Repo Rate | రెపోరేటు లోన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా?
రెపో రేటు అంటే ఏంటి? బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, ఈఎంఐలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? రెపోరేటు పెరిగితే మంచిదా? తగ్గితే మంచిదా? రెపోరేటు విషయంలో రుణ గ్రహీతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రెపోరేటు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సామాన్యుడిపై ప్రభావం చూపుతుంది.
రెపో రేటు అంటే ఏంటి? బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, ఈఎంఐలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? రెపోరేటు పెరిగితే మంచిదా? తగ్గితే మంచిదా? రెపోరేటు విషయంలో రుణ గ్రహీతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రెపోరేటు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సామాన్యుడిపై ప్రభావం చూపుతుంది.
రెపోరేటు అంటే ఏంటి?
రెపోరేటు అంటే తిరిగి కొనుగోలు రేటు. కేంద్ర బ్యాంకులు వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటును రెపోరేటు అంటారు. సాధారణంగా వాణిజ్య బ్యాంకులకు నిధులు అవసరమైనపుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటికి రుణాలు ఇచ్చే వడ్డీరేటును రెపోరేటు అంటారు. దీన్ని స్వల్పకాలిక వడ్డీరేటు అని కూడా పిలుస్తారు. ద్రవ్య సరఫరా, మొత్తం ఆర్ధిక కార్యకలాపాలను రెపోరేటు ప్రభావితం చేస్తుంది. కేంద్ర బ్యాంకులు రేటును తగ్గించడం ద్వారా రుణాలు ప్రోత్సహించవచ్చు. లేదా రెపోరేటును సర్ధుబాటు చేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చు. రెపోరేటు మార్పులు, డిపాజిట్లు, రుణాల వడ్డీ రేటుపై ప్రభావాన్ని చూపుతాయి.
రెపోరేటు ఎలా నిర్ణయిస్తారు?
రెపోరేటును ఆర్‌బీఐ డిసైడ్ చేస్తుంది. మార్కెట్లో ద్రవ్యోల్బణ స్థాయిలు, ఆర్ధికవృద్ది, లిక్విడిటీ పరిస్థితుల ఆధారంగా రెపోరేటును నిర్ణయిస్తుంది. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఎంసీసీ సమావేశాల్లో రెపోరేటుపై నిర్ణయం తీసుకుంటారు. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు అదనపు లిక్విడిటీని తగ్గించడానికి, ధరలను నియంత్రించేందుకు ఆర్‌బీఐ రెపోరేటును పెంచుతుంది. ఆర్ధిక వృద్ది సమయంలో అప్పు తీసుకోవడం, ఖర్చును ప్రోత్సహించడానికి రిజర్వుబ్యాంకు రెపోరేటును తగ్గిస్తుంది. ఆర్ధిక స్థిరత్వం, ఆర్ధిక వృద్దిని నిర్వహించేందుకు ఇది సహాయపడుతుంది.
రెపోరేటు బ్యాంకు లోన్లపై ప్రభావం
రెపోరేటు బ్యాంకు రుణాలు ముఖ్యంగా హోమ్ లోన్ వంటి వాటిపై ప్రభావం చూపుతాయి. రెపోరేటు పెంచితే ఆర్‌బీఐ నుంచి అప్పుగా తీసుకున్న డబ్బుకు కమర్షియల్ బ్యాంకులు ఎక్కువ వడ్డీని చెల్లించాలి. రెపోరేటులో మార్పులు చివరికి హోమ్ లోన్లు వంటి అప్పులను ప్రభావితం చేస్తుంది. రెపోరేటు పెరిగితే హోమ్ లోన్ లేదా బ్యాంకుల నుంచి తీసుకొనే లోన్ల వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఇది పరోక్షంగా లోన్లు తీసుకొనేవారిపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు బ్యాకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు పెట్టేవారికి వడ్డీ ఎక్కువ ఇస్తుంది. రుణాలపై వాణిజ్య బ్యాంకులు వసూలు చేసే వడ్డీ నుంచి డిపాజిట్ల నుంచి రాబడుల వరకు ప్రతిదీ పరోక్షంగా రెపోరేటుపై ఆధారపడి ఉంటాయి. రెపోరేటు పెరిగితే ఈఎంఐపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.. రెపోరేటును ఆర్‌బీఐ పెంచిందనుకుందాం.. అప్పటి వరకు 7 శాతంగా ఉన్న వడ్డీరేటు 7.4 శాతంగా మారుతుంది. రూ. 50 లక్షల హోమ్ లోన్ కు 20 సంవత్సరాలకు ఏడు శాతం వడ్డీతో ప్రతినెల రూ. 38, 765 ఈఎంఐ చెల్లించేవారు. పెరిగిన రేపోరేటు 7.4 శాతం వడ్డీ అయితే ఈఎంఐ రూ.39,974కు పెరుగుతుంది. రెపోరేటు తగ్గితే హోమ్ లోన్ కు సంబంధించిన ఈఎంఐ కూడా తగ్గుతుంది.
బ్యాంకులు ఎంత కాలంలో సర్దుబాటు చేస్తాయి?
రెపోరేటులో మార్పులు జరిగిన వారాల్లో బ్యాంకులు సాధారణంగా రుణం రేట్లను సర్దుబాటు చేస్తాయి. రెపోరేట్లకు అనుగుణంగానే హోమ్ లోన్ వంటివి ఆటోమెటిక్ సర్దుబాటు అవుతాయి. ఫిక్స్ డ్ లోన్ రేట్లు మాత్రం మారవు. రెపోరేటు పెరిగితే రుణగ్రహాతలు ఫ్లోటింగ్ రేటు నుంచి ఫిక్స్ డ్ రేటుకు మారవచ్చు. అయితే ఇది రుణదాత పాలసీలు, కన్వర్షన్ ఫీజులపై ఆధారపడి ఉంటుంది. హోంలోన్ లేదా ఇతర రకాల లోన్లలో ఫిక్స్‌డ్ వడ్డీరేట్లు అయితే ఈఎంఐలలో మార్పులు ఉండవు. ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు అయితే ఈఎంఐలలో మార్పులుంటాయి.
రివర్స్ రెపోరేటు అంటే ఏంటి?
బ్యాంకులు తమ వద్ద డబ్బు ఎక్కువగా ఉందని అనుకుంటే దానిని రిజర్వ్ బ్యాంకుకు అప్పుగా ఇవ్వవచ్చు. అలా వాణిజ్య బ్యాంకుల వద్ద రుణాలుగా తీసుకున్న దానికి ఆర్‌బీఐ చెల్లించే వడ్డీనే రివర్స్ రెపోరేటు అంటారు. ఇది రెపోరేటు కంటే తక్కువగా ఉంటుంది. మార్కెట్లు అస్ధిరంగా ఉన్న సమయంలో బ్యాంకులు తమ వద్ద ఉన్న డబ్బును ఆర్‌బీఐ వద్ద దాచి తక్కువ వడ్డీని తీసుకుంటాయి. ప్రతి వాణిజ్య బ్యాంకు ప్రజల నుంచి సేకరించే డిపాజిట్లలో కనీసం 4 శాతం ఆర్ బీ ఐ వద్ద జమ చేయాలి. బ్యాంకులు దివాళా తీసినా… ఇతర ఇబ్బందులు వస్తే ఆర్ బీఐ వద్ద ఉన్న డబ్బును డిపాజిటర్లకు అందిస్తారు. దీన్నే నగదు నిల్వల నిష్ఫత్తి అని అంటారు. ఈ డబ్బుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి వడ్డీ చెల్లించదు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram