన కీలకంగా మారిన తరుణంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), రేవంత్ రెడ్డి(Revanth Reddy)లు పెట్టుబడుల సాధనపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇరువురు సీఎంలు కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విదేశీ పెట్టుబడుల సాధనలో పోటీ పడినట్లుగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం దావోస్ వంటి పెట్టుబడుల సదస్సుల వేదికలతో పాటు విదేశీ పర్యటనల ద్వారా, విదేశీ సంస్థల ప్రతినిధులతో భేటీల ద్వార ప్రయత్నాలు సాగిస్తున్నారు. విదేశీ కంపెనీలను ఆకర్షించడంలో ఏపీకి ఉన్న తీరప్రాంత బలం ఆ రాష్ట్రానికి అదనపు బలంగా ఉండగా…తెలంగాణకు హైదరాబాద్ నగరం అనుకూలంగా ఉంది.

తాజాగా ఏపీలో ‘రెన్యూ పవర్‌’ రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈమేరకు మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు పెట్టారు. ఈ సంస్థ ఐదేళ్ల తర్వాత తిరిగి ఏపీలో అడుగు పెడుతోంది. గ్రీన్‌ ఎనర్జీ రంగంలో భారీ ప్రాజెక్టులను నెలకొల్పనుండటం విశేషం.

ఇక పెట్టుబడుల సమీకరణల ప్రయత్నాల్లో ఏపీ సీఎం చంద్రబాబు విశాఖ వేదికగా రెండురోజుల పాటు జరిగే 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు అతిథ్యమివ్వబోతున్నారు. ఈ సదస్సుకు ముందుగా ఆయన ఇండియా- యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. సుస్థిరాభివృద్ధిలో భారత్- యూరోప్ మధ్య సహకార భాగస్వామ్యంపై రౌండ్ టేబుల్ సమావేశంలో వారు చర్చించనున్నారు. అర్మేనియా ఆర్ధిక వ్యవహారాల మంత్రి, భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్ అమిత్ కల్యాణి సహా వేర్వేరు కంపెనీల చైర్మన్లు, సీఈఓలు, సీఐఐ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో గురువారం ప్రారంభమైన యూఎస్‌-ఇండియా స్ట్రాటజిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫోరమ్‌ సమావేశానికి హాజరై రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించారు. సదస్సులో పాల్గొన్న గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులతో పాటు పాల్గొన్న ఇతర 30 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులకు రైజింగ్ తెలంగాణ గూర్చి వివరించి పెట్టుబడులు పెట్టాలని కోరారు.