ITR Filing | ఐటీఆర్‌ ఫైలింగ్‌ కోసం 7 రకాల ఫామ్స్‌.. మీరు సమర్పించాల్సిన ఫామ్‌ తెలుసా..?

ITR Filing | పోయిన ఆర్థిక సంవత్సరం (2023-24), లేదా మదింపు సంవత్సరం (2024-25) కోసం ఐటీఆర్‌ రిటర్న్స్‌ దాఖలు చేయడం 2024 ఏప్రిల్‌ 1 నుంచి మొదలైంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది ఐటీ రిటర్న్స్ సమర్పించారు. ఐటీ రిటర్న్స్‌ అనగానే చాలామందికి ఐటీఆర్-1 (ITR-1) మాత్రమే గుర్తుకొస్తుంది. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUFs) ఈ ఫామ్‌ను సబ్మిట్ చేయవచ్చు.

ITR Filing | ఐటీఆర్‌ ఫైలింగ్‌ కోసం 7 రకాల ఫామ్స్‌.. మీరు సమర్పించాల్సిన ఫామ్‌ తెలుసా..?

ITR Filing : పోయిన ఆర్థిక సంవత్సరం (2023-24), లేదా మదింపు సంవత్సరం (2024-25) కోసం ఐటీఆర్‌ రిటర్న్స్‌ దాఖలు చేయడం 2024 ఏప్రిల్‌ 1 నుంచి మొదలైంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది ఐటీ రిటర్న్స్ సమర్పించారు. ఐటీ రిటర్న్స్‌ అనగానే చాలామందికి ఐటీఆర్-1 (ITR-1) మాత్రమే గుర్తుకొస్తుంది. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUFs) ఈ ఫామ్‌ను సబ్మిట్ చేయవచ్చు.

అయితే ITR-1 తోపాటు ITR-2, ITR-3, ITR-4, ITR-5, ITR-6, ITR-7ను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) నోటిఫై చేసింది. ఇవన్నీ ఇన్‌కం టాక్స్ పోర్టల్‌లో ఫిబ్రవరి నుంచే అందుబాటులో ఉన్నాయి. టాక్స్ పేయర్ తన ఐటీ రిటర్న్స్‌ ఎంత త్వరగా సమర్పిస్తే అతనికి రిఫండ్ అంత త్వరగా అందుతుంది. దేశంలో నిర్దిష్ట పరిమితికి మించిన డబ్బు సంపాదనపై ప్రతి వ్యక్తి/సంస్థ ఆదాయ పన్ను కట్టాల్సిందే. ఒక వ్యక్తి/సంస్థ ఆదాయ వనరులు, గత ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన మొత్తం, పెట్టుబడులు, విభాగం లాంటి అంశాల ఆధారంగా ITR-1 నుంచి ITR-7 మధ్య సరైన ఫామ్‌ను ఎంచుకోవాలి.

ఎవరు ఏ ఫామ్‌..?

ITR-1 : దీనిని ‘సహజ్’ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో నివశించే వ్యక్తి మొత్తం ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉంటే అతను ITR-1 ద్వారా పన్ను పత్రాలు సమర్పించాలి. తీసుకున్న జీతం, నివాస గృహం ఆదాయం, ఇతర ఆదాయాలు, రూ.5,000 వరకు వ్యవసాయ ఆదాయం లాంటివి ITR 1 కింద పన్ను చెల్లింపుదారు ఆదాయంలో కలిసి ఉంటాయి.

ITR-2 : ఒక వ్యకి లేదా హిందు అవిభాజ్య కుటుంబానికి (HUF) వ్యాపారం లేదా వృత్తి నుంచి లాభాలు ఆర్జించని పక్షంలో ఈ ఫామ్ ఉపయోగించాలి. నాన్ రెసిడెంట్స్, సాధారణ నివాసితులకు ఈ ఫారం వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు, కంపెనీల డైరెక్టర్లు, లిస్ట్ కాని కంపెనీల్లో పెట్టుబడి పెట్టేవాళ్లు, ఒకటి కంటే ఎక్కువ నివాస గృహాల నుంచి ఆదాయం పొందే వ్యక్తులు, మూలధన లాభాలు ఉన్న వ్యక్తులు ఈ ఫామ్ ఎంచుకోవాలి. భారతదేశం వెలుపల ఉన్న ఆస్తులు లేదా సంపాదన ఉన్న వ్యక్తులకు కూడా ఈ ఫామ్‌ వర్తిస్తుంది.

ITR-3 : వ్యాపారం లేదా వృత్తి నుంచి లాభాలు, ఆదాయం కలిగిన వ్యక్తి లేదా HUF ఈ ఫామ్ ఎంచుకోవాలి.

ITR-4 : ఈ ఫామ్‌ను ‘సుగమ్’ అని కూడా పిలుస్తారు. ఒక వ్యక్తి, HUF, సంస్థ (LLP మినహాయించి) మొత్తం ఆదాయం రూ.50 లక్షల కంటే తక్కువ ఉండి, వ్యాపారం లేదా వృత్తి నుంచి వచ్చే ఆదాయాన్ని ఆదాయ పన్ను చట్టంలోని 44AD, 44ADA లేదా 44AE సెక్షన్ల ప్రకారం లెక్కించాల్సి వచ్చిన సందర్భంలో ITR-4 ఎంచుకోవాలి.

ITR-5 : ఒక వ్యక్తి, HUF, కంపెనీ కాకుండా ITR-7 దాఖలు చేసే వారికి ఇది వర్తిస్తుంది.

ITR-6 : ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 11 కింద మినహాయింపును క్లెయిమ్ చేయని సంస్థలు ఈ ఫామ్‌ను ఉపయోగించాలి.

ITR-7 : ఆదాయపు పన్ను చట్టంలోని 139 (4A), 139 (4B), 139 (4C), లేదా 139 (4D) సెక్షన్‌ల కింద రిటర్న్స్‌ ఫైల్ చేసే సంస్థలు ITR-7 ఎంచుకోవాలి. ధార్మిక లేదా మతపరమైన ట్రస్ట్, రాజకీయ పార్టీ, శాస్త్రీయ పరిశోధన సంఘం, వార్తా సంస్థ, ఆస్పత్రి, ట్రేడ్ యూనియన్, విశ్వవిద్యాలయం, కళాశాల, ఏదైనా NGO లాంటివి ఈ పరిధిలోకి వస్తాయి.

గమనిక : ఎవరైనా కావాలని లేదా పొరపాటున తప్పుడు ఫామ్‌ ద్వారా రిటర్న్స్‌ ఫైల్ చేస్తే ఆదాయ పన్ను విభాగం ఆ ఫామ్‌ను తిరిస్కరిస్తుంది. అప్పుడు 15 రోజుల్లోగా సరైన ఫారం ద్వారా మళ్లీ రిటర్న్స్‌ సమర్పించాల్సి ఉంటుంది.